కార్పొరేట్ రుణాలు.. ఎగవేస్తే నీరాజనాలు..

భారత బ్యాంకింగ్ వ్యవస్థలో కార్పొరేట్ రుణమాఫీల వలయంలో ప్రజా ధనం ఎలా మాయమవుతోందో గడచిన పదేళ్ల గణాంకాలు

Update: 2025-03-20 19:00 GMT
కార్పొరేట్ రుణాలు.. ఎగవేస్తే నీరాజనాలు..
  • whatsapp icon

భారత బ్యాంకింగ్ వ్యవస్థలో కార్పొరేట్ రుణమాఫీల వలయంలో ప్రజా ధనం ఎలా మాయమవుతోందో గడచిన పదేళ్ల గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం, 2014 నుండి 2024 వరకు రూ.16.35 లక్షల కోట్ల మొండి బాకీలు రద్దు చేశామని తెలిపింది. అందులో రూ.9.26 లక్షల కోట్ల వరకు బడా పారిశ్రామికవేత్తలు, సేవా రంగ సంస్థలకు చెందినవి కావడం గమనార్హం. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్య ప్రజలను ఎలా వేధించి రుణ వాయిదాలు, వడ్డీలతో సహా ఏలా వసూళ్లు చేసేది ప్రజలందరికీ తెలుసు. అందుకు పూర్తి భిన్నంగా, కార్పొరేట్ వర్గాలకు ఎలా అనుకూలంగా వారికి పాదాక్రాంతమై ఊడిగం చేస్తూ, సాగిలపడి వ్యవహరిస్తోందో తెలియజేస్తుంది.

చిన్న రైతులు, మధ్య తరగతి ప్రజలు కొన్ని లక్షల రుణాలను చెల్లించలేకపోతే వారికి కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదురవుతాయి. అదే సమయంలో, వేల కోట్ల అప్పు చేసిన కార్పొరేట్ కంపెనీలు ఎటువంటి నష్ట పరిహారం చెల్లించకుండా ఈ వ్యవస్థ నుంచి బయటపడటాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే అర్థమయ్యేలా చేస్తున్నాయి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఇచ్చిన గణాంకాల ప్రకారమే దేశంలోని వాణిజ్య బ్యాంకులు 2024 డిసెంబర్ 31 నాటికి 29 కంపెనీలను మొండి బాకీలుగా గుర్తించాయి. వీటిలో ప్రతి సంస్థ కనీసం రూ.1,000 కోట్లకు పైగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. మొత్తం రుణ బకాయిల విలువ రూ.61,027 కోట్లకు పైగా ఉంది.

మొండి బాకీల రద్దులో తరిస్తూ...

గత పది సంవత్సరాల్లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో బ్యాంకుల్లో మొండి బాకీల రద్దు గణనీయంగా పెరిగింది. 2014-15లో రూ.58,786 కోట్లు మాత్రమే రద్దు చేయగా, 2018-19 నాటికి ఇది రూ.2,36,265 కోట్లకు చేరుకుంది. 2023-24 నాటికి రూ.1,70,270 కోట్ల రుణాలు రద్దు అయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం, దేశ బ్యాంకింగ్ వ్యవస్థ కార్పొరేట్ వర్గాలను ప్రోత్సహించే విధంగా మారిందని అర్థమవుతోంది.

కోర్టుల చుట్టూ రైతులు

ఈ విధానం వలన కలిగే ప్రధాన నష్టం సామాన్య ప్రజానీకానికే కానీ అధికారం చెలాయించే రాజకీయ నేతలకు, బడాబాబులకు ఏమీ కాదు. ఒక రైతు రూ.లక్ష రుణం తిరిగి చెల్లించలేకపోతే, అతని భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే సమయంలో, కార్పొరేట్ సంస్థలు దివాళా చట్టం ద్వారా తమ రుణాలను తక్కువ మొత్తంలో సెటిల్ చేసుకుని తప్పించుకుంటాయి. బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు వారికి మార్గం సుగమం చేస్తాయి. వామపక్ష ఆర్థికవేత్తలు ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బ్యాంకులు ప్రజల పొదుపు మొత్తాన్ని పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీ రేటుతో అందజేసి, తిరిగి రాబట్ట లేకపోతే ‘అంతే’ అని చేతులు దులుపుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. ప్రజలు ఆదాయపు పన్నులు చెల్లించనప్పుడు విధించే దండన, కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగరవేసినప్పుడు లభించే రాయితీ ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

రికవరీ కోసం ప్రత్యక్ష చర్యలు..

ఈ సమస్యకు పరిష్కార మార్గాలు అనేకం. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరగాలి. మొండి బాకీలుగా గుర్తించిన సంస్థల వివరాలను పూర్తిగా వెల్లడించాలి. కార్పొరేట్ రుణ మాఫీలకు నియంత్రణలు ఉండాలి. భారీ మొత్తంలో రుణాలు మాఫీ చేయకుండా, వాటి రికవరీ కోసం ప్రభుత్వమే ప్రత్యక్షంగా చర్యలు చేపట్టాలి. చిన్న రైతులకు, మధ్య తరగతి వర్గాలకు ఒక విధానం, కార్పొరేట్ సంస్థలకు మరో విధానం అనేది ఆర్థిక అసమానత. ప్రస్తుతం దేశ బ్యాంకింగ్ విధానం కొన్ని వర్గాలకు మాత్రమే లాభాన్ని తెచ్చిపెడుతోంది. సామాన్య ప్రజలు మోయాల్సిన భారం పెరుగుతూనే ఉంది. కార్మిక వర్గాలు తమ జీవితాన్ని గడవలేని స్థితిలో ఉండగా, కార్పొరేట్ వర్గాలకు మాత్రం వేల కోట్ల రూపాయలు రుణం మాఫీ అవ్వడం ఏ న్యాయం? ఇది తక్షణమే మారాలి. 

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Tags:    

Similar News