ఒక సోక్రటీస్.. ఒక భగత్ సింగ్
ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల పరీక్షా కేంద్రాల గేట్ల వరకు వెంట వెళ్లి పరీక్ష ఎలా రాయాలో, రాసాక ఎక్కడ కలవాలో

ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల పరీక్షా కేంద్రాల గేట్ల వరకు వెంట వెళ్లి పరీక్ష ఎలా రాయాలో, రాసాక ఎక్కడ కలవాలో చెప్పే తల్లితండ్రులు, తలూపే పిల్లల్ని చూస్తుంటే వీళ్ల చదువుల్లో భగత్‌సింగ్, చంద్రశేఖర్ అజాద్, జతిన్‌దాస్, రాంప్రసాద్ బిస్మిలా లాంటి వీరుల జీవితాల గురించి ఒక్క పేజీ అయినా అర్ధం అయ్యేలా చదివించి ఉంటే దేశంలో ఇంతటి నైరాశ్యం, పిరికితనం ఉండేది కాదేమో అనిపిస్తోంది.
ధైర్యం అంటే కలబడి తిట్టుకుని, కొట్టుకోవడం కాదు. ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం నిలబడి పోరాటం చేయడం. తమ గురించి తమకు తెలియని ప్రజలను చైతన్యపరచడం. భగత్‌సింగ్ దేశ యువతకు స్ఫూర్తి కావాలనే మాటలు దశాబ్ధాలుగా వింటూనే ఉన్నాం అలాగే నాటి బ్రిటీష్ పాలకులు భగత్‌సింగ్ అతడి సహచరులను తీవ్రవాదులుగా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తే, నాటి జాతీయ నాయకులు వారిని కేవలం హింసా ప్రవృత్తి గల ఉద్రేకపరులుగా దేశానికి తెలియపరచే ప్రయత్నం చేసినట్లనిపిస్తుంది. ఇవి రెండూ భగత్‌సింగ్‌ని తీవ్రంగా అవమానించడమే. ఇలాంటి భావనలు, ప్రచారాలు బ్రిటిష్ వారు ఆ విప్లవ వీరులకు వేసిన ఉరిశిక్ష కంటే పెద్దవి.
23 ఏళ్లకే ప్రపంచ స్థాయి అలోచనలు..
మన పిల్లల పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుల వయసు నాటికి భగత్‌సింగ్ దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్య్రం బిక్ష కాదు హక్కుగా భావించాలని పిలుపిచ్చాడు. స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది. కానీ వచ్చాక దేశ విధానం, మార్గం సామ్యవాదం కావాలని, హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌ను 17 ఏళ్ల వయస్సులో స్థాపించాడు. శాండర్స్ హత్య, పార్లమెంట్‌పై జరిపిన బాంబుదాడిని మాత్రమే గుర్తుపెట్టుకుని భగత్‌సింగ్‌కి ఒక తెలుగు లేదా హింది మాస్ సినిమా హీరో ఇమేజ్‌ని కట్టపెట్టి ఆకాశమంత విశాలమైన, సముద్ర మంత గంభీరమైన అతడి ఆలోచనలను, మేధాశక్తిని, ప్రపంచంలో జరిగిన, జరుగుతూ ఉన్న పోరాటాలపై అతడికున్న అంచనాలను విశ్లేషణా సామర్థ్యాలను విస్మరించేసారు. నిజానికి 23 ఏళ్ళ జీవితంలో భగత్‌సింగ్ వెలిబుచ్చిన అభిప్రాయాల, ఆలోచనలు ప్రపంచస్థాయి ఉద్యమ నాయకులుగా గుర్తింపు పొందిన లెనిన్, స్టాలిన్, హాచిమిన్ వారి తర్వాత వచ్చిన కాస్ట్రో, చేగువేరా స్థాయిలో ఉన్నాయి.
విప్లవానికి సరికొత్త నిర్వచనం
మామూలుగా మనుషులు ఒక తరహా జీవితానికి అలవాటుపడి ఉంటారు దానిలో ఏదైనా మార్పు అంటే వణికిపోతారు. ఇదిగో ఈ బద్ధకపు భావన స్థానే ఒక స్ఫూర్తిని నింపడమే విప్లవం అని భగత్‌సింగ్ ఒక పత్రిక సంపాదకుడికి ఉత్తరం ద్వారా తెలిపాడు. మనం అసలైన భగత్ సింగ్‌ని తెలుసుకోవాలంటే ఆయన మిత్రులకు పంపించిన సందేశాలు, ఉత్తరాలు, జైలు డైరీ చదవాల్సి ఉంటుంది. భగత్ సింగ్ నాటి దేశ యువత పూర్తి నైరాశ్యంలో ఉన్నప్పుడు అనేక మాసాల కఠిన శ్రమ ద్వారా విప్లవకారులను సంఘటిత పరిచాడు, ప్రణాళికా వ్యూహాలు రచించాడు. ‘ఆయుధాలు సేకరించి విజయం సాధించే సమయాన పెద్ద ఎదురుదెబ్బ తగిలినా తట్టుకుని నిలబడండి. పరాజయాలకు తలవంచి కూలబడితే మనం ప్రయాణించే మార్గమే మూసుకుపోతుంది. అప్పుడు మనం దారిలోనే అడ్డంకులను తొలగించి ముందడుగు వేయడానికి బదులు మనమే ఇతరులకు అడ్డంకుగా తయారవుతాము’ అని సహచరులను సమావేశపరిచి చెప్పాడు. అందుకే అతడి జీవిత చరిత్ర వందల వ్యక్తిత్వ వికాసాలు, విజయ మార్గాల పుస్తకాలకు సమానం అనేది.
ఆయన త్యాగం గొప్పది!
మరణశిక్షకు ముందురోజు మిత్రుడు ప్రాణనాథ్ ద్వారా తెప్పించుకున్న జర్మన్ మార్కిృస్టు క్లారా జట్కిన్ రాసిన రెమినిసెస్సెస్ ఆఫ్ లెనిన్ పుస్తకాన్ని రాత్రంతా చదువుతూనే ఉన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు కానీ తమ చావు ఎప్పుడు ఏ క్షణాన ఉండబోతుందో తెలిసినా ప్రాణంకోసం ఎందులోనూ రాజీపడక, తల వంచక చివరి క్షణం వరకూ జీవితాన్ని ఆస్వాదించిన అరుదైన ధీరుల్లో భగత్‌సింగ్ ఒకడు. అతడి సాహసాలు, త్యాగమే కాదు ఆలోచనలు ఆశయాలు ఇంకా ఎంతో గొప్పవి. రాంప్రసాద్ బిస్మిల్, జతిన్‌దాస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ఇంకా ఇతర విప్లవ వీరులకు నివాళులు..
(నేడు షహీద్ దివస్ సందర్భంగా)
నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
94407 34501