స్త్రీలపై కుల, వర్గాతీత దాడులు..
భారతీయ స్త్రీ స్వేచ్ఛా సమానత్వాలను నిలుపుకోడానికి ఎంత పోరాటం చేస్తున్నప్పటికీ వారిపై ముప్పేట దాడులకు అడ్డుకట్ట

భారతీయ స్త్రీ స్వేచ్ఛా సమానత్వాలను నిలుపుకోడానికి ఎంత పోరాటం చేస్తున్నప్పటికీ వారిపై ముప్పేట దాడులకు అడ్డుకట్ట వేయలేకపోవడంలో మన వ్యవస్థలన్నీ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. విద్య, సంస్కృతి, కళలు, స్వేచ్ఛ ఒక ప్రక్క కన్పిస్తూనే మరొక పక్క శిథిలమవుతున్న దశ ఈ కాలంలో మనకు దృగ్గోచరమవుతుంది. పురోగమనానికి, తిరోగమనానికి జరిగే సంఘర్షణ ఈ యుగంలో అభివ్యక్తమవుతుంది.
నిజానికి ఏ రంగంలో చూసినా స్త్రీలు ముందడుగు వేయడంపై మనువాదులు సహించలేకపోతున్నారు. మను స్మృతి భావాలు పునరుజ్జీవనం అవుతున్నాయి. అందుకే కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, హైస్కూల్‌లో చదువుతున్న పిల్లల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఆధునిక మహిళా వ్యవస్థపై మనుస్మృతి భావజాలంతో దాడులు విపరీతంగా జరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014లో ఇండియాలో మహిళలపై నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్లలో అవి 31శాతం మేర ఎగబాకాయి. అంతర్జాలం, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అశ్లీల చిత్రాలు, వీడియోలకు తోడు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, మాదక ద్రవ్యాల వినియోగంతో మనుషుల్లో పశు ప్రవృత్తి కోరలు చాస్తోంది. ఆడ పిల్లల్ని వేధించడాన్ని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్ని హీరోయిజంగా చూపిస్తున్న సినిమాలు, వెబ్‌సీరీస్‌లూ యువతను దారితప్పిస్తున్నాయి. స్త్రీలను ఆటబొమ్మలుగా చిత్రీకరించే పెడపోకడలు పెరిగిపోతుండటంతో పనిప్రదేశాలూ బహిరంగ స్థలాలు.. ఇలా అన్నిచోట్లా మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిలపై రోత వ్యాఖ్యల దాడి నిరంతరంగా కొనసాగుతోంది.
స్త్రీ విద్యను దెబ్బతీసే యత్నాలు..
నవతరం నైతిక విద్యకు దూరమవుతున్న కొద్దీ దేశ భవిష్యత్తుపై చీకట్లు దట్టమవుతున్నాయి. బడి వయసు బాలురూ అమ్మాయిలపై హేయ నేరాలకు ఒడిగడుతుండటమే దీనికి నిదర్శనం. ఈ దుస్థితిని నివారించాలంటే పాఠశాల ‘దశ నుంచే పిల్లలకు మంచీ చెడులు బోధించాలి. సమాజంపై విస్తృతంగా ప్రభావం చూపించే సినిమాలు, ఇతర దృశ్యమాధ్యమాలు, కళారూపాలు ఏవైనా సరే, విలువలతో కూడిన ఆదర్శనీయ వ్యక్తిత్వాలకే నాయక స్థానమివ్వాలి! ఈ విశ్లేషణను మనం గమనిస్తే మన కళ్ళముందే ఎన్నో దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ స్త్రీల విద్యపైన జీవన వ్యవస్థలపైన దెబ్బతీయాలనే కక్షకార్పాణ్యాలు జరుగుతున్నాయని మనకు అర్థం అవుతుంది. ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023-24 నివేదికలో 177 దేశాల వరుసలో భారత దేశానికి 128వ ర్యాంకు మాత్రమే లభించింది.
