టీడీపీ వర్తమానానికి గ్యారెంటీ ఉందా?

Do people believe TDP Manifesto's 'Bhavishyatku Guarantee'?

Update: 2023-07-18 00:45 GMT
టీడీపీ వర్తమానానికి గ్యారెంటీ ఉందా?
  • whatsapp icon

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ముందుగా ప్రజలతో స్నేహం చేయాలి. ప్రజలతో తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. ప్రజల కష్టనష్టాలే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి, వారి కష్టాలేంటో తెలుసుకోవాలి. వారి కష్టాల్ని ఎలా తీర్చగలరో వివరించాలి. కష్టపెడుతున్న అధికార పార్టీని గద్దె దించడానికి ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్మించాలి. ప్రత్యర్థి శిబిరంలో ఉన్నవారిని సైతం తమ వైపు తిప్పుకోవాలి. ఇలా ప్రతిపక్షం తన బాధ్యతను నూరు శాతం నిర్వర్తిస్తేనే, తర్వాతి కాలంలో అధికారంలోకి రావడానికి దారులు ఏర్పడతాయి. కానీ, నాలుగేళ్లు గడిచినా టీడీపీ తన బాధ్యతను గుర్తించడంలో, అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను తన ఖాతాలో వేసుకోవడంలో విఫలమవుతూ వస్తున్నది. రోజుకు మూడు ప్రెస్‌ మీట్లు, ఆరు సోషల్‌ మీడియా పోస్టులు, గంటలకొద్దీ వీడియో, టెలికాన్ఫరెన్స్‌లలో కాలం వెళ్లబుచ్చుతూ.. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చామని టీడీపీ నేతలు, కార్యకర్తలు పగటి కలలు కంటూ చంకలు గుద్దుకుంటున్నది.

వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీడీపీకి అంత సీన్‌ లేదు. టీడీపీకి ప్రజలకు మధ్య దూరం పెరిగిపోతోంది. దానికి నిదర్శనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడమే. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పరిశీలిస్తున్నప్పుడు, పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యవసరాల వస్తువుల ధరలు, పెరిగిన కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, మద్యం ధరలు, చెత్తపన్ను, నిరుద్యోగం గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. వీటిపట్ల అధికార వైఎస్‌ఆర్‌సీపీ‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు ఈ విధంగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నాయకులు మాత్రం ఈ ప్రధాన సమస్యలను గాలికొదిలేసి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను, వైఎస్‌ఆర్‌సీపీని తిట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ప్రజల ఆకాంక్షలకు దూరంగా వారు వ్యవహరిస్తూ దూరమవుతున్నారు.

వచ్చేవి ‘క్లాస్‌ వార్‌’ ఎన్నికలు!

టీడీపీ నేతలు చంద్రబాబు నుండి గ్రామస్థాయి వరకు సోషల్‌ మీడియాలో, ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తే అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు 70 శాతం ప్రజలు మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ 70 శాతం మంది ప్రజల వద్దకు టీడీపీ ఎలా చేరాలో ఆలోచించకుండా, ఎల్లో మీడియాను, సోషల్‌ మీడియాను నమ్ముకున్న టీడీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు.. 2024లో మరోసారి ఎన్నికల బరిలో భంగపడడానికి సిద్ధపడుతున్నారు.

2019 ఎన్నికలు ‘క్యాస్ట్‌ వార్‌’ మీద నడిచాయి. ఆ ఎన్నికలు రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గ ఆధిపత్యాన్ని దించడమే లక్ష్యంగా సాగాయి. దీనికి రాష్ట్రంలోని అన్నీ సామాజికవర్గాలు వైఎస్‌ఆర్‌సీపీ వెంట నడిచాయి. కానీ టీడీపీ నాయకత్వం 2019 ఓటమి తరువాత అయినా గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పటికి వారి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ, టీడీపీకి వెన్నుముక అయిన బీసీలు, ఎస్సీ, ఎస్టీ నాయకులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చివేశారు.

2024లో జరిగే ఎన్నికలు ‘క్లాస్ వార్’పై జరిగేలా సీఎం జగన్‌ ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఆయన మాటలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ వైసీపీ ఉచ్చులో చిక్కుకుంటుంది టీడీపీ. తమ పాలనలో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తామని టీడీపీ నాయకులు ఎక్కడా చెప్పడం లేదు. పైగా సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్.. నిత్యావసర ధరలు ఎలా పెంచారో, ప్రజల నుంచి పన్నుల రూపంలో ఎంత లాక్కుంటున్నారో వివరించి చెప్పడంలో విఫలమవుతుంది టీడీపీ. అలాగే చంద్రబాబుపై సంస్కరణలకు ఆద్యుడు తప్పా, సంక్షేమానికి వ్యతిరేకి అనే ముద్ర ఉంది. ఈ ముద్రను చెరిపేసుకోకపోతే క్లాస్ వార్‌లో టీడీపీ ఖతమవ్వడం ఖాయం!

ప్రజల్లోకి తీసుకపోవడంలో విఫలం!

