సేఫ్ గేమ్.. మన నేతలకు గ్రహణమా..?
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కనబరిచిన
జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కనబరిచిన ఆవేదనపై రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో బలమైన రాష్ట్రాలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలు జాతీయస్థాయిలో ప్రధానంగా రాజకీయరంగంలో వెనుకబడుతున్నారన్నది నగ్నసత్యం. దీనిపై మూలాలను, కారణాలను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
గత ఉమ్మడి రాష్ట్రంలోనూ, విడిపోయిన తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లో కేవలం వేళ్లపై లెక్కబెట్టగలిగిన కొద్దిమంది నేతలు మాత్రమే ప్రభావం చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలున్నాయి. బలమైన నేపథ్యం, సమర్ధవంతమైన రాజకీయాలను ప్రజాస్వామికంగా చేయగలిగే సత్తా ఉన్న నేతలకు కొదవలేదు. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు నేతల సత్తా అన్ని రకాలుగా కాసింత బలమైనదే. కానీ కొందరు మాత్రమే జాతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు మెరుపులు తప్ప నిలకడగా సుదీర్ఘకాలం జాతీయ రాజకీయాల్లో సత్తా చాటకపోవడంపై పలు కారణాలు కనిపిస్తున్నాయి.
గతమెంతో ఘనకీర్తి
స్వాతంత్ర్యం తరువాత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో అగ్రస్థానమైన రాష్ట్రపతిగా 1977లో నీలం సంజీవరెడ్డి పనిచేసారు. దానికంటే ముందు లోక్ సభ స్పీకర్ గానూ ఆయన సమర్ధవంతంగా పనిచేసారు. ఆయన కంటే ముందు హైదరాబాద్ మూలాలున్న జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతిగా పనిచేసినా ఆయన వలస వెళ్లిన కారణంగా తెలుగు రాష్ట్ర ప్రభావం ఏమి కనిపించలేదు. 1991లో ప్రధానమంత్రిగా తెలుగువారైన పీవీ నరసింహారావు సంకీర్ణ ప్రభు త్వాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించి తెలుగువాడి సత్తా జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచస్థాయిలో చాటిచెప్పారు. న్యాయవాద వృత్తి నుండి రాజకీయ నాయకుడిగా మారి బలహీన వర్గాల గొంతుకైన పి.శివశంకర్ కేంద్రమంత్రిగా న్యాయశాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు నేటికి చిరస్మరణీయంగా ఉన్నాయి. దళిత వర్గాల నుండి బలమైన నేతగా కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన జి.వెంకటస్వామి, తన గొంతుకనే ఆయుధంగా చేసుకొని పార్ల మెంట్‌లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కీర్తింపబడ్డ జైపాల్ రెడ్డి లాంటి నేతలు నేటి సమకాలీన దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల నుండి కొరవడటం బాధాకరమే.
ప్రధాని పదవి తలుపు తట్టినా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అప్పట్లో ప్రధానమంత్రి పదవి తలుపుతట్టినప్పటికీ ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి నేతలు వెనకడుగు వేసిన సందర్భాలున్నాయి. నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో కొంతకాలం పోషించిన కీలక భూమిక ఓ తరం నేతలను నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ చేసేలా చేసింది. ఆ దశలో ఎన్టీఆర్ పేరు ప్రధాని పదవికి తలుపుతట్టిన సందర్భం అది. సుదీర్ఘ కాలం సమర్థత, వ్యూహాలతో రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు లాంటి బలమైన నేత కూడా జాతీయ రాజకీయాల్లో అడపాదడపా పాత్ర పోషిం చడం తప్ప రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతూ వచ్చారు. లోక్ సభ స్పీకర్‌గా జీఎంసి బాలయోగి ఎన్నికై రాణిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారనే క్రమంలో ఆయన ఆకస్మిక మరణం తెలుగు జాతికి విషాదాన్ని మిగిల్చింది. తన వాగ్ధాటితో ప్రజాభిమానాన్ని చూరగొనడంతో పాటు అటు కేంద్రమంత్రిగా, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి స్ధాయికి ఎదిగిన తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడంతో పాటు బీజేపీ లాంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ చక్రం తిప్పారు. కమ్యూనిస్టు పార్టీల నుండి సీతారాం ఏచూరి జాతీయ రాజకీయాల్లో పోషిం చిన రోల్ కూడా తెలుగు వారి సత్తాను చాటి చెప్పింది. జాతీయస్థాయిలో రాజకీయ రంగమే కాకుండా విభిన్న రంగాల్లో తెలుగు వారు రాణిం చడం జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆర్బీఐ గవర్నర్‌గా దు వ్వూరి రామిరెడ్డి లాంటి వారు తెలుగు కీర్తిని ఎగరవేసారు.
బెడిసి కొట్టిన కేసీఆర్ వ్యూహం
తెలుగు రాష్ట్రాల్లో బలమైన నేతల తీరు విశ్లేషిస్తుంటే ‘సేఫ్ జోన్’ పాలిటిక్స్ వైపే వారు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ లాంటి బలమైన నేతలు జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక భూమిక పోషించినా, పోషించే అవకాశాలొచ్చినా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఉండాలనే అభిలాష, ఇక్కడ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో రిస్క్ చేయడానికి ఆసక్తి చూపించలేదనేది వారి పొలిటికల్ ట్రాక్ రికార్డు చెబుతున్న సత్యం. జాతీయ రాజకీయాల్లో పూర్తిగా అక్కడే కేంద్రీకృతం చేస్తే రిస్క్‌తో పాటు పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుందనే భావన మన నేతల్లో బలంగా ఉంది. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన సందర్భాల్లో వ్యూహాత్మకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో భాగస్వామ్యాలుగా ఉంటూ కేంద్ర మంత్రులుగానో, మరో కీలక పదవుల్లోనూ రాణించి జాతీయస్థాయి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఆ ధోరణి తెలుగు నేతలకు పెద్దగా సాధ్యం కాలేదనే చెప్పవచ్చు.
అక్కడ మన ప్రాబల్యం తగ్గితే నష్టమే!
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీ, 18 రాజ్యసభ స్ధానాలున్నా ..జాతీయ రాజకీయాల్లో మన ప్రాబల్యం ఇటు రాజకీయపరంగా, అటు వాయిస్ పరంగా సత్తా తగ్గుతూ ఉండటం మన రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేసే అంశం కాదు. జాతీయ రాజకీయాలపై పట్టు ఉండడంతో పాటు చట్టసభల్లో రాణించేలా ప్రయత్నించడం, ప్రజా సమస్యలపై పోరాటానికి అంది వచ్చిన సందర్భాలను ఉపయోగించుకోవడం నేతలకు ఉండాల్సిన లక్షణం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధి నేతలు కూడా నేతల సామార్థ్యాన్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తే జాతీయ రాజకీయాల్లో మన గొంతుకేమీ బలహీనం కాదు.
- అడపా దుర్గ
సీనియర్ జర్నలిస్ట్
90007 25566