ఓటరు మనసులో ఏముంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సమయం దగ్గర పడుతున్నది.

Update: 2023-07-24 19:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సమయం దగ్గర పడుతున్నది. ‘తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే’ అని బీజేపీ నాయకులు, ‘తెలంగాణలోనూ కర్నాటక ఫలితమే రిపీట్‌ అవుతుంద’ని కాంగ్రెస్‌ నాయకులు, ‘‘హ్యాట్రిక్‌’’ కొట్టబోతున్నాం అని బీఆర్‌ఎస్‌ నాయకులు సమర శంఖాలు పూరిస్తున్నారు. తమ పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీ నాయకుల మనసుల్లో ఉంది. కానీ, ‘‘ఓటరు మనసులో ఏముందో’’ తెలుసుకోకుండానే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతలు ఊహల్లో విహరిస్తున్నారు.

ప్రజలనాడి తెలుసుకోవడానికి పీపుల్స్‌ పల్స్‌ సంస్థ పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా అనేక సర్వేలు చేస్తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వివిధ రాజకీయ పార్టీలపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడంతోపాటు వాటి పూర్వపరాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తూ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా నివేదికలు, ఎగ్జిట్‌ పోల్స్‌ పీపుల్స్‌పల్స్‌ సంస్థ వెల్లడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలపై పీపుల్స్‌పల్స్‌ సంస్థ గత మూడు నెలలుగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నది. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి ఉందని ఈ అధ్యయనంలో తేలింది. మెజారిటీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు వీరిపై మొహమాటం లేకుండా పెదవి విరుస్తున్నా, ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే స్థితిలో ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు లేవు. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపి మరొకరికి అవకాశం ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకోవడం లేదు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత

సిట్టింగు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా, 40 శాతానికి పైగా ప్రజలు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ప్రతిష్టలు కూడా ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ‘ఓటు వేసేటప్పుడు దేన్ని చూస్తారు’ అని 2018లో చేసిన ఒక సర్వేలో అడిగినప్పుడు 43 శాతం మంది అభ్యర్థిని చూసి వేస్తామంటే, 27 శాతం మంది పార్టీని, 21 శాతం మంది ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తామని చెప్పారు. దీనికి తగ్గట్టుగానే 2018 ఎన్నికల్లో 63 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో బీఆర్‌ఎస్‌ ఐదుగురు అభ్యర్థులను మారిస్తే, ఐదుగురూ గెలిచారు. ఆ ఎన్నికల్లో 14 మంది సిట్టింగులు ఓడిపోగా, వీరిలో నలుగురు క్యాబినెట్‌ మంత్రులు, శాసనసభ స్పీకర్‌ కూడా ఉన్నారు.

2018లో కాంగ్రెస్‌ నుంచి 12 మంది సిట్టింగులు పోటీ చేస్తే, ఇద్దరే గెలిచారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తప్ప స్వయం ప్రకటిత సీఎం అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మార్చకపోవడం వల్లే బీజేపీ లాభపడిరది. పోటీ చేసే అభ్యర్థి ఎంత కీలకమో చెప్పడానికి ఈ ఉదంతాలే నిదర్శనం! సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్‌, బీజేపీ ఇతర పార్టీ నాయకులు ... ‘‘మీ పాలన మీద నమ్మకముంటే, సిట్టింగులకు టికెట్‌ ఇచ్చి గెలవండి’’ అని బీఆర్‌ఎస్‌కి సవాల్‌ విసురుతున్నారు. కాబట్టి, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంతమంది సిట్టింగులను మారుస్తుంది వాళ్లను మారిస్తే, చెలరేగే అసంతృప్తిని ఎలా చల్లారుస్తారనేది బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్ద సవాల్‌.

కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదా..!

కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేశామని కాంగ్రెస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారు. కానీ, మూలాలకు వెళ్లి చూస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కి ఎప్పుడూ లేదు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంతంలోని 119 సీట్లలో కాంగ్రెస్‌ 50 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌ 61కి 2009 నుంచీ దూరంగానే ఉంది.

తెలంగాణ ఇస్తే రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను కానుకగా ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీని నమ్మించారు. సీఎస్డీఎస్‌-లోక్‌ నీతి డేటా ప్రకారం 2014లో తెలంగాణ రావడానికి కారణం ఎవరని అడిగినప్పుడు, 44 శాతం మంది కాంగ్రెస్‌ పార్టీకి క్రెడిట్‌ ఇవ్వగా, 18 శాతం మందే బీఆర్‌ఎస్‌కి ఇచ్చారు. అదే సర్వేలో తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అడిగినప్పుడు 56 శాతం మంది కేసీఆర్‌ కావాలని ప్రజలు కోరుకున్నారు. దీన్ని బట్టి తెలంగాణలో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లో లేరన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కి సమ్మోహనశక్తి కలిగిన నాయకుడు లేకపోవడం ఒక లోటుగా మిగిలిపోయింది. 2009లో డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి మరణానంతరం తెలంగాణలో జరిగిన అన్ని ఉపఎన్నికలు, రెండు సాధారణ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52 స్థానాల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది.

