ONOS:విద్యలో అసమానతలు తగ్గించేందుకు..
భారత ప్రభుత్వం 2025 జనవరి 1న ప్రవేశపెట్టిన “ఒక దేశం ఒక సభ్యత్వం (ఓఎన్ఓఎస్)” పథకం, దేశంలోని
భారత ప్రభుత్వం 2025 జనవరి 1న ప్రవేశపెట్టిన “ఒక దేశం ఒక సభ్యత్వం (ఓఎన్ఓఎస్)” పథకం, దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధన సంస్థల్లో అధిక స్థాయి శాస్త్రీయ వనరులను అందుబాటులోకి తేవడంతో పాటు సమాన అవకాశాలకు దోహదపడే నిర్ణయాత్మక అడుగుగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు 13,000కి పైగా ఈ-జర్నల్‌లను ఉచితంగా అందించడమే దీని ప్రధాన లక్ష్యం. అధిక చందాల కారణంగా అంతర్జాతీయ జర్నల్‌లను ఉపయోగించేందుకు అవకాశాలు కోల్పోయిన చిన్నపాటి విద్యాసంస్థలకు ఇది ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చే మార్గంగా కనిపిస్తుంది. రూ.6,000 కోట్ల పెట్టుబడితో 2025–2027 మధ్యకాలంలో అమలవనున్న ఈ ప్రణాళిక ఎస్‌టీఈఎమ్ (STEM), మెడికల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, హ్యూమనిటీస్ వంటి అనేక విభాగాల్లో ప్రాముఖ్యమైన జర్నల్‌లను ఒకచోటు పరిపూర్ణంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఒకే లైసెన్స్‌తో..
భారతీయ అకడెమిక్, పరిశోధన రంగాల్లో ఎక్కువగా కనిపిస్తున్న అసమానతలకు, అంతర్జాతీయ ప్రమాణాలున్న జర్నల్‌ల చందాల కారణంగా మంచి ప్రమాణాలున్న జర్నల్‌లను పొందలేక, అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు పోటీ ప్రపంచంలో వెనుకపడిపోతున్నారు. ఈ పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక లైసెన్స్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చులతో ఈ-జర్నల్‌లను అందించే అవకాశంను ఇది ఏర్పరుస్తుంది. తద్వారా చిన్న సంస్థలు కూడా ప్రాథమిక పరిశోధన వనరులను ఉపయోగించగలుగుతాయి. దీంతో స్థాయి తేడాలు మరింత తగ్గుముఖం పడతాయి. అలాగే జాతీయ స్థాయిలో శాస్త్రీయ సమాచారాన్ని విస్తృతంగా అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెనుకబడిన ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. జాతీయ విద్యా విధానం -2020, అనుసంధాన జాతీయ పరిశోధన ఫౌండేషన్ (ANRF) లక్ష్యాలను చేరుకోడంలో సహకారం అందించడం దీని ప్రధాన విధులు.. దీనిని మొదట ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలకు అందుబాటులోకి తీసుకువచ్చి, తర్వాత ప్రజా ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు విస్తరించడం, చివరికి లైబ్రరీలు ద్వారా ప్రజలకు కూడా వనరులు అందించడం లక్ష్యం. దీనిని దశలవారీ విధానంలో అమలు చేయాలి. ప్రతి దశ పూర్తిగా విజయవంతమైన తర్వాతే తదుపరి దశను విస్తరించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సమస్యాత్మక అంశాలను ముందే గుర్తించి, వాటిని పరిష్కరించిన అనంతరం మరో దశకు పునాది వేయవచ్చు.
మౌలిక వసతులు, శిక్షణపై దృష్టి
ఓఎన్ఓఎస్ విజయవంతతకు డిజిటల్ మౌలిక వసతులు అత్యంత కీలకం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప టికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రంగానే ఉంది. కనెక్టివిటీ లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు, వినియోగదారులైన విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా తగిన శిక్షణను కల్పించాల్సిన అవసరం ఉంది. ఓఎన్ఓఎస్ పథకం భార తీయ పరిశోధనలో సమాన అవకాశాలకు దోహదపడే కీలక మలుపుగా నిలుస్తుంది. అకడమిక్ జర్నల్‌లు, పరిశోధన వ్యాసాలను విస్తృతంగా అందుబాటులోకి తేవడం ద్వారా వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు అధిక ఖర్చుల అడ్డంకులు లేని వనరులను వినియోగించుకునే వీలుంటుంది. వివిధ అంశాల్లో కొత్త అన్వేషణలకు ఇది అనుకూల వాతావరణాన్ని తీసుకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌలిక వసతుల లోటు, ఎపీసీ (ఆర్టికల్ ప్రాసెసింగ్ చార్జెస్) వంటి సవా ళ్లు ఉన్నప్పటికీ, ఓఎన్ఓఎస్ విజయవంతమైతే మరింత సమానత్వాన్ని ప్రతిబింబించే ప్రపంచస్థాయి పరిశోధన దిశలో భారతదేశానికి ఎంతో మేలైన మార్గాన్ని చూపించగలదని ఆశిస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఇది మార్గనిర్దేశకంగా మారుతుంది.
- డా. శ్రీకాంత్ పోతర్ల,
అసిస్టెంట్ ప్రొఫెసర్
97036 64124