కొత్త పాఠశాల వ్యవస్థలకు శ్రీకారం

రాష్ట్ర విద్యాశాఖ 117 ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు, కొత్త పాఠశాల వ్యవస్థలను శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటూ ఉత్తర్వులు

Update: 2025-03-27 00:45 GMT
కొత్త పాఠశాల వ్యవస్థలకు శ్రీకారం
  • whatsapp icon

రాష్ట్ర విద్యాశాఖ 117 ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు, కొత్త పాఠశాల వ్యవస్థలను శ్రీకారం చుట్టినట్లు పేర్కొంటూ ఉత్తర్వులు విడుదల చేసింది. వీటిలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... అమలులో ఉన్న ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను ఐదు రకాల పాఠశాలల వ్యవస్థగా మార్పు చేస్తూ ప్రాథమికోన్నత పాఠశాలలను, హై స్కూల్ ప్లస్‌లను రద్దు చేసేలా నిబంధనలను ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రాథమికోన్నత పాఠశాల రద్దు కావడం, మరికొన్ని చోట్ల ఉన్నతీకరణ కావడం లాభనష్టాలను బేరీజు వేయాల్సి వస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థ రద్దయిన చోట్ల మూడు కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందడం కరువు అవుతుంది.

 దీంతో శాటిలైట్ ఫండమెంటల్ స్కూల్(పిపి 1, పిపి 2) ఫండమెంటల్ స్కూల్ (పిపి1, పిపి 2,1,2 తరగతులు), బేసిక్ ప్రైమరీ స్కూల్ (పిపి1, పి పి 2,1,2,3,4,5 తరగతులు), మోడల్ ప్రైమరీ స్కూల్(పిపి1, పి పి 2,1,2,3,4,5 తరగతులు), హై స్కూల్(6 నుంచి 10వ తరగతి) వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. మోడల్ ప్రైమరీ స్కూల్‌లలో నమోదు 60 దాటితే తరగతికి ఒక టీచరును కేటాయించడం జరుగుతుంది. కానీ బేసిక్ ప్రైమరీ స్కూల్‌లకు 30 మందికి ఒక టీచర్ ఉండేలా నిబంధనలు ఉండడం గమనార్హం.

కొన్ని స్కూల్స్ రద్దు.. ఉన్నతీకరణ

6, 7, 8 తరగతిలో విద్యార్థుల సంఖ్య 30 వరకు ఉంటే ఆ పాఠశాలలను డౌన్ గ్రేడ్ చేయడంతో ప్రాథమిక పాఠశాలలు ఏర్పడి 6, 7 ,8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. ఇదే మాదిరిగా 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలలుగా రూపుదిద్దుతారు. దీంతో కొన్నిచోట్ల ప్రాథమికోన్నత పాఠశాల రద్దు కావడం, మరికొన్ని చోట్ల ఉన్నతీకరణ కావడం లాభనష్టాలను బేరీజు వేయాల్సి వస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థ రద్దయిన చోట్ల మూడు కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందడం కరువు అవుతుంది. మోడల్ ప్రాథమిక పాఠశాలల నిర్మాణంలో పూర్తిగా తల్లిదండ్రుల అంగీకారంతోనే జరుగుతున్నది.

ఉత్తర్వు 117కు ప్రత్యామ్నాయాలు..

ప్రభుత్వ ఉత్తర్వు 117 ఉపసంహరణ దిశలో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై పలు సూచనలను పరిశీలిస్తే.. 2025 -26 విద్యా సంవత్సరం నుండి తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత మాత్రమే జీవో 117ను రద్దు పరచాలి, కొత్త నిబంధనల ప్రకారం స్టాఫ్ ప్యాట్రన్ లెక్కించాలి. సెక్షన్ వారీగా కాకుండా మొదటి 75 మంది మీడియం వారి విద్యార్థులకు ఉన్నత పాఠశాలలో 9మంది స్కూల్ అసిస్టెంట్‌లను మంజూరు చేయాలి. ప్రతి సంవత్సరం మే 31 నాటికి పై తరగతులకు వెళ్లే నమోదు ఆధారంగా స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించాలి.

క్లాసుల మెర్జింగ్ ఉపసంహరణ

ఆప్షన్- 1: అన్ని బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో 2025 -26 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి మాత్రమే కొనసాగించడం, ఆప్షన్- 2: 3,4,5 తరగతులు అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 2025 -26 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలి. ఆప్షన్-3:-3,4,5 తరగతులు పంచాయితీ స్థాయిలో ఉండే మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 2025 -26 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలి.

ఆప్షన్ 1,2,3 లలో ఏది అమలు పరిచిన తెలుగు, ఇంగ్లిష్ సమాంతర మాధ్యమాలను పెట్టాలి. అదనంగా అవసరమయ్యే టీచర్లను నియామకాల ద్వారా నింపాలి. మిగులు ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. లేని సందర్భంలో అదే పాఠశాలలో కొనసాగించాలి. 1:20 ప్రకారం ఎస్జీటీ పోస్టులను మంజూరు చేయాలి. ఉన్నత పాఠశాలలో బేసిక్ సెక్షన్ 30 మందికి తర్వాత ప్రతి 40 మందికి అదనపు సెక్షన్‌గా పరిగణించాలి. 30, 70, 110... నమోదు వారీగా 1,2,3,4 సెక్షన్లుగా పరిగణించాలి.

ప్రత్యేక కార్యక్రమాలతో..

ప్రస్తుతం జరుగుతున్న విద్యా సంవత్సరం ఏప్రిల్ 23 నాటికి పూర్తి కానుంది. రాబోయే కొత్త విద్యా సంవత్సరం 2025-26కు గాను పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుటకు గాను కొత్త అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ సిద్ధం చేసింది. దీంట్లో గతంలో లేని విధంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు కాబోతున్నాయి. రాబోయే విద్యా సంవత్సరంకు గాను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభమవుతాయి. ముందస్తుగా సిలబస్ నవంబర్ 2025 నాటికి పూర్తి చేసి డిసెంబర్ 2025 నుండి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపరిచేటట్లు, ప్రీ ఫైనల్ ఫిబ్రవరి 9 నుండి 19 వరకు, గ్రాండ్ టెస్ట్ మార్చి 2 నుండి 12 వరకు నిర్వహించి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సంసిద్దం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం అయ్యింది. దీంతోపాటు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి సిలబస్ మొత్తం పూర్తిచేసి 16 నుండి 10వ తరగతి బ్రిడ్జి కోర్సును కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 10వ తరగతిలో వచ్చే పాఠ్యాంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి 10వ తరగతిలో సులభంగా ఉత్తీర్ణత చెందుటకు వీలు కలగనుంది. కొత్త సంస్కరణల్లో భాగంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

- సి వి ప్రసాద్

రాష్ట్ర అధ్యక్షులు

ఏపీటీఎఫ్ అమరావతి

90590 76177

Tags:    

Similar News