ప్రేమించకుంటే.. పెళ్లాడకపోతే హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌లో ఇంటర్ చదివే విద్యార్థినికి ఒక రౌడీ వెంటబడి నన్ను ప్రేమించమని బలవంతం చేసి ఆమె నిరాకరించినందుకు కత్తితో పొడిచి చంపాడు. బాపట్ల జిల్లాలో కూడా ఇటీవల ఒక బాలిక తన ప్రేమను అంగీకరించలేదని కత్తితో దాడి చేసి, కుటుంబ సభ్యులపై కూడా దాడిచేసి చంపిన ఘటనకు అందరు నివ్వెరపోయారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఒక ఉన్మాది తన ప్రేమను అంగీకరించలేదని యువతి నోట్లో యాసిడ్ పోసి చంపాడు. ఇలా మనం ఈ ఘటలను ప్రతి రోజు పత్రికల్లో బీభత్స ప్రధానంగా చూస్తున్నాం. ఇవన్నీ యువతుల విద్యార్జన సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే పెద్ద ఉద్దేశ్యంతో ప్రయత్నాలుగా జరుగుతున్నాయి. ఇవి కేవలం స్కూళ్లు, కాలేజీల్లో కాదు, యూనివర్సిటీల్లోనే, చివరకు అధ్యాపకులు, ఆచార్యులు కూడా విద్యావంతులైన స్త్రీలను వేధించే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇక గ్రామాల్లో ఉపాధి హామి పథకానికి నిధులు తగ్గించడం వల్ల కూడా ఊరిలో పని తగ్గి వలసలకు వెళుతూ ఆటోలకు యాక్సిడెంట్స్ అయి చాలామంది మరణిస్తున్నారు.
ఉచిత బస్సు సౌకర్యమే స్త్రీకి రక్షణ
ప్రభుత్వాలు స్త్రీలకిచ్చిన వాగ్దానాలు తప్పడానికి వెనుకంజ వేయడం లేదు. స్త్రీలకిచ్చిన వాగ్దానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లయితే గ్రామాల్లో పని లేక ఇతర ఊరులకు ప్రయాణిస్తున్న శ్రామిక మహిళలకు ఎంతో మేలు జరిగేది. నిరంతరం ఉదయ కాలాన్నే పత్రికల్లో శ్రామిక స్త్రీలు మరణించిన దృశ్యాలు అందరిని కలచి వేస్తున్నాయి. ప్రభుత్వానికి ఎన్నో బస్సులు ఖాళీగా ఉన్నా పేద ప్రజల మేలుకోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయకుండా ఎన్నో కుటుంబాల ఉసురు తీస్తున్నారు. మరో పక్క స్త్రీ బాలిక విద్యా వ్యాప్తికి ఉపకరించే తల్లికి వందనం స్కీమ్‌ను ప్రారంభించకుండా వాగ్దాన భంగంతో కాలక్షేపం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొపక్క తిరుపతిలో వస్తున్న ఆదాయాన్నంతా అన్ని రాష్ట్రాల్లో దేవాలయాలను కట్టడానికి ఉపయోగిస్తామని సీఎం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాలికా విద్యావ్యాప్తి కోసం ఉపయుక్తం చేయవలసిన బాధ్యతను మరచిపోయారు. దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో వస్తున్న ధనాన్ని విద్యకు ఉపయుక్తం చేయడం ద్వారా స్త్రీ సామాజిక వ్యక్తిత్వాన్ని పెంచే కార్యక్రమాలకు ఉపయుక్తం అవుతుందన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. అన్ని దిశలుగా స్త్రీల మీద, యువతులమీద, బాలికల మీద శ్రామికుల మీద జరిగే దాడులతో భారతదేశం కకావికలం అవుతుంది. మహాత్మాఫూలే, డా. బి.ఆర్.అంబేడ్కర్ వంటి మహోన్నతులు స్త్రీ సాధికారిత కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తితో, స్త్రీ పునర్వికాసం కోసం అందరూ పోరాడాల్సిన సందర్భం ఇది. ఆ దిశగా సాగుదాం.
డా. కత్తి పద్మారావు
98497 41695