మోడీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం తమకు అనుకూల ప్రాచీనతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నది. లౌకిక విద్యా సమర్థకులు గీతను పాఠంగా చేర్చడాన్ని తప్పు పడుతున్నారు. భగవద్గీతలో యుద్ధానికి విముఖంగా ఉన్న అర్జునుడికి 'యుద్ధం క్షత్రియ ధర్మం' అని చెబుతూ కొనసాగే 700 శ్లోకాలు ఉంటాయి. అప్పటి సామాజిక వ్యవస్థ తీరు తెన్నులు, ఉనికిలో ఉన్న కొన్ని మంచి విలువలను, ఉదాత్తతను చెప్పడంలో ఎలాంటి సమస్యలు రావు. కానీ, ఇప్పటికే చేర్చిన పాఠాలలో 'ఇవి మన పండుగలు, అవి వారి పండుగలు' అనే ధోరణులు కొనసాగుతున్నాయి. అన్య మతస్థుల, హిందూ మత విశ్వాసంలో ఉన్న బహుజనుల ఆహార సంస్కృతి మీద వికృత దాడులు జరుగుతున్నాయి. మెజారిటీ మతాల ఆధిపత్యాన్ని, విలువలను ఇతరులకు రుద్దే ధోరణులు కొనసాగుతున్నాయి.
ప్రజల వ్యక్తిగత మత విశ్వాసాలను రాజకీయ అధికారం కోసం వాడుకోవడం పరాకాష్టకు చేరుకుంది. దేశంలో శతాబ్దాల నుండి విలసిల్లుతున్న బహుళ సంస్కృతి, జాతీయోద్యమం వంటి ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం రాజ్యాంగ ప్రవేశిక. దాని స్ఫూర్తిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి చర్యలకు గుజరాత్ ఒక ప్రయోగ కేంద్రంగా మారింది. ప్రయోగ ఫలితాలు దేశమంతటా ఆక్టోపస్‌లా దేశమంతా విస్తరిస్తున్నాయి.
మతం ఆధారంగా ప్రజలను సమీకరించడం, మైనారిటీలను ద్వేషించడం, విద్వేషం చిమ్మడం ద్వారా అన్య మతస్థులలో అపనమ్మకాన్ని కలిగించడం నిత్యకృత్యంగా మారిపోయింది. 2014 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన ఎన్‌డీఏ ఇపుడు తన పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నది. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి కల్పనలో అతి దారుణంగా విఫలమైంది. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక నిరుద్యోగ రేటు 8.10 శాతంగా నమోదైంది. నిత్యావసరాల ధరల అనూహ్య పెంపుతో ప్రజల జీవన ప్రమాణాలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్‌కు ప్రపంచ ఆకలి సూచికలో 101 వ స్థానం, అభివృద్ధి సూచికలో 131వ స్థానం రావడం దీనికి నిదర్శనం.
రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తూ
వివిధ వర్గాల ప్రజల నిరసనను తమ అధికారంతో అణచివేస్తూనే, వివక్ష , దోపిడి సహజమని చెప్పే తాత్వికతను సంఘ్ శక్తులు ప్రచారం చేస్తున్నవి. తమ శ్రమ ద్వారా సంపద సృష్టిస్తూ, వినియోగం ద్వారా పరోక్ష పన్నులు చెల్లిస్తున్న పేద, నిరుపేద వర్గాల ప్రజలను అవమానించే ప్రచారానికి అవి తెగబడ్డాయి. రాజ్యాంగ ప్రకరణ 21 ద్వారా జీవించే హక్కులో భాగంగా అభివృద్ధి అందరికి చేరాలనే సంకల్పాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ పేదలకు ఇచ్చే ఉచిత సంక్షేమ, సామాజిక భద్రతా పథకాల వ్యయం అభివృద్ధికి ఆటంకం అనే ప్రచారాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నాయి. శ్రామిక ప్రజలు చెల్లించిన మూల్యం తో ఎదిగిన మధ్యతరగతి, సంపన్న వర్గము నుండి వచ్చిన కొన్ని ఉద్యోగ వర్గాలవారు కృతజ్ఞత మరచి ఈ ప్రచారానికి వంత పాడుతున్నారు.
సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కాకూడదనే రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తూ ప్రజల సంపదను కార్పొరేట్‌లకు కట్టబెడుతున్నారు దేశ సంపదలో సగ భాగం ఒక శాతం ధనవంతుల దగ్గరనే ఉందని ఇటీవల ఆక్స్‌ఫామ్ వెలువరించిన నివేదికలో పేర్కొంది. గుజరాత్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీత తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇదే మార్గాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశాయి. జాతీయ విద్యా విధానం-2020లో పేర్కొన్నట్లుగా 'ప్రాచీనత-సంప్రదాయాలు విద్య ప్రక్రియలో మిలితం కావాలి' అనే క్రమంలో గీతను విద్యార్థులకు బోధించాలని పాలకులు చెపుతున్నారు. కానీ, 'దేశాన్ని 21 వ శతాబ్దంలో నడిపించడానికి 4వ పారిశ్రామిక విప్లవం, ఆధునిక ఇంజనీరింగ్ విద్య అవసరమని' NEP-2020 చెప్పింది. కళలు, సామాజిక శాస్త్రాల విద్యార్థులకు సైన్స్ నైపుణ్యాలను ఇవ్వాలని కోరింది.
వారి ఆధిపత్యాన్ని రుద్దడానికే
మోడీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం తమకు అనుకూల ప్రాచీనతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నది. లౌకిక విద్యా సమర్థకులు గీతను పాఠంగా చేర్చడాన్ని తప్పు పడుతున్నారు. భగవద్గీతలో యుద్ధానికి విముఖంగా ఉన్న అర్జునుడికి 'యుద్ధం క్షత్రియ ధర్మం' అని చెబుతూ కొనసాగే 700 శ్లోకాలు ఉంటాయి. అప్పటి సామాజిక వ్యవస్థ తీరు తెన్నులు, ఉనికిలో ఉన్న కొన్ని మంచి విలువలను, ఉదాత్తతను చెప్పడంలో ఎలాంటి సమస్యలు రావు. కానీ, ఇప్పటికే చేర్చిన పాఠాలలో 'ఇవి మన పండుగలు, అవి వారి పండుగలు' అనే ధోరణులు కొనసాగుతున్నాయి.
అన్య మతస్థుల, హిందూ మత విశ్వాసంలో ఉన్న బహుజనుల ఆహార సంస్కృతి మీద వికృత దాడులు జరుగుతున్నాయి. మెజారిటీ మతాల ఆధిపత్యాన్ని, విలువలను ఇతరులకు రుద్దే ధోరణులు కొనసాగుతున్నాయి. చాతుర్వర్ణ, కర్మ సిద్ధాంతాలను సమర్థించి, అసమానతలను సహజమైనవిగా చిత్రీకరించే ప్రమాదముందని రాజ్యాంగాన్ని గౌరవించే విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనుస్మృతి ఆధారిత సామాజిక పాలనా వ్యవస్థ స్థానంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ ప్రాతిపదికగా అంబేద్కర్ ఏర్పాటు చేసిన రాజ్యాంగమూ ప్రమాదంలో పడుతుంది. అన్ని మత విశ్వాసాలలో ఉన్న మంచిని భాషా, సామాజిక శాస్త్రంలో భాగం చేయాలనే సూచనను తిరస్కరిస్తున్నారు. దేశానికి విపత్తుగా మారిన ఛాందసుల నుండి దేశాన్ని కాపాడుకోవాలి.
వారి మార్గాలను అన్వయిస్తూ
సామాజిక విప్లవ సంస్కర్తలను ఏప్రిల్ నెల గుర్తు చేస్తుంది. దేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించిన అంబేద్కర్ జయంతి, మతోన్మాద శక్తుల మీద రాజీ లేకుండా పోరాడిన విప్లవోద్యమ ధృవతార జార్జ్ రెడ్డి అమరత్వం పొందిన రోజు ఏప్రిల్ 14న. వీరిద్దరు కూడా మతోన్మాద శక్తులతో పోరాడేలా ప్రజాస్వామికవాదులకు ఒక మార్గాన్ని ఏర్పరిచి వెళ్లారు. వివక్షత, అసమానతలను సమర్థించే శాస్త్రాలను, స్మృతులను చీల్చి చెండాడి, వాటి నుండి విముక్తికి విద్యను సాధనంగా మలిచారు అంబేద్కర్. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విద్య, విజ్ఞానం ద్వారా వస్తాయని సూత్రీకరించారు. పునరుద్ధరణ వాద చాందస శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరమని ఉస్మానియా అరుణతార జార్జ్ రెడ్డి స్పష్టం చేశారు. సాహసంతో మనలను గొప్ప ముందడుగు వేయించిన అంబేద్కర్, జార్జ్ రెడ్డి అందించిన కాగడాను తీసుకెళ్లాలి. అదే వారికి మనమిచ్చే ఘన నివాళి.
( నేడు అంబేద్కర్ జయంతి, జార్జ్ రెడ్డి వర్ధంతి)
అస్నాల శ్రీనివాస్
దొడ్డి కొమురయ్య ఫౌండేషన్
96522 75560