పెద్దల సభ ఫలితాలు పెద్ద సందేశమే..!

పార్టీలకు, నేతలకు మిడ్ టర్మ్ తరహా పరీక్షల లాగా ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే రాష్ట్రంలోని

Update: 2025-03-07 00:45 GMT
పెద్దల సభ ఫలితాలు పెద్ద సందేశమే..!
  • whatsapp icon

పార్టీలకు, నేతలకు మిడ్ టర్మ్ తరహా పరీక్షల లాగా ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే రాష్ట్రంలోని ఈ పెద్దల సభ ఫలితాలు పెద్ద సందేశమే ఇచ్చాయని అర్థమవుతోంది. గెలుపోటములపై ఆయా పార్టీలు అంతర్గత పోస్టుమార్టం చేసుకుంటున్నాయి. లీడర్ల వ్యాఖ్యానాలు సరేసరి. ఎనలిస్టులు ఎవరి కోణంలో వారు విశ్లేషిస్తున్నారు. 

సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో మూడు బహిరంగ సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారు. కేడర్‌నూ సమాయాత్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రయత్నం స్థాయిలో తాతిమ్మా నాయక గణం పాటుపడితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గెలుపు ఖాతాలో పడేది. ఎలా చూసినా ఏదో వ్యూహాత్మక తప్పిదంగానే తోస్తున్నది. ఇక తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు తమ పార్టీదేనని మురిసిపోతున్న బీజేపీ, దాని అనుబంధ విభాగాల సమన్వయాన్ని, అంకిత భావాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే మంచిది! ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఆ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీనిని ఒక అలెర్ట్ సిగ్నల్‌గా పాలక పక్షం పరిగణించాల్సి ఉంది. వాస్తవాల ప్రామాణికంగా అధ్య యనం అవసరం.

అదనపు ఓట్లు ఎటుపోయినట్లు..!

హస్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల బలగం ఉత్తర తెలంగాణలో తక్కువేమీ లేదు. "అదనపు ఓటు తెచ్చేవారు ఎవరైనా తనకు కావాల్సిన వారే.." అనే సూత్రాన్ని ముఖ్యంగా ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అణువణువునా పాటించేవారు. ఈ సూత్రాన్ని ఆయన కేబినెట్ సహచరుడిగా ఉన్న శ్రీధర్ బాబు మనసా వాచా కర్మణా అనుసరించారు. ఆ ప్రాతిపదికనే రెండోసారికి వైఎస్ ప్రభుత్వం అప్పట్లో రెన్యువల్ కాగలిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలోనూ కీలకమైన శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలోని పట్టభద్రుల నియోజకవర్గంలో ఆనాటి స్ఫూర్తి, స్పార్క్ ఉండాల్సింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి‌కి దుఃఖం తప్పేది. కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ అడ్డాగా మరోసారి కాలర్ ఎగరేసేది.

అలెర్ట్ సిగ్నల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటికి గాను ఒకటి గెలుచుకొని ఊపు మీదున్న బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం దక్కడం అవధుల్లేని ఆనందానికి బోనస్ అయింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రంగాల వారూ ఓటర్లుగా ఉంటారు. దేని విశిష్టత దానిదే అయినప్పటికీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి విస్తృతి ఎక్కువ. రాజకీయ కోణంలో ఈ ఫలితం ఆయా పార్టీల తాజా పలుకుబడి నాడికి కొలమానం. బీఆర్ఎస్ పాలనలో ఇదే స్థానంలో కడపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి విజయం సాధించారు. అప్పుడే చాలా మంది ఒక అంచనాకు వచ్చారు కేసీఆర్ ప్రభుత్వంపై సమాజంలో అసంతృప్తి మొగ్గతొడిగిందని! ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఆ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అందుకే వాస్తవాలను ప్రామాణికంగా అధ్యయనం చేయడం అవసరం. ఇక్కడితో అయిపోయిందని అనుకుంటే.. మున్ముందు ఈ గండి ఇంకా పెద్దది కావొచ్చు. అసలే స్థానిక సంస్థల వరుస ఎన్నికలు పొంచి ఉన్నాయి.

వ్యూహాత్మక తప్పిదం జరిగినట్లే!

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండి బీఆర్ఎస్ బిందాస్‌గా వినోదం చూసింది. కానీ రంగంలో ఉండాల్సింది. ధైర్యం చేసి ప్రసన్న హరికృష్ణనే తమ అభ్యర్ధిగా నిలబెడితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు దక్కకుండా గులాబీ వనంలో సునాయాసంగా గుబాళించేదేమో. ఇప్పుడు బీజేపీ ఆస్వాదిస్తున్న ఊపూ, ఉరిమే ఉత్సాహం ప్రధాన ప్రతిపక్ష పార్టీ యంత్రాంగంలో నెలకొనేవి. బీఆర్ఎస్ వల్లే బీజేపీ గెలిచిందనే రకరకాల బద్నాంలు, అపోహలు తప్పేవి. ఇక తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు తమ పార్టీదేనని మురిసిపోతున్న బీజేపీ, దాని అనుబంధ విభాగాల సమన్వయాన్ని, అంకిత భావాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే మంచిది!

- ఇల్లెందుల దుర్గాప్రసాద్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

94408 50384

Tags:    

Similar News

జంగిడి