గుర్తింపు ఉంటేనే రైతుకు గౌరవం!

సాధారణంగా రైతులు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ రాజకీయాలను చాలా దగ్గరగా, నిశితంగా గమనిస్తారు. రాజకీయ నేతలు మాత్రం

Update: 2025-01-08 01:15 GMT

సాధారణంగా రైతులు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ రాజకీయాలను చాలా దగ్గరగా, నిశితంగా గమనిస్తారు. రాజకీయ నేతలు మాత్రం రైతులకు చాలా దూరంగా ఉంటారు. కానీ ప్రతి నిత్యం రైతు చుట్టే రాజకీయం చేస్తారు. ఈ రెండు రంగాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కానీ రైలు పట్టాల్లా ఎప్పుడూ కలిసిపోవు. సమాంతరంగా ప్రయాణిస్తూ ఉంటాయి. నన్ను అడిగితే, రాజకీయం, వ్యవసాయం రెండూ క్లిష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రంగాల్లోనూ పెట్టుబడి ఎక్కువే. లాభం వచ్చినా, రాకున్నా ఆయా రంగాల్లో కొనసాగుతూ ఉండాల్సిన తప్పని పరిస్థితి. ఈ 2025 కొత్త సంవత్సరంలో రాజకీయం అంతా రైతు చుట్టే ప్రారంభమైంది. 

తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కొత్త సంవత్సరంలో తీపి కబురును అందించాయి. కేంద్రం డీఏపీ సబ్సిడీ ఇస్తూ, పంటకు బీమానిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుకు అభయమిస్తూ, వ్యవసాయం చేసే రైతుకు భరోసానిచ్చింది. నిర్ణయాల్లో నిబంధనల మాట ఎలా ఉన్నా ఈ సంవత్సరం రైతుల జీవితాల్లో కొత్త సంక్రాంతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రధాని నరేంద్రమోడీ ఒక అడుగు ముందుకు వేసి 2025లో తన మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశామని ప్రకటించటం గమనార్హం.

రైతు కోటీశ్వరుడు అవ్వొచ్చు.. కానీ

ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఏడాదిలో రైతు సంక్షేమం కోసం కొన్ని పథకాలు, రాయితీలు ప్రకటించడం శుభపరిణామమే. అయినప్పటికీ రైతు జీవితానికి ఇవి శాశ్వత పరిష్కారాలు మాత్రం కావు. వీటిని కంటితుడుపు చర్యలుగానే పరిగణించాలి. రైతు రాజు కావాలంటే కావాల్సింది మొదటిది ఆత్మగౌరవం, రెండోది ఆర్థిక భద్రత. ఈ రెండు అంశాల కారణంగానే దేశంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రైతుకు ఉన్న భూమి విలువ ప్రకారం కోటీశ్వరుడే కావచ్చు. రైతు భూమిని నమ్ముకుంటాడు కానీ అమ్ముకోవాలనే ఆలోచన రానీ య్యడు. ఎందుకంటే భూమితో తనకున్నది పేగు బంధం. ఆకలినైనా, ఆర్థిక ఇబ్బందులనైనా రైతులు భరిస్తారు... కానీ అవమానాన్ని భరించలేరు. ఎదుటివారి కడుపు నింపడమే తన తపన తప్పా.. కడుపు కొట్టే ప్రయత్నం చేయడు. అయినా, రైతు అంటే ఈ సమాజానికి ఓ చులకన. ఓ చిన్నచూపు.

రైతుకి దొరకని గౌరవం!

నిజానికి వ్యవసాయానికి ఏ వృత్తీ సాటిరాదు.. ఏ వృత్తీ పోటీ కాదు. అయినప్పటికీ సమాజంలో ఇతర వృత్తులకు దొరికిన గౌరవం రైతుకు దొరకడం లేదు. నేటి తరంలో యువ రైతులకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో వ్యవసాయం చేసే అమ్మాయి కావాలన్నా దొరకట్లేదు. ఇది చాలా ప్రమాదకర పరిణామం. కొత్త తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయడానికి పాఠశాలల్లో ‘వన్ డే కిసాన్’ కార్యక్రమాలు చేయాల్సిన దుస్థితిలో ఉన్నాం. యువతరంలో వీకెండ్ వ్యవసాయం అని ఒక ట్రెండ్ వచ్చినా అది కొంతవరకే ఉపశమనం. సమాజంలో రైతులకు గౌరవం దక్కాలంటే ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను గుర్తించాలి. రైతులకు భూమిపై హక్కు కల్పించే పట్టా పాస్ పుస్తకం ఉన్నట్టే.. తాను రైతును అనే ‘గుర్తింపు కార్డు’ కూడా ఉండాలి. రైతులను అవమానించకూడదని చట్టసభల్లో చట్టాలు చేయాలి. రైతులను అవమానించే వారికి కఠిన శిక్షలను అమలు చేయాలి. రైతులను గౌరవించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతుల పురస్కారాలను అందజేయాలి.

ఫార్మర్ అని గర్వంగా చెప్పుకోవాలి..

రైతు రుణమాఫీ అనేది ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉండే మొదటి అంశం. గద్దెనెక్కాక కొందరు మాట నిలబెట్టుకోగా, మరికొందరు నిర్లక్ష్యం చేసిన అనుభవాలు ఉన్నాయి. ఫలితంగా బ్యాంకుల్లో చాలా మంది రైతులు ‘డిఫాల్టర్లు’గా మిగిలిపోయారు. పంట రుణాలను రెన్యువల్ చేస్తూ కాలయాపన చేసిన కారణంగా రైతుల సిబిల్ స్కోరు పూర్తిగా పడిపోయింది. కుటుంబ అవసరాల రీత్యా వారికి బ్యాంకుల్లో మరే ఇతర రుణాలు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ప్రభుత్వాలే ‘కిసాన్ స్మార్ట్ కార్డు’లను అందజేయాలి. కిసాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి రైతుకు ఆదాయం పెంచేలా, ఖర్చులు తగ్గించేలా సంక్షేమ పథకాలు, రాయితీలు కల్పించాలి. రైతు కుటుంబాలకు కార్పొరేట్ దవాఖానల్లో ప్రత్యేక వార్డులు కేటాయించి, రాయితీపై చికిత్సను అందించాలి. రైతుల పిల్లలకు ప్రతి విద్యా సంస్థల్లో ప్రత్యేక కోటాను కేటాయించాలి. బ్యాంకర్లు కూడా ‘కిసాన్ స్మార్ట్ కార్డు’ కలిగిన రైతులకు వడ్డీ లేని రుణాలు అందించాలి. రుణాల చెల్లింపు కూడా పంట పూర్తయిన తరువాత అంటే ప్రతి ఆరు నెలలకోమారు కిస్తీ చెల్లించే విధంగా సౌలభ్యం కల్పించాలి. రైతులు ఆత్మగౌరవ ఇల్లు కట్టుకోవడానికి, అనువైన వాహనాలు కొనుక్కోవడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వాలు సబ్సిడీలు అందించాలి. ప్రతి రైతు తన వాహనానికి ‘ఫార్మర్’ అని సగర్వంగా రాసుకునే రోజు రావాలి.

సంఘటితమే శక్తి!

రైతులు ఐక్యంగా ఉంటే రైతు సంఘం నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే శక్తివంతుడు అవుతాడు. అందుకేనేమో ఈ రాజకీయ నాయకులు రైతులను ఎప్పుడూ సంఘటితం కానివ్వరు. ఎన్నో ఏళ్లుగా ఇది అసంఘటిత రంగంగానే వర్ధిల్లుతున్నది. రైతులు తమ హక్కుల సాధనకు ఏకం కావాలి. మహిళా సంఘాలు ఉన్నట్టే ఊరూరా కుల, మత పట్టింపుల్లేకుండా రైతు సంఘాలు పుట్టుకురావాలి. ఆహార, ఆర్థిక భద్రతే లక్ష్యంగా రైతు సంఘాల పని విధానం ఉండాలి. రైతు పండించిన పంటకు తానే ధరను నిర్ణయించే స్థితికి ఎదగాలి. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమూ పెరగాలి. ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పల్లెలకు తరలాలి. వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో మేలైన వంగడాలు, అధిక దిగుబడులు వచ్చేలా పంట పొలాలు పచ్చబడాలి. సిరులు కురిసి రైతులు శ్రీమంతులుగా ఎదగాలి. మొత్తానికి ఈ 2025 నుంచి అన్నదాతల శకం మొదలవ్వాలని కోరుకుందాం. 

-మారెడ్డి సంజీవ్ కుమార్

80966 77465

Tags:    

Similar News