2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ 75 జెడ్పీటీసీలతో సరిపెట్టుకోగా, బీఆర్‌ఎస్‌ ఏకంగా 446 స్థానాల్లో గెలిచింది. బీజేపీకి 8 స్థానాలే దక్కాయి. బీఆర్‌ఎస్‌ 3556 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 1377, బీజేపీ 211 స్థానాలకు పరిమితమయ్యాయి. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 7774, కాంగ్రెస్‌ 2709, బీజేపీ 163 స్థానాలు గెలిచాయి. 2009 తర్వాత జరిగిన ఏ ఎన్నికల ఫలితాలను చూసినా, బీఆర్‌ఎస్‌ గ్రామస్థాయి నుంచి బలపడుతుండగా, కాంగ్రెస్‌ బలం దిగజారుతోంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామస్థాయి నుండి పటిష్టవంతంగా ఉండటం వల్లే 2018లో 50 శాతానికి పైగా ఓట్లతో ఆ పార్టీ 51 ఎమ్మెల్యేలను గెలుచుకుంటే, కాంగ్రెస్‌ కేవలం 6 సీట్లలోనే 50 శాతానికి పైగా ఓట్లను సాధించగలిగింది. పైగా, 2018లో గెలిచిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీ ఫిరాయించారు. ఉప ఎన్నికలో మరో సీటు కోల్పోయి చివరికి ఐదుగురే మిగిలారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నాయకులు పార్టీ మారడం వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా వీరు ఎంతవరకు పార్టీలో కొనసాగుతారనే అనుమానం ప్రజల్లో ఉంది. ఈ అనుమానం తీర్చడానికి కాంగ్రెస్‌ ఇప్పటివరకూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా, వరుసగా పలు ఎన్నికల్లో, ఇన్ని స్థానాల్లో ఎందుకు ఓడిపోతున్నామని ఆత్మపరిశీలన చేసుకోకుండా, రాబోయే ఎన్నికల్లో అధికారంలో వస్తామని ఇక్కడ నేతలు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.

2018లో ఓడిపోవడానికి కారణాలేంటో విశ్లేషించుకోకుండా, కేవలం చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం వల్లే పుట్టి మునిగిందని కాంగ్రెస్‌ నాయకులు క్లబ్బుల్లో కబుర్లు చెప్పుకుంటారు. కానీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవడాన్ని 41 శాతం మంది ప్రజలు స్వాగతించగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్‌ వల్లే కాంగ్రెస్‌కి ఇంకా కొన్ని సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ నియమించుకున్న వ్యూహకర్త సునిల్‌ కనుగోలు నివేదిక ప్రకారం కూడా దాదాపు 45 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వీటన్నింటినీ పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు పెరిగినా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనట్లు స్పష్టమౌతోంది. కాంగ్రెస్‌ పార్టీ 30-35 సీట్ల మధ్య ఆగిపోవచ్చు.

సామాజికవర్గాల వారీగా మద్దతు...

ఎన్నికల రాజకీయాల్లో సామాజికవర్గాల పాత్ర అత్యంత కీలకమైంది. వివిధ సామాజికవర్గాల మద్దతును కూడగట్టడంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం సఫలీకృతం అయ్యింది. ‘కాంగ్రెస్‌ అంటే రెడ్లదే’ అనే మాట చాలా విరివిగా వినపడుతుంటుంది. కానీ, 2014 ఎన్నికల్లో కేవలం 7 శాతం మంది రెడ్లు కాంగ్రెస్‌కి ఓటు వేయగా, 52 శాతం మంది బీఆర్‌ఎస్‌ వైపు నిలబడ్డారు. 2018 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రిపీట్‌ అయ్యింది. 2018లో కాంగ్రెస్‌కి బీసీలు కూడా దూరమయ్యారు. 2018లో 29 శాతం మంది బీసీలు కాంగ్రెస్‌కి ఓటు వేయగా, 50 శాతం మంది బీఆర్‌ఎస్‌కి, 9 శాతం మంది బీజేపీకి ఓటేశారు. ఎస్సీలు బీఆర్‌ఎస్‌కి 53 శాతం, కాంగ్రెస్‌కి 30 శాతం, బీజేపీకి 4 శాతం ఓట్లు వేశారు. ఎస్టీల్లో బీఆర్‌ఎస్‌కి 43 శాతం, కాంగ్రెస్‌కి 42 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వేశారు. ఓసీలు బీఆర్‌ఎస్‌కి 47 శాతం, కాంగ్రెస్‌కి 25 శాతం, బీజేపీకి 13 శాతం ఓట్లు వేశారు. ఎం.ఐ.ఎంని మినహాయిస్తే 2014లో 60 శాతానికిపైగా ముస్లింలు కాంగ్రెస్‌ వైపు నిలబడితే, 2018 వచ్చేసరికి 80 శాతం మంది బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. ఇలా సామాజిక వర్గాల మద్దతు కోణంలో చూసినా బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌, బీజేపీలు చాలా వెనకబడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు కులముద్రలున్నాయి. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం కులముద్ర లేదు. కుటుంబ పార్టీగా మాత్రం పేరుంది. సమాజంలోని సకలజనులు, అన్ని సామాజికవర్గాలు బీఆర్‌ఎస్‌కు మద్దత్తిస్తుండటంతో ఒక బలమైన శక్తిగా మారింది.

(మిగతా రేపు)


జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email peoplespulse.hyd@gmail.com


Similar News