ఓటుతో పట్టభద్రులు.. నోటుతో అభ్యర్థులు!!

ప్రతి ఎన్నిక ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీక. కానీ, పట్టభద్రుల ఓటు కోసం రాజకీయాలు చేసే పద్ధతి

Update: 2025-01-08 01:00 GMT

ప్రతి ఎన్నిక ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీక. కానీ, పట్టభద్రుల ఓటు కోసం రాజకీయాలు చేసే పద్ధతి ప్రతిసారి ఒకే కథను పునరావృతం చేస్తోంది. తెలంగాణ శాసన మండలి ఎన్నికలు సమీపిస్తేనే..పట్టభద్రుల సమస్యలపై చర్చలు మొదలవుతాయి. ఈ నిరుద్యోగులు, పట్టభద్రులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, మోసపూరిత వాగ్దానాల బలివస్తువులుగా మారుతున్నారు. ఎన్నికల హడావుడిలో తాత్కాలిక హామీలతో ఆకర్షించే నాయకత్వం కంటే, నిజమైన పరిష్కారాలను తీసుకువచ్చే అభ్యర్థులను పట్టభద్రులు ఎంచుకోవాల్సిన సమయం ఇది. 

ఈ ఎన్నికలు విద్యావంతులైన ఓటర్లకు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్‌కు కూడా కీలకం. గత పదేళ్లలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగ పట్టభద్రులకు జరిగిన అనుభవాలను, నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, తాత్కాలిక ప్రలోభాల వెనుక రాజకీయ అసమర్థతను గుర్తించి, చైతన్యవంతమైన నిర్ణయాలతో తమ ఓటును వినియోగించాలి. పట్టభద్రుల ఓటు ఒక మార్గదర్శకమవుతే, ప్రజాస్వామ్యం బలపడుతుంది. సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.

పట్టభద్రులు.. ఒక చైతన్య క్షణం

తెలంగాణలో 2025 మార్చిలో జరగబోయే మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు కేవలం ఓటు ప్రక్రియగా కాకుండా, విద్యావంతుల గొంతుకను ప్రతిబింబించే ప్రజాస్వామ్య వేదికగా నిలవనున్నాయి. ఇవి రాష్ట్ర భవిష్యత్‌కు మార్గదర్శకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇది పట్టభద్రుల సామాజిక ప్రాధాన్యతను, హక్కులను రుజువు చేసే కీలక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ ఎన్నికలు సమాజాభివృద్ధిలో వారి పాత్రను గుర్తించి, విద్యావంతుల ప్రతినిధులను రాజకీయ వ్యవస్థలోకి తీసుకురావడంలో ప్రత్యేకమైనవి. కానీ, తప్పుడు హామీలు, తాత్కాలిక ప్రలోభాలతో పట్టభద్రులను మోసగించే అభ్యర్థులు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీస్తారు. పట్టభద్రులు వివేకంతో తాత్కాలిక ఆకర్షణలను పక్కన పెట్టి, అజెండా, అనుభవం, గత చరిత్ర ఆధారంగా సుదీర్ఘ దృష్టి కలిగిన నాయకత్వాన్ని ఎంచుకోవాలి. నిజాయితీ, నూతనత్వం, సమగ్ర అభివృద్ధికి కృషి చేసే వారికి ఓటు వేయాలి. ఇది ప్రతి పట్టభద్రుడి భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తివంతమైన వేదిక. ఇది విద్యావంతుల హక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది.

ప్రతిసారీ పునరావృతమవుతోంది!

శాసన మండలి ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే పోటీ చేసే అభ్యర్థులు పట్టభద్రుల ప్రయోజనాలను గుర్తుచేసుకోవడం అనేది ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట. ఇది కేవలం ఓటు కోసం నిరుద్యోగులు, పట్టభద్రులను తాత్కాలికంగా ప్రోత్సహించే మోసపూరిత చర్యలాగే కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ స్వలాభాల కోసం తాత్కాలిక ఆకర్షణలైన విందులు, కానుకలు, ప్రలోభాల ద్వారా పట్టభద్రులను ప్రభావితం చేయడం. విద్య, ఉపాధి వంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టి తాత్కాలిక అవసరాలను దృష్టిలో పెట్టి తప్పుదారులలో ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడం ఆనవాయితీగా మారిన మోసంగా ప్రతీ ఎన్నికల సమయంలో ఇదే విధానం పునరావృతమవుతోంది, కానీ దీనివల్ల పట్టభద్రులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించడం లేదు. పట్ట భద్రుల సమస్యలపై అనేక వాగ్దానాలు చేసినప్పటికీ, అవి తాత్కాలిక ఉపశమనాలతో కాల్పనిక చర్చలకే పరిమితం అవుతున్నాయి.

ఆకర్షించే వ్యూహాల అంతరార్థం

ప్రజాసేవ అనేది దీర్ఘకాలిక కృషి, నిబద్ధత, పట్టుదలతో సాధించాల్సిన లక్ష్యం. కానీ, గతంలో ప్రజాసేవ చేయని కొందరు, రాబోయే ఎన్నికల దృష్ట్యా, పట్టభద్రుల ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు వ్యూహాత్మక చర్యలు చేపడుతున్నారు. విద్యా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన వారు, లేదా రాజకీయ పదవుల కోసం ఉద్యోగాలకు రాజీనామా చేసినవారు, గ్రామస్థాయిలో అనుచరులను నియమించి "ఆకర్షణీయమైన జీతాలు" ఆఫర్ చేస్తూ పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమాచారం స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. డబ్బు ఖర్చు చేస్తూ, అనుచర వర్గాల మద్దతుతో ప్రచార హంగామాలు నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీలు, ఫ్లెక్సీలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కార్యక్రమాలు చేపట్టి పట్టభద్రుల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువతను మభ్యపెట్టడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, ఓటు హక్కును బాధ్యతగా వినియోగించి నిజమైన అభ్యర్థులను ఎన్నుకోవడం సమాజానికి న్యాయం చేస్తుంది.

అర్హత కలిగిన అభ్యర్థి లక్షణాలు..

తెలంగాణ శాసనమండలి అభ్యర్థులు ప్రజాస్వామ్య శక్తిని గౌరవించి, రాష్ట్రాభివృద్ధికి విధేయతతో పనిచేసే వారు కావాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, విద్యార్థులను ప్రేరేపిస్తూ, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడంలో చురుకుగా వ్యవహరించి ఉండాలి. నిరుపేద విద్యార్థులకు ‘ఉచిత విద్య’ను అందించడంలో,‘ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు’ను, ‘విద్యా విధ్వంసానికి వ్యతిరేకంగా’ పని చేసిన అనుభవం ఉండాలి. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి కొత్త ప్రతిపాదనలు’ రూపొందించి అమ లు చేయగల ప్రతిభ కలిగిన వారిని పట్టభద్రులు ఎంచుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలి. ఇలాంటి వారికే పార్టీలు టికెట్లు కేటాయించాలి. ప్రజాస్వామ్య విలువలు, పార్టీ సిద్ధాంతాలను గౌరవించడం ఈ ప్రక్రియకు కీలకం.

- నంగె శ్రీనివాస్, ప్రిన్సిపాల్

విద్యా విశ్లేషకులు

94419 09191

Tags:    

Similar News