రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని ప్రతిపక్షాలు..

ఏ రాష్ట్రంలోనైనా ప్రజాపక్షం వహించాల్సిన ప్రధాన బాధ్యత ప్రతిపక్షానిదే, కానీ మన రాష్ట్రంలోని ప్రతిపక్షాల

Update: 2025-01-07 01:00 GMT

ఏ రాష్ట్రంలోనైనా ప్రజాపక్షం వహించాల్సిన ప్రధాన బాధ్యత ప్రతిపక్షానిదే, కానీ మన రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరు చూస్తుంటే దీనికి పూర్తి విరుద్ధంగా సొంత ఎజెండాలు ఏర్పరచుకొని ప్రజల పక్షం వహించకుండా ఒకరి ప్రయోజనాలు ఒకరు తీర్చుకోవడంలోనే మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల ముందు ‘కొట్టినట్టు నువ్వు చేయ్, ఏడ్చినట్టు నేను చేస్తా’ అన్నట్టుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు పాలనను గాలికొదిలేసి, ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా పరిపాలించి నిరంతరం ఒకరిపై ఒకరు తిట్లదండకాలతో వార్తల్లో నిలిచి ప్రజల దృష్టి మళ్లించాలని చూశారు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేసిన ఈ కుటిల ప్రయత్నాలను తెలంగాణ తిప్పికొట్టింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తిట్ల పురాణం పనిచేయడం లేదని తలచి బీఆర్ఎస్ పూర్తిగా అస్త్ర సన్యాసం చేసి తన ‘బీ’టీం ఐన బీజేపీకి మేలు చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో సగం సీట్లను సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఎన్నో ఉదాహరణలు..

గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదగనీయొద్దనే కుట్రలో భాగంగా పైకి బీజేపీపై యుద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ లోలోపల మాత్రం బీజేపీకి గట్టి మద్దతునే అందించింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నాటి సంఘటనలు మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అధికారం వచ్చిన తొలినాళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీ బిల్లుపై అత్యవసర శాసనసభ ఏర్పాటు చేసి మరీ కేసీఆర్ మద్దతిచ్చారు, అది మొదలు 2018లో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నాడు పార్లమెంట్లో ఓటింగ్‌లోనే పాల్గొనలేదు. అనంతరం ఆర్టీఐ సవరణ చట్టానికి ఎన్డీఏకు మద్దతుగా రాజ్యసభలో ఓటేసింది. ఇక జీడీపీని సర్వనాశనం చేసిన అనాలోచిత నోట్ల రద్దును ఎన్డీఏ ముఖ్యమంత్రుల కన్నా ముందే కేసీఆర్ దానిని సమర్థిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇంకా ప్రజలకు గుర్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్‌కు రాజ్యసభకు గైర్హాజరుతో మద్దతు, నదీజలాల సవరణ బిల్లు, కాళేశ్వరం కూలిపోవడంలో భాగమున్న డ్యామ్ సేప్టీ బిల్లుకు నిస్సందేహంగా మద్దతిచ్చారు కేసీఆర్. దేశ చరిత్రలోనే మోడీ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులు రద్దు చేసుకున్న నల్ల సాగు చట్టలకు ముఖ్యమంత్రి హోదాలో మద్దతిచ్చి తర్వాత నిరసనలతో ప్లేటు ఫిరాయించారు. వీటన్నింటికి పరాకాష్టగా 2016 ఆగస్టు 7న మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానితో తెలంగాణకు ఏమొద్దు మాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి అని కుండ మట్టికి, చెంబు నీళ్లకు సాగిలబడింది కేసీఆరే, ఇవన్నీ బీజేపీ, బీఆర్ఎస్ బందానికి చరిత్ర చెప్పిన సత్యాలు.

ఒకే ఎజెండాను అమలు చేస్తూ..

