తెలుగులో మెయిన్స్ రాస్తే.. మార్కులు వేయరా?

ప్రభుత్వ నియామక పోటీ పరీక్షలను.. ఆదిలాబాద్ మారుమూల గ్రామం నుండి పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థికి

Update: 2025-03-18 01:15 GMT
తెలుగులో మెయిన్స్ రాస్తే.. మార్కులు వేయరా?
  • whatsapp icon

ప్రభుత్వ నియామక పోటీ పరీక్షలను.. ఆదిలాబాద్ మారుమూల గ్రామం నుండి పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థికి, హైదరాబాద్‌లో ఉంటూ ప్రిపేర్ అయి పరీక్ష రాసే అభ్యర్థికి సమాన అవకాశాలతో పాటు సమానమైన పరిస్థితులు కల్పించాలి. అభ్యర్థి ఏ మీడియంలో పరీక్షలు రాసిన సమాధా నాన్ని బట్టి మార్కులు వేయాలి కానీ ఎంచుకున్న మీడియంను బట్టి కాదు.. అదే కదా సమన్యాయం. 

రాష్ట్రంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పబడే గ్రూప్ -1 మెయిన్స్‌లో తెలుగును క్వాలిఫైయింగ్ పేపర్‌గా పెట్టకపోవడమే ఒక తప్పిదం. అది అలా ఉంచితే ఇంగ్లిష్ మాధ్యమంలో మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావడం, తెలుగు మాధ్యమంలో రాసిన వారికి తక్కువ వచ్చినట్టు అభ్యర్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మన రాష్ట్ర అధికార భాష, ఈ భాషలో పరీక్షలు రాస్తే మార్కులు వేయకపోతే ఎలా?

అభ్యర్థుల అనుమానాలు తీర్చడానికి..

ఒక వైపు GO -29 వల్ల అన్యాయం జరిగిందని విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ విషయం రాజకీయమయం అయ్యేంత వరకు టీజీపీఎస్సీ ఎందుకు వివరణ ఇవ్వలేదో వారికే తెలియాలి. మరో వారం రోజుల్లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయన్న నేపథ్యంలో Go -29 ద్వారా ఏ అభ్యర్థికి అన్యాయం జరగదని టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు.. దాదాపు 80% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులే మెయిన్స్‌కి ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. మరి ఇదే విషయాన్ని ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి రోజునే టీజీపీఎస్సీ ప్రకటిస్తే బాగుండేది కదా.. అలా చేస్తే అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలు కొంతవరకైనా నివృత్తి అయ్యేవి. అసలు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానంతోనే అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షల్ని రాయడం జరిగింది.

రీ వాల్యుయేషన్ చేయించాలి!

అయితే, పరీక్ష జరిగిన మొదటి రోజు నుండే ఫలితాలు డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రకటిస్తారని ఒక ప్రచారం, నెల రోజుల్లోనే ఎలా మూల్యాంకనం చేస్తారని మరొక ప్రచారం, ఇన్ని సంఘటనల మధ్య పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా? లేదా అని ఎదురుచూస్తుంటే మార్చి 10వ తేదీన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను వెల్లడించారు.. ఎంపికైన వాళ్ళలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మీడియంలో రాసిన వాళ్లే ఉన్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్న తరుణంలో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఇంగ్లిషులో 12,323 మంది, తెలుగులో 7829 మంది, ఉర్దూలో 9 మంది ఉన్నారని తెలుపుతూ వివిధ పేపర్లలో వచ్చిన గరిష్ట మార్కుల్ని కూడా ప్రకటించింది. అదే విధంగా వర్గాల వారీగా కూడా మొదటి 500 వరకు ఉన్న వారి సంఖ్యను కూడా తెలపడం జరిగింది. అయితే ఇందులో తెలుగు ఇంగ్లిష్ మీడియంలో రాసిన వాళ్లు ఎందరున్నారో కూడా తెలియజేసే బాధ్యత కూడా టీజీపీఎస్సీ పైన ఉన్నది. ఒకవేళ నిజంగానే ఇంగ్లిష్‌లో రాసిన వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చి తెలుగులో రాసిన వాళ్లకు తక్కువ మార్కులు వస్తే తెలుగులో రాసిన వాళ్ల పేపర్లను రీ వాల్యుయేషన్ చేయించాలన్నదే గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల ప్రధాన డిమాండ్..

ఇంత తక్కువ మార్కులా?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్శిటీల్లో పీజీ, పీహెచ్డీలు చేస్తూ స్వరాష్ట్రం సాధించుకున్నాకే గ్రూప్స్ పరీక్షలు రాస్తామని పోరాడిన విద్యార్థులు చాలా మందికి ఆరో పేపర్ తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావంలో 150 మార్కులకు గాను 50 రావడం అంటే అసలు మూల్యాంకనం మీదే అనుమానాలు కలుగుతున్నాయి. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయక పుష్కర కాలం దాటింది. కానీ అన్ని పేపర్లను దేశంలోని వివిధ యూనివర్సిటీ అధ్యాపకులతో మూల్యాంకనం చేయించామని టీజీపిఎస్సీ చెబుతోంది. మరి ఆరో పేపర్‌ను ఎవ రితో మూల్యాంకనం చేయించారు? మిలియన్ మార్చ్, వంటా వార్పు, సాగరహారం, చలో అసెంబ్లీ ఇలా ప్రతి పోరాట రూపంలో ప్రత్యక్షంగా భాగస్వాములైన విద్యార్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తే తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్లో 50-60 మార్కులు రావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలి!

తెలుగు మన రాష్ట్ర అధికార భాష, ఈ భాషలో పరీక్షలు రాస్తే మార్కులు వేయకపోతే ఎలా..? సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్కారు బడిలో తెలుగు మీడియం చదువుకున్న వ్యక్తేనని చెప్పుకున్నారు కదా, మరి తెలుగుకి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా..? అన్న అభిప్రాయాల్ని అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నరు. పక్కన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్‌లో తెలుగు కనీస అర్హత పరీక్షగా ఉంది. తమిళనాడులో తమిళం రాకుంటే అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే రావు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర అధికారిక భాషకు ప్రాధాన్యం ఇస్తారు, మరి మన తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రభుత్వంతో పాటు పరీక్షలు నిర్వహించే నియామక సంస్థలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా టీజీపీఎస్సీ స్పందించి తెలుగు మాధ్య మంలో మెయిన్స్ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ యువత కోరుకుంటోంది.

 డా. అక్కెనపల్లి వెంకట్రాంరెడ్డి

97002 06444

Tags:    

Similar News