సాగుకు ఆక్సిజన్.. చట్టబద్ధ ఎంఎస్‌పి
ఆరుగాలం శ్రమించి తాము పండించిన పంటల ద్వారా దేశానికి ఆహార భద్రత కల్పించే కర్షకులు ప్రస్తుతం తమ అస్తిత్వం

ఆరుగాలం శ్రమించి తాము పండించిన పంటల ద్వారా దేశానికి ఆహార భద్రత కల్పించే కర్షకులు ప్రస్తుతం తమ అస్తిత్వం కోసం, న్యాయబద్ధమైన తమ కోర్కెల సాధన కోసం పోరుబాట పట్టాల్సి వచ్చింది. దేశ ఆహార భద్రతకు కీలకమైన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధి బృందం అనేక దఫాలు జరిపిన చర్చలు ఫలించలేదు. నిజమైన డిమాండ్లను పరిశీలిస్తామని, రైతుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, మా తలుపులు తెరిచే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయలేకపోతోంది?" అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించడం ఆలోచించవలసిన పరిణామం.
రైతుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచే అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. భారత జీడీపీలో వ్యవసాయం వాటా 18.2 శాతం కాగా, మొత్తం ఉపాధిలో సాగు రంగం వాటా 48 శాతం. ఇంతటి ముఖ్యమైన వ్యవసాయ రంగంలో ఇటీవలి కాలం వరకు మన పాలకుల నిర్లక్ష్యం వలన దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులు పంట రుణాలు, ప్రైవేట్ అప్పులు దొరకకపోతే వ్యవసాయం చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారు. దీర్ఘకాలిక సమస్యలతో రైతులు పోరాడుతూనే ఉన్నారు. దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో సగం పైగా (50.2 శాతం) అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని ఎస్ఏఎస్ సర్వే 2019 చెప్తోంది. వ్యవసాయం భారంగా మారి అప్పుల బాధతో ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ రైతులు తమ ఉసురు తీసుకుంటున్నారు.
వాళ్లకు 16 లక్షల కోట్లు.. వీరికేమో..
కార్పొరేట్ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణమాఫీలతో పోల్చితే భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో మూడింట రెండు వంతులు ఉన్న రైతులకు అందుతున్న సహాయం అతి స్వల్పం. గత పదేళ్లలో కార్పొరేట్లకు రూ.16 లక్షల 35 వేల కోట్ల విలువైన (ఆర్థిక మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం) మొండి బకాయిలు లేదా ఎన్‌పిఏలు మాఫీ చేసిన ప్రభుత్వం 2018 డిసెంబరులో పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 19 విడతలలో 11 కోట్ల మంది రైతులకు చేసిన సహాయం సుమారు రూ.3 లక్షల 68 వేల కోట్లు మాత్రమే. కార్పొరేట్లకు ఇన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతుల న్యాయబద్ధమైన డిమాండ్లకు సరైన విధంగా స్పందించకపోవడం విచారకరం.
పంటను తెగనమ్ముకునే దుస్థితి
2022లో అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను నిర్ధారించే మార్గాలను కనుగొనడానికి రైతులు, రాష్ట్ర అధికారులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. డా.స్వామినాథన్ సిఫా ర్సుల ప్రకారం భూమి విలువ, కౌలు ధరతో సహా పంటల సమగ్ర ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించి అదనంగా 50 శాతం (సి3+50) కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలి. అయితే పండించే పంటకు అయ్యే ఖర్చులను తక్కువగా లెక్కించి ఎంఎస్‌పి నిర్ణయించడం వల్ల కలుగుతున్న నష్టంతో పాటు, చట్టబద్ధత లేకపోవడం వలన కనీస మద్దతు ధర కూడా దక్కక పండిన పంటను తెగనమ్ముకుని మరింత తీవ్రంగా రైతు నష్టపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వ సాగతీత సరికాదు!
ఇప్పటికే కనీస మద్దతు ధర ప్రకటించిన పంటలను కూడా తక్కువ ధరకు అమ్ముకోక తప్పని పరిస్థితిలో రైతాంగం ఉన్నదనేది జగమెరిగిన సత్యం. కాబట్టి ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలని, అన్ని పంటలను ఎంఎస్‌పి పై సేకరించేలా చట్టం చేయాలనే రైతు నాయకుల ప్రధాన ప్రతిపాదనలను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వ సాగతీత ధోరణి సబబు కాదు. ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించడం రైతన్నలకు ఆక్సిజన్ లాంటిది. దాని వలన పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కి అన్నదాతలకు ఆర్థిక రక్షణ ఏర్పడుతుంది. దేశ సాగు రంగంలో సుమారు 90 శాతం ఉన్న చిన్న కమతాలను డిజిటల్ సేద్యంలోకి తీసుకువచ్చి అధిక దిగుబడులు సాధించడానికి ప్రభుత్వాలు ఆర్థికంగా, సాంకేతికంగా అండదండ లివ్వాలి. గిడ్డంగులను నిర్మించి పండించిన పంటకు నిల్వ సౌకర్యం కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను సరళతరం చేయాలి. రైతులు సంఘటితంగా తమ పంటలను గిట్టుబాటు ధరలకు విక్రయించడానికి, ఎరువులు, విత్తనాలు, ఆధునిక సేద్య పరికరాలు తదితరాలు తక్కువ ధరలకు అందుబాటులోకి తేవడానికి సహకార సంఘాలు, ఎఫ్.పి.ఓల సేవలను వినియోగించుకోవాలి. కర్షకుని ఆత్మగౌరవానికి రక్షగా ప్రభుత్వం ఉంటే దేశానికి ఆహార రక్ష కర్షకుడు ఇస్తాడు. ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించడం ద్వారా అటువంటి ఆత్మగౌరవాన్ని రైతుకు కల్పించాల్సిన అవసరం.. విధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
లింగమనేని శివరామ ప్రసాద్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
79813 20543