పోలవరం విస్తరణ.. తెలంగాణకు ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్యల

Update: 2025-01-09 01:15 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్యల తీవ్రత పెరుగుతోందని, తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా భూముల్లో పంటలు మునిగిపోతాయని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలిపింది. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే భ‌ద్రాచ‌ లానికి బ్యాక్ వాట‌ర్ ముప్పు ఉంటుంద‌ని స్పష్టం చేసింది. ఇక ఎఫ్ఆర్ఎల్ వ‌ద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుంద‌ని తెలిపింది. ముర్రేడువాగు, కిన్నెర‌సాని న‌దుల ప‌రిస‌రాలు మునుగుతాయ‌ని పేర్కొంది. అయితే ఆంధ్ర ప్రభుత్వం మాత్రం వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నిల్వచేసి వేలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి.. లక్షలాది మంది ప్రజల గొంతు తడిపేందుకు ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వాదిస్తోంది.

బనకచర్లతో భారీ నష్టం!

బేసిన్ అవసరాలకు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకూ అడ్డుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు గోదావరి, అటు కృష్ణా రెండు నదుల నుంచి అడ్డంగా దోచుకునేందుకు ప్రణాళిక ప్రకారం జల దోపిడికి కుట్ర పన్నుతుంది. అసలు ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లోనే లేని రాయలసీమకు కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో ఉన్న బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నది. నీటి తరలింపు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ నాగార్జునసాగర్ కుడి కాల్వనే ఓ రిజర్వాయర్‌గా మార్చి బనకచర్లకు నీటిని తరలించేలా ప్లాన్ చేసింది. మొదటగా పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తాడిపూడి మెయిన్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. అక్కడి నుంచి రెండో దశలో సాగర్ కుడి కాల్వ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించేలా ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు మధ్యలో ఆరు లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నది. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల ప్రాజెక్టుకు మధ్య వైకుంఠపురం వద్ద ఇంకొ బ్యారేజీనీ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

400 కి.మీ నీటిని తరలించి..

సాగర్ కుడి కాల్వను.. ఆ కాలువ 80వ కిలోమీటర్ పాయింట్ వద్ద వెడల్పు చేసి ఆ పాయింట్ వద్దనే మరో రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి వరకు ఐదు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ఆంధ్ర ప్రభుత్వం కుడి కాల్వ పాయింట్ తర్వాత మరో లిఫ్ట్‌ను నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపునకు ప్లాన్ చేసారు. ఇక మూడో దశలో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కి మూడు లిఫ్టులు, రెండు సొరంగాల ద్వారా నీటిని తరలిస్తారు. ఈ మధ్యలో వచ్చే ఒక సొరంగం పొడవు దాదాపుగా 25.6 కిలోమీటర్లు కావడం గమనార్హం. ఈ మొత్తం జీ-బీ ప్రాజెక్టు కోసం రూ.80,112 కోట్లు ఖర్చు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. స్టేజ్ 1 (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు)లో 198 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వలను తవ్వనున్నది. స్టేజ్ 2లో 84 కిలోమీటర్లు, మూడో స్టేజ్‌లో 108.4 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో నీటిని తరలించనున్నది. మొత్తంగా 400.4 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించనున్నది.

వాటాలు తేలకముందే..

వాస్తవానికి కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి వాటాల కేటాయింపులపై ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. 811 టీఎంసీల్లో తెలంగాణ సగం వాటాకు పట్టుబడుతున్నది. బేసిన్ పరంగా చూసుకుంటే 555 టీఎంసీలు తెలంగాణాకే చెందుతాయని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నది. గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని, అలా వాడుకోకుండా సము ద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచర్లకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. వాస్తవానికి 2 రాష్ట్రాలకు గోదావరిలో కేటాయించిన 1,486 టీఎంసీలకు మించి ఒక చుక్క ఎక్కువ వాడుకునేందుకు హక్కులు లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 516 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులున్నాయి. కానీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి, సముద్రంలో కలుస్తున్న జలాల్లో సర్‌ప్లస్ ఉన్న ఏడాదిలోనే 200 టీఎంసీలను తరలిస్తామంటున్నది. కానీ కృష్ణాలో వాటాలు తేలకముందే ఏపీ మాత్రం కృష్ణా బేసిన్ ద్వారానే పెన్నా బేసిన్‌లోని రాయలసీమకు నీటిని తరలించాలని మాస్టర్ ప్లాన్ వేసింది. దీనివల్ల కూడా తెలంగాణకు భారీ ఎత్తున అన్యాయం జరుగుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

శ్రీశైలానికి భారీ గండ్లు ..

ఇప్పటికే శ్రీశైలానికి ఏపీ భారీ గండ్లు కొట్టింది. 44,600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్) కెపాసిటీని పెంచి 1,56,100 క్యూసెక్కులకు చేర్చింది. అక్కడి నుంచే బనకచర్ల కాంప్లెక్స్‌కు తరలించి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి. తెలుగు గంగ ప్రాజెక్టు కెనాల్, నిప్పులవాగు ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నది. అది చాలదన్నట్టు సంగమేశ్వరం వద్ద శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని దొడ్డిదారిలో తోడుకుని వెళ్లేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టునూ చేపట్టింది. అక్కడి నుంచి రోజూ 3 టీఎంసీల నీటిని శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్‌కి తరలించి బనకచర్లకు తీసుకుపోనున్నది. కుడి ప్రధాన కాలువ లైనింగ్‌ను పెంచి అంతకుమించి నీటిని తీసుకుపోయేందుకూ ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తంగా ఇటు కృష్ణా.. అటు గోదావరి బేసిన్ నుంచి నీటిని దొడ్డి దారిలో ఏపీ మళ్లించుకుపోయే కుట్రలకు పూనుకుంటున్నదన్న వాదన వినిపిస్తున్నది

అప్రమత్తమైన రేవంత్ ప్రభుత్వం..

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణాపై పడే ప్రభావాన్ని ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, సూచించారు. ఆ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించబోతున్నారు. వీరు భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఏపీ వరద నీటిని ఉపయోగించుకునే పేరుతో పోలవరం ప్రాజెక్టును విస్తరించడం వల్ల గోదావరి నీటిలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే వాదనలతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఆ ప్రాజెక్టుకు అభ్యంతరాలు తెలుపుతూ త్వరలోనే దీనిపై జీఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

డాక్టర్. బి. కేశవులు ఎండి. సైకియాట్రీ

చైర్మన్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం

85010 61659

Tags:    

Similar News