ఇంటిగ్రేటెడ్ ఆదర్శమే.. ఈ స్కూళ్ల సంగతేంది?
ఒక పార్టీ అధికారం కోల్పోయి.. మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడల్లా పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం

ఒక పార్టీ అధికారం కోల్పోయి.. మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడల్లా పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం, కొత్త పథకాలు తీసుకురావడం మామూలే. అయితే కొత్త పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి రాకముందే మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని మార్చేయడం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం.
అయితే, సంక్షేమ పథకాల్లో మార్పులు, చేర్పులు చేసినా, పెద్దగా ఇబ్బందేమి ఉండదు. కానీ యువత భవిష్యత్తును నిర్ణయించే, విద్యార్థుల జీవితాలను బాగు చేసే విద్యారంగంపైన ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ప్రయోగాలు చేయ డమే ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను పూర్తిగా విస్మరించి, కొత్త విద్యాసంస్థలను అరకొర వసతుల నడుమ హడావుడిగా ప్రారంభించడం, కొన్నాళ్లకే వాటిని గాలికొదిలేయడం ఆందోళనకు గురి చేస్తోంది.
గత ప్రభుత్వం హంగామా చేసినప్పటికీ..
ఇటీవల రిలీజ్ చేసిన అసర్-2024 రిపోర్టు ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం గవర్నమెంట్ స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. మరో 18.9 శాతం స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నా అవి విద్యార్థులు ఉపయోగించే స్థితిలో లేవని తేలింది. అమ్మాయిలకు పాఠశాలల్లో ప్రత్యేకంగా టాయ్ లెట్స్ లేవు. 53% పాఠశాలల్లోనే తాగునీటి సౌకర్యం ఉంది. మిగతా పాఠశాలల్లో విద్యార్థులే ఇళ్ల నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి కనీస సౌకర్యాలపై ప్రభుత్వం ముం దుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సర్కార్ స్కూళ్లను బాగుచేసే ఉద్దేశంతో మన ఊరు - మనబడి అంటూ కొన్ని రోజుల పాటు నానా హంగామా చేసి ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. ఈ స్కీమ్‌లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు వెయ్యికిపైగా ప్రారంభించారు. నియోజకవర్గానికి ఒక చోట తప్ప ఎక్కడా సొంత భవనాలు నిర్మించలేదు. గురుకులాల పేరుతో అప్పటి ప్రభుత్వం సర్కార్ స్కూళ్లను పూర్తిగా విస్మరించింది. రేషనలైజేషన్ పేరిట చాలా స్కూళ్లను మూసివేసింది.
ప్రాధాన్యత దేనికి ఇస్తారు..?
అందుకే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కులాల పేరిట ప్రారంభించిన గురుకులాలు సరికాదని, కులాలు, మతాలకతీతంగా తాము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించబోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 55 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తూ మొత్తం 11 వేల కోట్ల నిధులు మంజూరు చేసింది. కులాలు, మతాలకతీతంగా విద్యార్థులంతా ఒకే చోట చదువుకోవడం ఆదర్శనీయమే. కానీ ఇప్ప టికే సమస్యల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి, వాటి భవిత్యవంపైనా ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే బాగుండేది. కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో ఇప్పటికే ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ, ఇతర పాఠశాలలను విలీనం చేస్తారా? లేక ఇవి ప్రత్యేకంగా ఉంటాయా? వీటికి ప్రాధాన్యత ఇస్తారా లేక కొత్తవాటికి మాత్రమే నిధులు కేటాయించి వాటి అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెడతారా? అనేది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల్లో ప్రశ్నగా ఉంది.
ఒకే గొడుగు కిందికి తీసుకురాలేరా?
రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ పరిధిలో ప్రైమరీ, హైస్కూళ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్టీలకు ప్రత్యేకంగా ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), ఏకోపాధ్యాయ పాఠశాలలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకురాబోతుంది. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించడానికి ముందు ప్రభుత్వ విద్యారంగంలో అన్ని రకాల స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోతే రాష్ట్రంలో సమస్యలకు నిలయంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకుల హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్ట్, గెస్టు ఫ్యాకల్టీ కాకుండా ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. ప్రభుత్వం ప్రారంభించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అన్ని వర్గాలకు అడ్మిషన్ వచ్చేలా రిజర్వేషన్‌లు పక్కాగా అమలు చేయాలి. కులాలు, మతాలకతీతంగా విద్యార్థులంతా సోదరభావంతో ఒకేచోట చదువుకున్నప్పుడే విద్వేషాల్లేని నవ భారతం నిర్మాణమవుతుంది.
- కసిరెడ్డి మణికంఠ రెడ్డి,
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
75695 48477