రైతులపై వ్యతిరేకత ఎందుకు?
పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పిన ఎం.ఎస్. విశ్వనాథంకు
పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పిన ఎం.ఎస్. విశ్వనాథంకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించి చేతులు దులుపుకుంది. కానీ ఆయన చెప్పిన సూచనలకు మాత్రం నిలువునా పాతర వేసింది. వాటిని అమలు చేస్తామని అనేకసార్లు బహిరంగ సభల్లో వల్లించిన బీజేపీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటంలో ఘోరంగా విఫలమైంది.
రైతులు తమ 11 డిమాండ్లతో ఢిల్లీ సరిహద్దుల్లో మంచులో గడగడా వణుకుతూ, భయంకర పొల్యూషన్‌తో శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఆందోళన చేసినా.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో కనీసం చలనం లేకపోవడం శోచనీయం. ఎండనకా... వాననకా ఆరుగాలం చెమటోడ్చి కష్టించే అన్నదాతలకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా?!
కష్టాలను మరింత పెంచి..
'మాటల్లో ఊరేగించి, చేతల్లో ఉరి బిగించే' మోసకారి విధానాలతో అన్నదాతల ఉసురు పోసుకోవటం బీజేపీ పాలకులకు పరిపాటిగా మారింది. 'రైతుల ఆదాయం రెండు రెట్లు పెంచుతాం' అంటూ వాగ్దానాలతో ఊదరగొట్టిన ప్రభుత్వం... ఇప్పుడు ఆ రైతుల వెన్నెముకను కర్కశంగా విరిచేసే చేతలకు తెగిస్తుంది. చేసిన శ్రమకు, పండించిన పంటలకు కనీసంలో కనీసంగా ఖరీదు కట్టడం అనేది ఒక సాధారణ న్యాయం. కానీ, ఈ సాధారణ న్యాయం గత దశాబ్ద కాలంలో రైతులకు అందలేదు. రైతులకు ప్రకృతి వైపరీత్యాలతో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వాటికి అదనంగా దళారుల మోసాలు, మార్కెట్ ధరల పతనాలు, రవాణా భారాలూ చేరి, కష్టాలూ కన్నీళ్లే రైతులకు మిగిలాయి. నేడు అనేక కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రైతుల పాలిట గుదిబండలుగా మారాయి. వ్యవసాయ పెట్టుబడులు మోయలేని వ్యయ భరితంగా ప్రభుత్వ విధానాలు మార్చేశాయి. ఈ దుర్భర స్థితిగతుల నుంచి రైతులను రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం...తన నిర్లక్షంతో ఆ కష్టాలను మరింత పెంచుతుంది తప్ప, భరోసాగా నిలవటం లేదు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు..
వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయట పడేయటానికి గతంలో స్వామినాథన్ కమిషన్ ఎన్నో సిఫార్సులు చేసింది. పంటలకు పెట్టుబడిలో 50 శాతంను మద్దతు ధరగా ఇవ్వాలని, సింగిల్ యూనిట్ ప్రాతిపదికన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని, రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని, మార్కెట్ సదుపాయాలు పెంచాలని సూచనలు చేసింది. దశాబ్దం క్రితం వరకూ అధికారంలోకి రాకముందు బీజేపీ బలంగా వినిపించి, నినదించిన ఎన్నికల వాగ్దానాల్లో ఇవన్నీ ఉన్నవే. గద్దెనెక్కాక ఆ హామీలను ఆవలకు విసిరేసింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కూడా నిర్ధాక్షణ్యంగా తీసేసి, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే దుస్సాహసానికి బహిరంగంగా ఒడిగట్టింది. వాటిని వెనక్కి తిప్పి కొట్టటానికి లక్షలాది మంది రైతులు నెలల తరబడి, ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక పోరాటం చేసిన చరిత్ర మనకే కాదు... ప్రపంచ ప్రజలకు తెలిసింది. రైతులు, ప్రజలు ఆందోళన చేసినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమంలో మరణించిన 750 కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నయాపైసా సహాయం చేయలేదు.
ప్రధాని క్షమాపణ చెప్పినా...
రైతుల పట్ల ఇంత కఠినంగా, నిర్దయగా ప్రవర్తించిన ప్రభుత్వం మరొకటి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో భారత ప్రధాని మోడీ పార్లమెంట్ నిండు సభలో రైతులకు క్షమాపణలు చెప్పారు. ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ, ఆ తరువాత ఈ మూడేళ్లలో రైతులను ఉద్ధ రించే చర్య ఒక్కటంటే ఒక్కటి కూడా చేపట్టలేదు. ఏడాదికి మూడు విడతలుగా విదిల్చే రూ.6 వేల సహాయాన్నే గొప్ప ఘనకార్యంగా మోడీ పరివారం చెప్పుకుంటోంది. ఇలాంటి అరకొర విదిలింపులతో దేశ వ్యవసాయ రంగానికి ఒరిగేది ఏమీ ఉండదు. రైతు సమస్యలపై అధ్యయనం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కనీస మద్దతు ధరకు గ్యారంటీ, రుణమాఫీ, పీఎం కిసాన్ నిధుల రెట్టింపు, బడ్జెట్‌లో వ్యవసాయరంగ వాటా పెంపు వంటి ప్రతిపాదనలు ఆ కమిటీ చేసింది. మోదీ ప్రభుత్వం తాను చెప్పుకుంటున్నట్టు రైతులకు ఇప్పటికే చాలా మేళ్లు చేసి ఉంటే- కొత్తగా ఈ ప్రతిపాదనలు ఎందుకు?
కంటితుడుపు చర్యలను నమ్మేదెలా?
రైతాంగం పట్ల కత్తి కట్టినట్టు వ్యవహరించే ధోరణికి బీజేపీ ప్రభుత్వం ఇకనైనా స్వస్తి పలకాలి. రైతుల న్యాయమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలి. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ఉదారవాద ఆర్థిక విధానాలను విడనాడాలి. రైతు నిశ్చింతగా ఉండటానికి, వ్యవసాయరంగం పచ్చగా నిలబడడానికి డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. ఆయనకు అవార్డులు ఇవ్వడం, వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు పేర్లు పెట్టడం, శిలా విగ్రహాలు పెట్టడం, జయంతులు, వర్ధంతులు జరపడం ఆ రోజుల్లో ఆ శిలా విగ్రహాలకు పూల దండలు వేసి సరిపుచ్చితే లాభం లేదు. వారి మాటలకు ... ఇచ్చిన సూచనలకు...సలహాలకు విలువ ఇవ్వాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. లేకపోతే ఇవ్వన్నీ నాటకాలుగా, కంటి తుడుపు చర్యలుగా ప్రజలు భావిస్తారు. వారికి సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. మన నేతలు ఒంటెద్దు పోకడలు పోతే ప్రజల డిమాండ్లు గుర్తించకపోతే... మన ఇరుగుపొరుగు నేతలకు ఏం జరిగిందో.. చరిత్రను కళ్లారా చూసి కూడా గ్రహించి గుణపాఠాలు నేర్వకపోతే కాలమే పరిష్కారం చూపుతుంది.
- డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్,
98493 28496