రాచకొండ బాటను బాగు చేయండి
తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన చారిత్రక నేపథ్యం కలిగిన, ప్రకృతి రమణీయతకు మారు పేరు గా ఉన్న ప్రాంతం

తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన చారిత్రక నేపథ్యం కలిగిన, ప్రకృతి రమణీయతకు మారు పేరు గా ఉన్న ప్రాంతం రాచకొండ. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్ధాన్ నారాయణపురం మండల పరిధిలో ఉంటుంది. పూర్వపు 20 ఏళ్ల కిందటి వరకు రాచకొండకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి కాలినడకన కొచ్చేరువు రోడ్డు నుండి ప్రభుత్వ నక్ష బాట కాచబండల మీదుగా గన్నేర్ల, మోకాళ్ళ కురు మ, వీరన్న పాల్లు( కోనేరు) మీదుగా రాచకొండకు చేరుకునేది. ఎప్పుడైతే మండల కేంద్రం నుండి వెంకబావితండా, అల్లాపురం మీదుగా రాచకొండకు ఆర్‌అండ్ బి రోడ్డు మార్గం ఏర్పడిందో నాటి నుండి కాలినడకన ప్రయాణించే రోడ్డు బాట మరుగున పడింది.
అయితే సంస్ధాన్ నారాయణపురం నుండి రోడ్డు మార్గం ద్వారా చుట్టూ తిరిగి రాచకొండకు చేరు కుంటే 15 కిలోమీటర్లు వస్తుంది. అదే పూర్వపు మట్టి రోడ్డు నుండి వెళ్తే 5 కిలోమీటర్లు వస్తుంది. దాదాపు 10 కిలోమీటర్ల వ్యత్యాసం కనిపిస్తున్న తరుణంలో పూర్వపు కాలినడకన మట్టిబాటలో ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి రాకపోకలకు అసౌకర్యం కలిగించే రాళ్లను తొలగించాలి. ఆధ్యాత్మికంగా ప్రశాంతతని కోరుకునే భక్తులకు కాలినడకన మంచి ప్రకృతి వాతావరణంలో ప్రయాణిస్తే మనసుకు మంచి ప్రశాంతత కూడా లభిస్తుంది. పైగా నాటి చారిత్రక కట్టడాల చరిత్రను తెలుసుకోవచ్చు.
కాబట్టి ప్రభుత్వం వెంటనే కాచబండల నుండి గన్నేర్లల వరకు దాదాపు కిలోమీటర్ మేర రోడ్డు సౌకర్యం కొంత ఇబ్బందిగా ఉంది తర్వాత కొంత వ్యవసాయ భూములున్న రైతులు కొంతమేరకు చదును చేసుకుని బాగు చేశారు. కాబట్టి మిగిలిపోయిన కొంత భాగాన్ని ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా బాటకు ఇరువైపులా బాటకు అడ్డంగా మొలచిన పిచ్చి మొక్కలను తీసేసి, మార్గ మధ్యలో ఉన్న రాళ్లను తొలగించి చదును చేసి రాకపోకలకు సౌకర్యంగా ఉండే విధంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
గుండమల్ల సతీష్ కుమార్
94941 55522