కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములేనా...?

T Congress leaders show of strength and unity in Khammam janagarjana sabha

Update: 2023-07-04 00:30 GMT

మంచి ఆరంభముంటే సగం పని పూర్తయినట్టే అంటారు. ఖమ్మం ప్రదర్శన కాంగ్రెస్‌ శ్రేణులనే కాదు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనను వ్యతిరేకించే వారందరినీ అలరించింది. కొత్త ఆశలు రేపింది. అయిదు మాసాల్లో ఎన్నికలు జరగాల్సి వున్న రాష్ట్రంలో ఇదే సానుకూల దృక్పథాన్ని, పోరాట పంథాన్ని కొనసాగిస్తే కాంగ్రెస్‌ రొట్టె విరిగి నేతిలో పడటం ఖాయం. ఇందుకు షరతులు ఎందుకు వర్తిస్తాయీ అంటే, అది కాంగ్రెస్‌ కనుక. సానుకూల వాతావరణాన్ని కూడా చేజేతులా చెడగొట్టుకోగలిగే చరిత్ర ఉన్న పార్టీ గనుక!

అన్నీ మంచి శకునములే.. అని చక్కగా పాట పాడుకునే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ది. ఖమ్మం సభ, ప్రదర్శన కన్నా ముందే పార్టీ అకౌంట్‌లో ప్రయోజనాలు వచ్చి పడ్డాయి. చరిత్రను బట్టి చూస్తే కాంగ్రెస్‌లో అధిష్టానపు చిన్నచిన్న చర్యలు, స్పష్టమైన సంకేతాలే ఎంతో మేలు చేస్తాయి. ఖమ్మం సభ మూడు ముక్కలుగా కాకుండా ఒకటిగా జరిపించడం తెలివైన నిర్ణయం. అది మంచి ఫలితమే ఇచ్చింది. ఇలా కాకుండా ముందనుకున్నట్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ‘చేరిక సభ’, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జరిపిన ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్ర ‘ముగింపు సభ’ తెలంగాణ పీసీసీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ జైత్రయాత్రకు ఆరంభం అంటూ తలపెట్టిన ‘శంఖారావం సభ’ మూడు వేర్వేరుగా జరిగి ఉంటే ఇంతటి ప్రభావం ఉండేది కాదు. పైగా...ఒక సభను మరో సభతో పోల్చడం, ఎక్కువ-తక్కువలు చర్చించడం, పరిస్థితి వస్తే...వాళ్లలో వాళ్లు తిట్టుకోవడం, ఇలా మళ్లీ ‘షరామామూలే’ అనే పరిస్థితి తలెత్తేది. వాటన్నిటినీ పరిహరించడానికి అన్నీ కలిపి ఒకటే సభ అని పట్టుబట్టడమే కాకుండా పొంగులేటిని ఒప్పించి అధిష్టానం ఈ విషయంలో విజయం సాధించింది. ఫలితంగా మంచి సభ, పెద్ద సంఖ్యలో జనం హాజరవడం, జనం నుంచి రాహుల్‌ రాకకు, ఆయన ప్రసంగానికి స్పందన లభించాయి.

