ఆంధ్రప్రదేశ్‌కు వెన్నెముకలాంటి బీసీ సామాజిక వర్గానికి రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. జనాభా పరంగా రాష్ట్రాన్ని శాసించాల్సిన స్థాయిలో ఉండాల్సిన బడుగు, బలహీన సామాజిక వర్గాలు జగన్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఇబ్బందులు పడుతున్న బీసీ సామాజిక వర్గాలకు మళ్లీ మంచి రోజులు రావాలంటే ‘ప్రతి చేతికి పని’ కావాల్సిన ఆవశ్యకత ఉంది.
జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక బీసీలపై కక్షగట్టారు. రాష్ట్రంలోని 153 బీసీ కులాలకు ఆయన ఇచ్చిన హామీలు నీటిమీద రాతలు గానే మిగిలిపోయాయి. 2019 ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంతో ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత అరచేతిలో స్వర్గం చూపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం దేవుడెరుగు... ఎవరైనా ప్రశ్నిస్తే అన్యాయంగా దౌర్జన్యాలు, పోలీసుల కేసులు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కుల వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించాల్సింది పోయి ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.
నిధుల్లేని బీసీ కార్పొరేషన్లు
దేశంలో ఏదైన సామాజిక వర్గం అభివృద్ధి కావడానికి రిజర్వేషన్లు కావాలని, ఉన్నవాటిని పెంచాలని డిమాండ్ చేయడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలోని బీసీలకు ఉన్న రిజర్వేషన్లపై కోత పెట్టి జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 34 శాతం ఉన్న రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టి 24 శాతానికి తగ్గించడంతో 16 వేల మందికిపైగా బీసీలు స్థానిక పదవులు కోల్పోయారు. బీసీ కేటగిరీలోని 153 కులాలను గుర్తించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి 56 కార్పొరేషన్లే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వాటికి కూడా బడ్జెట్ కేటాయించలేదు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు. రూ.18,226 కోట్ల బీసీ కార్పొరేషన్ల నిధుల్ని దారి మళ్లించి ఈ సామాజిక వర్గాల అభివృద్ధి నిరోధకులయ్యారు. రూ.75 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని వాగ్దానం చేసిన జగన్ అధికారం చేపట్టాక లబ్దిదారుల సంఖ్యను కుదించారు. వారికి కూడా పూర్తిస్థాయిలో డబ్బులు ఇవ్వలేదు.
బీసీలోని అన్ని కులాలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. భవన నిర్మాణ రంగంలో కీలకమైన వడ్డెరల నడ్డి విరిచింది. ఇసుక రీచ్‌లు, క్వారీలను ప్రయివేట్ కంపెనీలకు కట్టబెట్టడంతో వడ్డెరలు కాంట్రాక్టుల కబంధ హస్తల్లో నలిగిపోవడంతో 30 లక్షల మందికి పైగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది. ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని నామినేటెడ్, కాంట్రాక్టుల పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకే ప్రాధాన్యతిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాపోరాటం చేసిన మొదటి సమస్య ఇసుక అక్రమ రవాణాపైనే కావడం విశేషం. అక్రమ ఇసుకతో బీసీలు అధికంగా ఉండే భవన నిర్మాణ కార్మికుల రంగం కుదేలవుతుందని ఆయన వారికి మద్దతుగా గొంత్తెతారు.
నవరత్నాలు.. ప్రచార రత్నాలే!
బీసీలకు అధికంగా సంక్షేమ పథకాలు, నవరత్నాలు అందించామని జగన్ సర్కారు ఢంకా బజాయించుకుంటున్నా అది కేవలం ప్రచారానికే పరిమితమయ్యింది. రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. 2.14 కోట్ల బీసీ జనాభాలో కేవలం ఐదు రకాల కులాలకు చెందిన 44 లక్షల మందికి తప్ప మిగతా 1.70 కోట్ల బీసీలకు నవరత్నాలు అందడం లేదు. కులవృత్తిదారులకు వెన్నుదన్నుగా ఉండే స్వయం ఉపాధి రుణాలను నిలిపివేసింది ఈ సర్కారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రోత్సాహకరంగా సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రాష్ట్రంలో 4 లక్షల మంది చేనేత కార్మికులుంటే వడపోత చేసి కేవలం 80 వేల మందికే లబ్ది చేకూరుస్తున్నారు.
పొత్తుకు పునాది పవన్
జగన్ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజావ్యతిరేక వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ ఓటమే లక్ష్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గత ఐదేళ్లలో వెనుకబాటుకు గురైన బీసీలకు స్వాంతన చేకూర్చేందుకు టీడీపీ-జనసేన కూటమి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, వారికి ప్రత్యేక రక్షణ చట్టం, సబ్‌ప్లాన్‌కు ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయల నిధులు వినియోగించడం, స్థానిక సంస్థలలో 24 శాతానికి కుదించిన రిజర్వేషన్లను 34 శాతానికి పెంచడం, జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు అందజేయడం, చట్టబద్ధంగా కులగణన, రూ.10 లక్షల బీమా పునరుద్ధరణ, రెసిడెన్షియల్ పాఠశాలల అప్‌గ్రేడ్, బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలోపు పూర్తి చేయడం ఈ డిక్లరేషన్‌లో కీలకమైన హామీలు.
బీసీలు సాధికారత సాధించాలంటే వారిలో ఐక్యత పెరగాలి. బీసీలపై ప్రభుత్వ వివక్షను ఎండగట్టాలంటే వారంతా కలిసికట్టుగా తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీసీలకు అన్యాయం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని కంకణం కట్టుకున్నారు. ఆయన అశయాలకు అనుగుణంగా ‘హలో బీసీ...చోడో వైసీపీ..’ నినాదంతో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ`జనసేన కూటమిని గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- కొణతాల రామకృష్ణ,
అనకాపల్లి మాజీ ఎంపీ, మాజీ మంత్రి,
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక