జననాడి: 'గురి' తెలియని గురివిందలు

జననాడి: ‘గురి’ తెలియని గురివిందలు... opposition parties failed in target The parties that came to power says dilip reddy

Update: 2023-02-13 19:00 GMT



తెలుగునాట విపక్షాలది దశ, దిశ లేని గమనమైంది. ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియని దుస్థితిలో 'గుడ్డెద్దు చేలో పడ్డ' చందంగా ముందుకు సాగిపోతున్నారు. ప్రతిపక్షంగా వీళ్లు మాకోసం ఉన్నారా లేక సొంతానికి అధికారం కోసం పనిచేసుకుంటున్నారా అని ప్రజలే విస్తుపోయే వాతావరణం నెలకొంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. నిజమైన ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం, సాక్ష్యాధారాలతో ఎత్తిచూపి-ఎండగట్టడం, ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ ఉద్యమాలు నిర్మించడం, 'మమ్మల్ని అధికారంలోకి తెస్తే ఇదిగో ఇది ఇస్తాం`తెస్తాం' అని భరోసా కల్పించడం... ఇటువంటివేమీ లేవు. హద్దూ-అదుపూ లేకుండా నోటికి వచ్చినంత తిట్టేయడం, నాలుక వేడి చల్లార్చుకోవడం, వందిమాగద పరివారంతో చప్పట్లు కొట్టించుకోవడం... తప్ప మరోటి లేదు. జాతీయ పార్టీలకు చెందిన కొందరు రాష్ట్ర నాయకులయితే ఢిల్లీ నాయకత్వానికి విరుద్ధం గానూ మాట్లాడేస్తున్నారు. 'చెప్పుకోవడానికి కాపలా కుక్క(వాచ్‌డాగ్‌)ల్లా ఉంటామంటారు కానీ, వాస్తవంలో మొరిగే కుక్క (బార్కింగ్‌ డాగ్‌)ల్లా తిట్లకే పరిమితమౌతున్నార'నే భావన జనంలో బలపడుతోంది. ఒక వ్యూహం, ఒక పథకం`కార్యాచరణ, జనం విశ్వసించే సామాజికార్థిక ప్రత్యామ్నాయ ఎజెండా లేకుండా గడుపుతున్న విపక్షాల పనితీరే పాలకపక్షాలకు శ్రీరామరక్షగా ఉందని పాలనలో మార్పు కోరే ప్రజానీకం కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు.

కాయన, తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌ని తాము అధికారంలోకి వచ్చాక కూల్చివేస్తామని, ఈ లోపున నక్సలైట్లూ మీరే పేల్చివేయండని పిలుపునిస్తారు. ఇంకొకాయన 'సర్జికల్‌ స్ట్రైక్‌' చేస్తామని, ప్రజాధనంతో ప్రస్తుత సర్కారు కొత్తగా నిర్మించిన సచివాలయపు గుమ్మటాలను తాము గద్దెనెక్కాక కూల్చివేస్తామంటారు. ఏమిటిదంతా అంటూ జనం నవ్వుకుంటున్నారు. ఇవా తమ అత్యవసరాలు, ఇవేనా నిత్యం తాము ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు, ఇలాగేనా తమ కడగండ్లు తీర్చడమంటే! అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో ఒకాయన ముఖ్యమంత్రికి భయాన్ని పరిచయం చేస్తాడట! సహకరిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్రే అని సవాల్‌ చేస్తారు. వ్యక్తిగత దూషణలే కాకుండా వారి, వారి కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలను తీసుకొని తిట్ల దండకం అందుకోవడం రెండు రాష్ట్రాల్లో చాలా సాధారణమైపోయింది. 'మేం అధికారంలోకి వస్తే ఇదుగో, మీ కోసం ఇది చేస్తాం' అని ఓ ప్రత్యామ్నాయ సామాజికార్థిక కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పలేకపోతున్నాయి విపక్షాలు.

అటువంటి ఆశ ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఎంత సేపూ ప్రభుత్వాలను దూషించడం, పాలకపక్ష నేతల్ని తిట్టడం, తద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావాల్ని పెంచి, అలా లభించే నెగెటివ్‌ ఓటుతో తాము గద్దెనెక్కాలని విపక్షాలు కలలు కంటున్నట్టుంది. అంతే తప్ప ప్రజల్లో తమ పట్ల కొత్త విశ్వాసాన్ని కలిగించి, పాజిటివ్‌ ఓటు ద్వారా సర్కారు ఏర్పాటు చేయాలనే ఆలోచన గానీ, చేస్తామన్న విశ్వాసం కానీ వారికి ఉన్నట్టు కనిపించదు. 'జనం లోకా! ఏం వెళతామండి మా వాళ్లకు పాజిటివ్‌ ఓటు మీద భరోసా లేదు, ఉన్నదంతా నెగెటివ్‌ ఓటుపై గంపెడాశే!' ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసి, రాష్ట్ర విభజన తర్వాత చట్టసభా బాధ్యతలు నిర్వహించిన ఓ పెద్దమనిషి పలికిన ఈ మాటల్ని బట్టి పరిస్థితి అంచనా వేయవచ్చు!