ఇక 2023లో తమ పాచికలు పారకపోవడంతో ఇన్నాళ్లు తిట్టుకుంటూ ఇచ్చిన బిల్డప్‌లను వదిలేసి ఇప్పుడు బహిరంగంగా చెట్టా పట్టాల్ వేసి తిరుగుతున్నాయి. ఓ వైపు ఏడు లక్షల కోట్లకు పైగా తెలంగాణ సమాజంపై అప్పుల భారం మోపి, రోజువారీ వ్యవహారాలకు సైతం ఇబ్బంది పడేంతలా రాష్ట్రాన్ని దిగజార్చింది బీఆర్ఎస్ సర్కారైతే.. దీనికి ఎఫ్‌ఆర్‌బీ‌ఏం నిబంధనల పేర సంపూర్ణ సహకారం అందించింది నాటి కేంద్ర సర్కార్ అన్నది వాస్తవం. అందుకే ప్రజా ప్రభుత్వం వైట్ పేపర్ల ద్వారా వారి బండారాన్ని బట్టబయలు చేసినా దానిపై బీజేపీ స్పందించడం లేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై నిస్సిగ్గుగా వారి బీఆర్ఎస్‌తో కలిసి దాడులు చేస్తుంది. దీనికి నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలే ప్రత్యక్ష ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, తీసుకున్న సొంత లబ్ది నిర్ణయాలను కనీసంగానైనా బీజేపీ సభ్యులు ఖండించడం లేదు. ఆర్బీఐ నివేదిక పేర కార్పొరేషన్ల అప్పులు దాచి బీఆర్ఎస్ చేస్తున్న అబద్ద ప్రచారంలో బీజేపీ పాలుపంచుకొంటోంది. ఏడాది కాలంలో ఏకకాలం 2లక్షల రైతు రుణమాఫీ చేసి, 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను అందించిన ప్రజాప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఆ పార్టీలు చేస్తున్న విమర్శలు సామాన్యుడిని ఆలోచనలో పడేస్తున్నాయి. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో బస్తీ నిద్రలు, మూసీ బాటలు అంటూ వేర్వేరుగా ఒకే ఎజెండాను అమలు చేస్తూ ఇద్దరూ ఒకటే అని చాటుతున్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్య ప్రభుత్వాలు కనీసం ఆలోచించడానికి కూడా సాహసించలేని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని గుర్తించడానికి కూడా నిరాకరించడం వెనకాల బీజేపీ పట్ల మారిన వైఖరే అనేది సుస్పష్టం. ఇక లక్ష కోట్ల అవినీతి అని ఆరోపించిన 56 ఇంచుల చాతిగల ప్రధాని మోదీ బీఆర్ఎస్ అవినీతిపై కనీస చర్యలకు కంటితుడుపుగానైనా సిఫార్సు చేయకపోవడం వెనక ఉన్నది ఈ ఇద్దరి మధ్యగల బంధమే అన్నది క్లియర్‌గా కనిపిస్తున్న సత్యం.

ప్రజలు హర్షించరు..

రాజకీయాలు ఎలా ఉన్నా... ప్రజా సంక్షేమాన్ని, ప్రాంతాల అభివృద్ధిని అంతిమంగా ప్రజా ప్రతినిధులు మననంలో ఉంచుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు, విమర్శల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇదే ప్రతిపక్షాల కనీస బాధ్యత, రాష్ట్ర శాసన సభ ప్రతిపక్షనేత ఏడాదికిపైగా కాలంలో సభకు హాజరైంది ఒక్క రోజు, అదీ ప్రమాణ స్వీకారానికి, ఇది క్షమార్హం కాని విషయం. ఈ విషయంలో అతని అనుభవాన్ని రాష్ట్రానికి వాడుకోవాలనే సదుద్దేశ్యంతో బేషజాలకు పోకుండా ఏకంగా ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అయినా ఆయన రావడం లేదు. ఈ విషయంలో కనీసం రాష్ట్ర ప్రతిపక్ష నాయకున్ని బీజేపీ ప్రశ్నించకపోవడం వాళ్లిద్దరి మధ్యలో ఉన్న బంధం ఫెవికాల్ కన్నా గట్టిగా ఉందని తెలంగాణ పౌరులందరు చెప్పుకుంటున్నారు. అయితే, బీజేపీ, బీఆర్ఎస్ కలిసినా, విడివిడిగా ఉన్నా... తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల రాష్ట్ర ప్రయోజనాలకు పాతరేయడం మాత్రం ఎవరూ హర్షించరు.

- పున్నా కైలాష్ నేత

జనరల్ సెక్రటరీ, టీపీసీసీ

94921 87210

Tags:    

Similar News