పేర్ల మార్పు అవసరమా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అలాగే 55 సంవత్సరాల కిందట బల్కంపేటలో ప్రారంభమైన గాంధీ ప్రకృతి వైద్యశాలకు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లిలో నిర్మిం చిన రైల్వే టెర్మినల్‌కు కేంద్ర సహకారంతో అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్‌గా నామకరణం చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు. అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు. ఆయనను కులం గాటికి కట్టకూడదు, ఆయన విశ్వమానవుడు. ప్రకృతి వైద్యం అంటే గాంధీ అని, గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన అందరి మదిలో ఉంది. గాంధీ పేరు విశ్వవ్యాపితం, జాతిపిత పేరు తీసి రోశయ్య గారి పేరు పెట్టడం సముచితం కాదు. హైదరాబాద్‌లోని గవర్నమెంట్ గాంధీ నేచర్ క్యూర్ కాలేజీ భారతదేశంలోనే పురాతన సంస్థగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యశాల ప్రారంభించి యాభై ఏళ్లు గడుస్తున్నా ఇంకా పోస్ట్ గ్రాడుయేట్ కోర్సులు, రీసర్చ్ సెంటర్‌గా అభివృద్ధి చెందలేదు. సత్వరమే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు, పరిశోధన విభాగం ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ వాది మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పేరు పెడితే సమంజసంగా ఉంటుంది. గతంలో కళాశాలను అప్ గ్రేడ్ చేసి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర రాజ నరసింహ ప్రకటించారు. అందుకు అనుగుణంగా సత్వరమే యోగ ప్రాణాయామ కన్వెన్షన్ సెంటర్, బయోడైవర్సిటీ పార్క్, జీవన శైలి కేంద్రం ఏర్పాటు చేసి అందులో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తే సబబుగా ఉంటుంది. జాతిపిత పేరు తొలగిస్తే మనల్ని మనం దిగజార్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా వస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు అలాగే ఉంచి కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్‌కు సురవరం ప్రతాప రెడ్డి పేరు పెడితే సమంజసంగా ఉంటుంది.
డా. యం. అఖిల మిత్ర,
ప్రకృతి వైద్యులు
gbdsatp@gmail.com