వారిదో మాట, వీరిదో తూట!

భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకత్వం ఇటీవల ఉన్నట్టుండి గొంతు మార్చింది. దేశంలో ముస్లింలను కూడా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని, వారినీ మచ్చిక చేసుకోండని కింది స్థాయి నాయకత్వానికి సందేశాలిస్తోంది. ఆ పార్టీ సైద్దాంతిక తల్లివేరు ఆరెసెస్‌ కూడా తన వైఖరిలో భిన్నత్వం చూపేందుకు యత్నిస్తోంది. మోహన్‌ భాగవత్‌ వంటి వారు మదర్సాలను సందర్శిస్తున్నారు. ముస్లింలపై గుడ్డి విమర్శలు కాకుండా వారిని మచ్చిక చేసుకోవాలని, సినిమాలు ఇతర పనికిమాలిన అంశాలను వదిలేసి ప్రజావిశ్వాసం చూరగొనే పనులు చేయండని పార్టీ సీనియర్‌ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులకు ఓ ఆంతరంగిక భేటీలో పిలుపునిచ్చారు. ఇక్కడేమో ముస్లింలపై వ్యతిరేక భావజాలాన్ని వేయిగొంతుకలతో వినిపించే యత్నం జరుగుతోంది. ముస్లింలకు ప్రతీకగా, ముస్లిం నియంత నిజామ్‌ను గుర్తుకుతెచ్చేలా కొత్త సచివాలయం మీది గుమ్మటాలున్నాయని, తాము అధికారంలోకి రాగానే కూల్చివేస్తామని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బహిరంగంగానే ప్రకటించారు. భైంసా పేరును కూడా మార్చేస్తామని ఆయనే లోగడ పలికారు. ఇదంతా దేనికి సంకేతం? క

న్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఇటీవలే తాను జరిపిన 'భారత్‌ జోడో' యాత్రలో తనను కలిసిన ప్రజలు లేవనెత్తిన అంశాలు, అడిగిన ప్రశ్నలు, ప్రస్తావించిన పేర్లు, తదితరాలన్నింటినీ పార్లమెంటు వేదికగా లేవనెత్తి, సూటి ప్రశ్నల్ని కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడు రాహుల్‌ గాంధీ పార్లమెంటులో సంధించారు. వాటిని 'అదానీ షేర్‌ విలువ పడిపోయిన' ఉదంతంతో పెనవేసి పాలకపక్షాన్ని నిరుత్తరుల్ని చేశారు. ఆ తెలివిడి స్థానిక నాయకత్వంలో లోపించింది. వ్యవసాయాన్ని మెరుగుపరచి రైతుల్ని ఎలా ఆదుకుంటారో 'వరంగల్‌ డిక్లరేషన్‌'లో పేర్కొనడాన్ని పౌరులు స్వాగతించినా, దాన్ని గరిష్టంగా పార్టీ స్థానిక నాయకత్వం వాడుకోలేకపోతోంది. జనజీవనంతో ముడివడిన చాలా కీలకాంశాలు అందులో ఉన్నాయి, ఏం లాభం? ఎదుటివారిని తిట్టిపోసే పనిలో నిమగ్నమై, నాయకులే అందులోని పలు విషయాలు మరచిపోయినట్టున్నారు.

జనసమస్యల లోతులు పట్టవా?

మీడియాలో వచ్చే కథనాల్ని తిరగమాత తాళింపు వేసి మళ్లీ వల్లెవేయడం తప్ప, ప్రజా సమస్యల్ని లోతుగా పరిశీలించే యత్నం విపక్షాలు చేయడం లేదు. మొన్నొక టీవీ చర్చలో, నిలయ విద్వాంసుడైన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 'ప్రతిపక్షాలను ఎక్కడ చేయనిస్తున్నారండీ ప్రజాఉద్యమాలు, బయటికి రాగానే అరెస్టు చేస్తున్నారాయె, మీకు తెలియదా' అని, విశ్లేషకుడితో నిష్ఠూరమాడారు. 'ఉద్యమాలు చేయండి, రండి!' అని ప్రభుత్వాలు ఎర్ర తివాచీలు పరుస్తాయనుకున్నారేమో! పాపం! కొన్ని విషయాల్లో ప్రజలెంత ఇబ్బందులనెదుర్కొంటున్నారో వాస్తవాలు విపక్షాలు తెలుసుకోవటం లేదు. 'ఇప్పుడు సర్కారు అనుసరిస్తున్నది తప్పు' అంటున్న వారు, తామైతే ఏం చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. రైతులకు ఏ కొత్త ధీమా కల్పించటం లేదు. నిరుద్యోగ యువతకు, వారి ఆశలు చిగురింపజేసే ఏ నమ్మకాన్నీ కలిగించలేకపోతున్నారు. కొత్త ఉద్యోగాలు రాకపోగా, బహుళజాతి కంపెనీలు, ఒక్క కలం పోటుతో వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వీధుల పాల్జేస్తున్నాయి.రాబడి తగ్గి, అసాధారణంగా పెరిగిన నిత్యావసరాల ధరలతో జనం కొనుగోలు శక్తి నశించి, బయట వ్యాపారాలు దివాలా తీస్తున్నాయి.

