శేషాచలం కొండల్లో... ఏం దాగుందో చూద్దాం రండి!
ట్రెక్కింగ్ అనేది ఒక విభిన్నమైన జీవితానుభవం. చాలా మందికి ట్రెక్కింగ్ పట్ల కొన్ని అపోహలుంటాయి.
ట్రెక్కింగ్ అనేది ఒక విభిన్నమైన జీవితానుభవం. చాలా మందికి ట్రెక్కింగ్ పట్ల కొన్ని అపోహలుంటాయి. ఎవరెస్టు శిఖరాన్ని, కిలిమజిందారో లాంటి పర్వతాలను అధిరోహించిడమే ట్రెక్కింగ్ అనుకుంటారు. అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ మనలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అలాంటిది అందని జాబిల్లి. ఎందుకంటే అది ఎంతో సాధనతో, ఖర్చుతో కూడుకున్న పని. అలాగని మనలాంటి వాళ్లం నిరాశ పడవలసిన అవసరం లేదు. అందుకే రాఘవ శర్మ కేవలం హిమాలయాలకు వెళ్లడమో, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమో, అమర్ నాథ్ యాత్ర చేయడమో కాదు. ట్రెక్కింగ్ అంటే మన చుట్టూ ఉండే కొండకోనల్లో తిరుగుతూ, వాటి ఆసుపాసులను తెలుసుకోవడం. వాటి సౌందర్యానందంలో మునిగి తేలడం అంటారు.
డెబ్బై యేళ్ళ ట్రెక్కర్ రాఘవ శర్మ శేషాచలం అడవుల్లో, కొండకోనల్లో సంచరించినప్పటి అనుభవాల గురించి రాసిన పుస్తకం శేషా చలం కొండల్లో.. ట్రెక్కింగ్‌కు సంబంధించి ఇది వారి రెండో పుస్తకం. మొదటి పుస్తకం తిరుమల దృశ్యకావ్యం వచ్చిన రెండేళ్ల తర్వాత ఈ పుస్తకం రేపు తిరుపతిలో ఆవిష్కరిస్తున్నారు.
సమిష్టి తత్వం పెంచే ట్రెక్కింగ్
అనుభవం, ఆచరణ లేని రచనకు సాధికారత ఉండదు. తిరుపతిలో నివాసం ఉండే రాఘవశర్మ గత ముప్పై యేళ్ళుగా తిరుపతి చుట్టూ ఆవరించి ఉన్న శేషాచలం కొండలను అధిరోహించి, ఆనందించి స్వానుభవంతో చేసిన రచన ఇది. అందుకే ఒక్క అక్షరం కూడా ఇందులో వృథా కాదు. వ్యక్తిగతం నుంచి సామాజికంలోకి పయనించినప్పుడు మనిషికి విశాల దృక్పథం అలవడుతుంది. ట్రెక్కింగ్ జీవితంలో భాగమైనప్పుడు అది సాధ్యమవుతుంది. మానవ స్వభావాల్లో మార్పు వస్తుంది. ఉన్నది అందరూ పంచుకొని తినడం, ఒకరికొకరు చేయూత నివ్వడం లాంటి సమిష్టి తత్వాలు ట్రెక్కింగ్ వల్లనే సాధ్యం. ట్రెక్కింగ్ సందర్భంలో అధికారం, హోదా, కులం, మతం లాంటి ఇగోలు పనిచేయవనే విషయం స్వానుభవంలోకి వచ్చి మనిషి ఉన్నతమవుతాడు. మనిషితనం కోల్పోతున్న మానవుడు ట్రెక్కింగ్ సమయాల్లో తప్పకుండా మనిషి అవుతాడు. ట్రెక్కింగ్ కేవలం వ్యక్తిగతమైందే కాదు, సామాజికం కూడా..
ట్రెక్కింగ్‌కు వయసుతో పని లేదు!
రచయిత గత ముప్పై యేళ్లుగా ట్రెక్కింగ్ చేస్తున్నా ఈ పుస్తకంలో ఉన్నవి రెండు మూడేళ్ల అనుభవాలు.. దీని వల్ల ట్రెక్కింగ్‌కు వయసుతో పని లేదనే విషయం స్పష్టమైంది. శేషాచలం అడవుల్లో దాగివున్న ఎన్నో తీర్థా లను, కోనలను పరిచయం చేశారు. గుంజ న జలపాతాన్ని తమ స్థానిక నయాగారాగా చెపుతారు. గుంజన.. నా గుంజనా అంటూ, ఎవ్వరూ మీటకుండానే జల సంగీతాన్ని వినిపించే రాతి సితారవి! అంటూ రచయితకు అత్యంత ఇష్టమైన గుంజన జలపాతం పైన ఒక కవిత కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకుంది. ఎన్నోసార్లు గుంజనకు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లడం దాని సంగీత పారవశ్యానికి లోనై సాహసోపేతంగా దానిలోకి దూకే యడం ఎప్పుడూ జరిగేదే..
శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త కూడా..
ఈ పుస్తక రచనలో రచయిత ఒక పర్యా వరణ శాస్త్రవేత్తగా కనిపిస్తారు. ఆయనకు అడవి అన్న, అడవి జంతువులన్నా అమితమైన ప్రేమ. జంతువులు సమిష్టిగా లేకపోతే మనుగడ సాగించలేవు. మనలా ఒంటరిగా బతుకలేవు. సమూహంలో ఉండి ఒంటరిగా ఆలోచించలేవు. అవి సమూహంలోనే ఉండి సమూహంగానే ఆలోచిస్తాయి అంటూ నేటి సాంకేతిక యుగంలో మనిషి ఒంటరై పోయిన వైనాన్ని చెప్పకనే చెప్పారు. సహ జంగా బతికే ప్రకృతి సూత్రం చెట్లకు, పక్షులకు తెలిసినట్టుగా మనకు తెలియదు గాక తెలియదంటారు. అందుకే మనకిన్ని కష్టాలు, రోగాలు.. అడవి నియమాలను ఆపోసిన పట్టిన ఆయన మన లాగా వాటికి జాతి వివక్ష లేదంటారు. మహిళా ట్రెక్కర్ వసతి గురించి ఒక ప్రత్యేక వ్యాసమే ఉంది. మహిళలు ఎక్కువగా ట్రెక్కింగ్ రంగంలోకి రాకపోవడానికి గల కారణాలను ఈ వ్యాసంలో చర్చించారు. ఈ విషయాలను చదువుతుంటే ఆయన ఒక సామాజిక కార్యకర్తలాగా కనిపిస్తారు.
అడవిలో... అమ్మకు లేఖ
ఈ పుస్తకంలో మరో అద్భుతం అడవినుంచి అమ్మకు బహిరంగ లేఖ రాయడం. చదివిన పాఠకులకు కళ్లలో నీళ్లు రావడం ఖాయం. మరో వ్యాసం అమ్మ ఎదురుచూపులు. అమ్మ అంటే అభిమానం అందరికీ ఉంటుంది. కానీ ఆ అభిమానాన్ని అక్షరాల్లో కూర్చి పుస్త కంగా ప్రచురించే వాళ్లు కొందరే. అమ్మ ముచ్చట్లతో ఒక పుస్తకాన్ని తీసుకు వచ్చినా తనివితీరలేదు ఆయనకి. తాను అడవికి వెళ్లి నప్పుడు అమ్మ పడిన ఆందోళనకు అక్షర రూపం రెండో వ్యాసం. తమను ఒంటరి వాళ్ళను చేసి విదేశాలలో స్థిరపడిన బిడ్డల పట్ల తల్లుల అంతరంగానికి సాక్ష్యం. ఇవి వ్యక్తిగతం కాదు. ఎందరో అమ్మల అంతరాంతరాలలో గూడు కట్టుకున్న ఆందోళనకు, సందేహాలకు సాక్షరాలు.
ట్రెక్కర్లను ప్రేమిద్దాం!
సాటి మనుషులను ప్రేమించడం, గౌరవించడం ఉత్తముల సంస్కారం. రచయిత తన తోటి ట్రెక్కర్లలోని వ్యక్తిత్వాలను గమనించి పేరు పేరునా వారిని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈయన ట్రెక్కింగ్ పుస్తకాలు చదివాక ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది. అందుకు వీలుగా TTC వాళ్ల ఫోన్ నెంబర్లు ఇవ్వడం బాగుంది. ట్రెక్కింగ్ కేంద్రం గా ఎన్నో సామాజిక, పర్యావరణ, జీవవైవిధ్య, జీవన నైపుణ్యాలను చర్చించిన పుస్తకం ఇది. అందరూ తప్పకుండా చదివి ఆచరించ వలసిన అంశాలు అమితంగా ఉన్నాయి.
(నేడు తిరుపతిలో 'శేషాచలం కొండల్లో' పుస్తకావిష్కరణ సందర్భంగా)
-గిరిజా పైడిమర్రి
ట్రెక్కర్
99494 43414