కొలువుల కోసం కోటి ఆశలతో...

మన దేశంలోని మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగం

Update: 2025-01-07 00:45 GMT

మన దేశంలోని మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగం నుంచి ఏర్పడిన రాష్ట్రం. కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు కొట్లాడితే, కొలువులే కొలమానంగా తొలి నుండి మలి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా, ప్రాణాలని ఫణంగా పెడితే ఆ త్యాగాల పునాదులపై తెలంగాణ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి. అది వారి హక్కు కూడా. కానీ గత పదేండ్లలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశని, అసంతృప్తిని, అందోళననీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు వేడుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని రేవంత్ రెడ్డి గుర్తించడం నిజంగా గొప్ప విషయం. ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని, మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల బాధలు, సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్‌గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకి కల్పించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అనేది ఒక సంచలనం. పెం డింగ్‌లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బందిగా జాబ్ క్యాలెండర్ అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. టీజీపీఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త చైర్మన్‌ని నియమించడం మంచి పరిణామం. కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థులకు విముక్తి కల్పించి, తల్లిదండ్రులకు లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ఖరీదైన కోచింగ్‌ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలి.

ప్రతి హామీని నెరవేర్చాలి?

నిరుద్యోగుల బాధలని స్వయంగా చూడటానికి కాంగ్రెస్ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చారు, నిరుద్యోగుల బాధలు కళ్లారా చూసి చలించిపోయిన రాహుల్ గాంధీ మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఇది నా గ్యారెంటీ అని హామీ ఇవ్వడంతో, నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో మళ్లీ పుస్తకాలని పట్టుకున్నారు. తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల హామీ ఆనందాన్ని ఇచ్చింది. యేండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండా, ఎటువంటి పొర పాట్లు లేకుండా, స్పష్టంగా జాబ్ క్యాలెండర్‌లో పెట్టిన తేదీల ప్రకారం వేగంగా ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదే విధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి 4000 రూపాయలని వెంటనే ప్రభుత్వం అందివ్వాలి. తండ్రిలా నిరుద్యోగ బిడ్డలకి గౌరవప్రదమైన జీవితం దక్కేలా భరోసా కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత.

నిరుద్యోగమే లేని తెలంగాణ కావాలి!

ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని, ఖాళీ అయ్యే ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్యో గాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సహకాలు అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి, ప్రయివేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను ప్రభుత్వమే అందివ్వాలి. పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని మార్చాలి. అదే విధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాలని ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది.

- శ్రవణ్ నల్ల,

నిరుద్యోగి

88868 06467

Tags:    

Similar News