పెరిగిన విద్యుత్‌ బిల్లులు, ఇతర నిర్వహణ వ్యయాలు తట్టుకోలేక ఏపీలో చాలా సంస్థలు, షాపులు, ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్లలో... సగం రోజులు కొందరు ఉద్యోగుల్ని సగం రోజులు మరి కొందరిని పనికి రమ్మంటూ నెలకు 15 రోజుల జీతమే ఇస్తున్నాయి. 'యువగళం'పేరు పెట్టుకొని ఒకాయన పాదయాత్ర మొదలెట్టి పక్షం రోజులవుతున్నా.... తాము అధికారంలోకి వస్తే యువతకేం చేస్తారో నిర్దిష్టంగా చెప్పిందేలేదు, నిత్యం తిట్ల పురాణం తప్ప! ఇరుకు గల్లీల్లో సభలు పెట్టి, చీరలు పంచి తొక్కిసలాటలో జనం చస్తే, ఏ నైతిక బాధ్యతా తీసుకోని ఇలాంటి నాయకులు, 'ఏం నేను టెర్రరిస్టునా.. ఎందుకింత పోలీసు బందోబస్తు' అని ప్రశ్నించడం పట్ల జనం ఆశ్చర్యపోతున్నారు. మరో నాయకుడి 'మెట్టుతో కొడతా.... రండి ఎమ్మెల్యే నా కొడకల్లారా!' వంటి భాషా ప్రయోగాన్ని, వ్యక్తి పూజలో తరించే కొందరు వందిమాగదులు తప్ప సాధారణ జనం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక.... మిమ్మల్నెందుకు ఎన్నుకోవాలి

తాము అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు ఎలా తీరుస్తారో, వారికి ఏయే మేళ్లు ఏ విధంగా చేస్తారో చెప్పట్లేదు. తాము ప్రతిపాదించే ప్రత్యామ్నాయం, ప్రస్తుత సర్కారు విధానాల కన్నా ఎలా భిన్నమో వివరించటం లేదు. రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం 'మేం గద్దెనెక్కాక మీ పనిపడతాం ఇంతకింత అనుభవిస్తారు! వడ్డీతో సహా చెల్లించాలి సుమా!' అంటూ చేసే హెచ్చరికలు రోజూ వినాల్సి వస్తోంది. అయితే `కార్యకర్తల్ని, లేదంటే అధికారుల్ని 'మీ సంగతి చూసుకుంటాం...!' అని విపక్ష ముఖ్యులు బెదిరిస్తున్నారు. ఈ విపక్షాలు విమర్శిస్తున్నట్టు, వాళ్లు అలా ఉన్నారు కనుకే ప్రస్తుత పాలకులను ప్రజలు శిక్షించి, గద్దె దించి వీరికి పట్టం కడతారు అనుకుందాం! వీరూ అదే చేస్తే, చేస్తామని తొడలు చరిచి చెబితే... ఇంక ప్రజలు వీరినెందుకు ఎన్నుకోవాలి? ఈ ప్రశ్న జనం మెదళ్లలో పుట్టదా కనీసం ఆలోచించట్లేదు. ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వంలో చౌదరి చరణ్‌సింగ్‌ వంటి కొందరు నేతలు ఇదే రకంగా 'రాజకీయ కక్ష సాధింపు'ల గురించి మాట్లాడటాన్ని మొరార్జీ దేశాయ్‌ నాడు ఖండించారు. 'ఆమె (ఇందిరా గాంధీ)కి ప్రజలే శిక్ష విధించారు. వేరుగా ఇంకా మనం శిక్షించడం దేనికి, మెరుగైన పాలన కోసం ప్రజలకు మనం ఏం చేస్తామో, దానిపైన దృష్టి పెడదాం' అని ఆయన సూచించారు. కప్పల తక్కెడ వంటి జనతాపార్టీ ఆ సూచనను పెడచెవిని పెడితే, ప్రజలు మళ్లీ ఇందిరాగాంధీని గద్దెనెక్కించుకున్నారు. ఇప్పటికైనా విపక్షాలు పాఠాలు నేర్చి ప్రజావిశ్వాసం చూరగొంటేనే మన ప్రజాస్వామ్యానికి రక్ష, మనకు మనుగడ!

-ఆర్‌.దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

dileepreddy.ic@gmail.com,

9949099802

Tags:    

Similar News