పొంగులేటి ప్రత్యేకం

సహజంగానే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఖమ్మం జిల్లాలో ఉన్న ఆదరణను బట్టి మూడు వేర్వేరు సభలు జరిగి ఉంటే, ఇతర రెండు సభలు తేలిపోయి ఉండేవి. నాయకుల మధ్య, వారిని సమర్థించే కార్యకర్తల శ్రేణుల మధ్య స్పర్థలు, పరస్పర విమర్శలకు ఆస్కారం ఏర్పడేది. అందుకే ఈ విషయంలో పొంగులేటిని ఒప్పించి ‘వ్యక్తి ఇమేజ్‌’ ముఖ్యం కాదు, మొత్తమ్మీద పార్టీ ఇమేజ్‌ పెరగటం, దానికి అందరూ ఉమ్మడిగా శ్రమించడం ముఖ్యం అని సందేశం ఇవ్వగలిగారు. తక్కువ కాలంలో వేర్వేరు సభలు పెట్టి పిలిస్తే నాయకులకే కాకుండా పౌరులకు కూడా ఇబ్బందే! బదులుగా ఒకే సభ ప్రభావవంతంగా జరిపించగలిగారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులుండటం పొంగులేటి ప్రత్యేకత. ఒక సీనియర్‌ జర్నలిస్టు మిత్రుడు ఎక్కడో ప్రస్తావించినట్టు, ఈశాన్య రాష్ట్రాల్లో హేమంత్‌ బిశ్వ శర్మలాగా రాష్ట్ర రాజకీయాల్లో పొంగులేటి నిజంగానే ఒక ‘గేమ్‌ ఛేంజర్‌’ అంటే అతిశయోక్తి కాదు. బీజేపీలో చేరడం ద్వారానే రాష్ట్రంలో పాలకపక్షమైన బీఆర్‌ఎస్‌ వేధింపులు తప్పించుకోగలడని కొందరన్నారు. తన వ్యాపార ప్రయోజనాల రీత్యా ఇటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ కాంగ్రెస్‌లో చేరడానికి వెనకాడుతున్నారు అని పొంగులేటి పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేసినా చివరకు ఆయన కాంగ్రెస్‌లో చేరి తగు రాజకీయ నిర్ణయమే తీసుకున్నారు. ఇదొక రకంగా విజ్ఞత కలిగిన సాహసిక నిర్ణయం. గత అయిదారు మాసాలుగా ప్రజా క్షేత్రంలో వ్యక్తమవుతున్న ‘పీపుల్స్‌పల్స్‌’ని బట్టి పొంగులేటి-కాంగ్రెస్‌ (ఆయనిపుడు పార్టీలో భాగం అయ్యారు కనుక) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది లేదా కనీసం తొమ్మిది స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు మెండయ్యాయి. ఇదీ బీఆర్‌ఎస్‌పై పడ్డ పెద్ద దెబ్బ.

ఇక చక్రం తిప్పడం డికెఎస్‌ వంతు?

సమకాలీన భారత రాజకీయ చిత్రపటంలో కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డి.కె.శివకుమార్‌ది చెరగని ముద్ర. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలో రాష్ట్ర కాంగ్రెస్‌ను సమర్థంగా, సాహసంగా విజయతీరాలకు నడిపి కూడా ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసి నిబద్ధత కలిగిన విధేయుడిగా నిలిచారు. తద్వారా కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు ఆయనే ఒక కొత్త ఊపిరి పోసినట్టయింది. అందుకే దేశవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు లభించాయి. కాంగ్రెస్‌ పార్టీలో కూడా గాంధీ, నెహ్రూ కుటుంబానికి ఎంతో విధేయత కలిగిన తిరుగులేని నాయకుడయ్యారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయినా, డి.కె.శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసి ముఖ్యమైన ‘హీరో’గా నిలిచారు. అలా కాకుండా మొండికేసి, కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అయితే కేసుల వల్ల కటకటాలపాలయ్యో, కాంగ్రెస్‌లో చీలిక తెచ్చి బీజేపీ అశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యుంటేనో ‘విలన్‌’గా మిగిలిపోయేవాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం తల్లో నాలుకలాగున్నాడు. తెలంగాణలో పార్టీని చక్కదిద్దే బాధ్యతలు ప్రస్తుతానికి పరోక్షంగానే ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీకి అంత సన్నిహితంగా ఉన్నా...రాహుల్‌కు ఉన్నంత నమ్మకం, విశ్వాసం ప్రియాంక, సోనియాలకు కలుగుతున్నట్టు లేదు. పార్టీకి మంచి వాతావరణం కలిసి వస్తున్న వేళ, రాష్ట్ర నాయకులంతా కలిసికట్టుగా ఐక్యతతో ఉండాల్సిన సమయంలో టీపీసీసీ నేత ఒంటెద్దుపోకడ సరికాదనే అభిప్రాయం అధినాయకత్వంలో ఉంది. అందుకే, రేవంత్‌ను ఆమేరకు సరిదిద్దే బాధ్యతను సోనియాగాంధీ డి.కె.శివకుమార్‌కి అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. డి.కె-రేవంత్‌ల మధ్యనున్న పూర్వ సాన్నిహిత్యం ఇందుకేమైనా ఉపయోగ పడుతుందేమో చూడాలి. కర్ణాటకలో డి.కె నడిపిన రాజకీయ చతురత...ఏ విధంగా చూసినా రేవంత్‌కి పనికొచ్చేదే!

ఎలా ముందుకు అన్నది ముఖ్యం

తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చే రెండూ, మూడు మాసాలు ఎంతో కీలక సమయం. ఇప్పటివరకు నెలకొన్న సానుకూల వాతావరణాన్ని, ఇదే స్ఫూర్తితో ఎలా ముందుకు తీసుకువెళతారన్నది ముఖ్యం. అంతా బాగున్నా చెడగొట్టుకోవడంలో కాంగ్రెస్‌ను మించిన వాళ్లుండరు. అనుకూల వాతావరణాన్ని పార్టీ నేతలు ఐక్యమత్యంతో వినియోగించుకోవాలి. రాష్ట్రంలో బీజేపీ గ్రూపు తగాదాలతో మూల్యం చెల్లించుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు గ్రహించాలి. పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యతిచ్చే కొందరు స్వయం ప్రకటిత సీనియర్‌ నేతలు తమ అహాన్ని తగ్గించుకొని, నోటికి తాళం వేసుకుంటే పార్టీ శ్రేయస్సుకు మంచిది. ఎన్నికల్లో గెలవలేని నేతలు పార్టీని కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే పార్టీకి ఎంతో మేలు చేసిన వారవుతారు. పొరుగునున్న కర్ణాటక, ఇలీవలి పరిణామాల నుంచి వారు నేర్చుకోవాల్సింది అదే! కాంగ్రెస్‌ వల్ల లాభం లేదు ‘వారితో అయ్యే పని కాదు’ ‘గెలిపించినా చివరకు పాలక పక్షానికి అమ్ముడు పోతారు’ వంటి విమర్శలు, రాజకీయ పరిశీలనల నుంచి ఇప్పుడిప్పుడే పార్టీ క్రమంగా బయటపడి ఓ కొత్త నమ్మకాన్ని పెంచుతున్న సమయం. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ...వచ్చే రెండు మూడు మాసాలు పార్టీ రాష్ట్ర నాయకులంతా ఐక్యంగా ఉంటే ‘పర్వాలేదు, కాంగ్రెస్‌ ఒక బలమైన ప్రత్యామ్నాయమే!’ అనే ప్రజాభావన బలపడే ఆస్కారముంది. ఒకసారి అటువంటి టాక్‌ వచ్చి, అది బలంగా ప్రజాక్షేత్రంలో వెళితే కాంగ్రెస్‌ రొట్టే విరిగి నేతిలో పడ్డట్టే! ఇటీవల ఒక వ్యూహ సమావేశంలో పార్టీ అధినేత రాహుల్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు, కొందరిని దృష్టిలో ఉంచుకొని చేసిన హెచ్చరికలు నిజంగా పని చేయడం మొదలెడితే...పార్టీ పరిస్థితి మెరుగవుతున్నట్టు లెక్క.

వరంగల్‌లో చేసిన ‘రైతు డిక్లరేషన్‌’లో రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, ఏటా రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేల పెట్టుబడి సాయం, ధరణీ పోర్టల్‌ రద్దు, ఎల్బీనగర్‌ సమావేశంలో ప్రకటించిన ‘యువ డిక్లరేషన్‌’లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన యువత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబానికి ప్రతి నెల 25 వేల రూపాయల అమరవీరుల పింఛన్‌, పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాది జూన్‌ 2వ తేదీన ఖాళీలను తెలియజేస్తూ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన, నిరుద్యోగ యువతకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేట్‌ కంపెనీలలో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యూత్‌ కమిషన్‌ ఏర్పాటు ద్వారా యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాల అందజేత, 18 సంవత్సరాలు పైబడి చదువుకునే యువతికి ఉచితంగా ఎలక్ట్రానిక్‌ స్కూటర్‌ అందజేత అంశాలతోపాటు నిన్న ఖమ్మం సభలో ప్రకటించిన చేయూత పింఛన్‌ కింద రూ. 4 వేల వరకు వృద్ధులు, వితంతవులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్‌ రోగులకు చెల్లింపు వంటి హామీలను ఎలా ప్రజాక్షేత్రంలోకి తీసుకు వెళ్తారన్నదీ ముఖ్యమే! ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లి, వారు నమ్మటాన్ని బట్టే రేపు కాంగ్రెస్‌ రూపొందించే ఎన్నికల మానిఫెస్టో ‘సక్సెస్‌’ ఆధారపడుతుంది. ఇప్పుడున్న మంచి శకునములు ఫలప్రదం కావాలంటే పార్టీ ఐక్యంగా ఉంటూ, ప్రత్యామ్నాయం అని ప్రజల్లో విశ్వాసం కలిగించడాన్ని బట్టే కాంగ్రెస్‌ గెలుపు ఆధారపడనుంది.

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

dileepreddy.ic@gmail.com,

99490 99802

Tags:    

Similar News