ఇటీవల టీడీపీ మహానాడులో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట’ మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో 5 గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. కానీ అవి ప్రకటించి రెండు నెలలు దాటినా, ప్రజల్లో ఈ పథకాల గురించి చర్చ లేదు. దీనిపై ఇటీవల మీడియాతో చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేయడం దేనికి నిదర్శనం. ఈ పథకాలు ప్రచారం చేయడం కోసం టీడీపీ నేతలు బస్సు యాత్రలు నిర్వహించినా.. వారు పథకాలు ప్రచారం చేయకుండా, జగన్‌ని, వైసీపీని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ వారి ప్రసంగాల్లో ఈ పథకాలను ప్రచారం చేస్తున్నా, టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఒక్కశాతం కేటాయిస్తున్నారు. ఇప్పటికైనా వారు మారి ‘భవిష్యత్తు గ్యారంటి’లోని అంశాలకు ప్రాధాన్యత ఇస్తే, వారికి వర్తమానంలో భవిష్యత్తు ఉంటుంది. లేనిపక్షంలో మరోసారి భంగపాటు తప్పదు. ఇటీవల లోకేశ్ సైతం రాయలసీమలో పాదయాత్ర చేస్తూ అక్కడి సమస్యలపై స్థానికంగా హామీలు ఇస్తే బాగుండేది. కానీ అక్కడ పాదయాత్ర అయ్యాక మిషన్ రాయలసీమ ప్రకటించి ఆ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ హబ్‌‌గా, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పండ్ల తోటలను ప్రోత్సహిస్తామని వరాలు ఇచ్చారు. ఇది ఆ ప్రాంతం వారికి ఎలా తెలిసేది?

2019 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించిన నవరత్నాలు జనంలోకి చొచ్చుకుపోయాయి. ప్రజలు ఆ పథకాలపట్ల ఆకర్షితులయ్యి..వాటిని అమలు చేస్తుందని నమ్మారు. మరి టీడీపీ ప్రకటించిన 5 గ్యారెంటీలు, మిషన్‌ రాయలసీమ వంటి అంశాలను ఎందుకు నమ్మడం లేదు? ప్రజల్లో ఈ అంశాలపై ఎందుకు చర్చలేదు? 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ క్యాడర్‌ విఫలమైందా అని విశ్లేషించుకోకుండానే దసరాకు ఇంకో మేనిఫెస్టో ప్రకటిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. టీడీపీకి వర్తమానంలోనే గ్యారెంటీ లేని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గ్యారెంటీ గురించి కలలు కనడం హస్యాస్పదం కాదా?

అండగా లేనివారా.. భవిష్యత్తుకు భరోసా

ఈ నాలుగేళ్ల 3 నెలల కాలంలో టీడీపీలో గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు జగన్‌‌ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సైకో పోవాలి, సైకిల్‌ రావాలి... ఇదే గోల! ఈ నాలుగేళ్లలో సోషల్‌ మీడియాలలో పెట్టిన పోస్టుల సంఖ్యకు సమానమైన సంఖ్యలో కూడా టీడీపీ నాయకులు ప్రజలను కలవలేదు. గంటల తరబడి చంద్రబాబు నిర్వహించే టెలికాన్ఫరెన్సులకు కేటాయించినంత సమయాన్ని కూడా టీడీపీ నాయకులు ప్రజలకోసం కేటాయించలేదు. మొత్తం 175 ప్రతీ నియోజకవర్గాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 నుంచి 300 పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయి. గడిచిన 1400 రోజుల్లో సరిగ్గా ఒక్క గ్రామానికైనా వెళ్లి ప్రజలతో మాట్లాడిన నాయకులు టీడీపీలో ఎంతమంది ఉన్నారు? ఎంతసేపూ మీడియా, సోషల్‌ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లో, గతంలో మంత్రులుగా చేసినవాళ్లో మాట్లాడితే విలువ ఉంటుంది. గ్రామసర్పంచ్‌గా, కనీసం వార్డుమెంబర్‌గా గెలవలేని వాళ్లు మీడియా సమావేశాల ద్వారా నీతులు చెప్పడాన్ని టీడీపీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ప్రజలెలా వీళ్లను ఆమోదిస్తారు?

అలాగే, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ ఏ క్యాంపెయిన్‌ చేసినా చంద్రబాబునాయుడు, లోకేశ్‌ మాత్రమే చేస్తున్నారు. వీరిద్దరి స్ఫూర్తి ఇతర నాయకుల్లో కనిపించడం లేదు. వీళ్లిద్దరు కష్టపడితే వచ్చే ఫలితాన్ని అనుభవించాలని తపిస్తున్న నాయకులే ఎక్కువమంది ఉండటమే దీనికి కారణం. అందుకే, టీడీపీ సిద్ధాంతాలు, ప్రణాళికలు ప్రజల్లోకి చేరడం లేదు. 2019లో పార్టీ ఓడగానే, చాలామంది టీడీపీ నాయకులు ఇతర పార్టీలకు వలస వెళ్లారు. ఇంకొంతమంది క్షేత్రస్థాయిలో తిరగకుండా హైదరాబాద్‌ క్లబ్బుల్లో కాలక్షేపం చేస్తున్నారు. ‘మీ నియోజకవర్గంలో ఎందుకు తిరగడం లేద’ని అడిగితే, ‘పోలీసు కేసులు బ్రదర్‌’ అని సర్ది చెప్పుకుంటున్నారు. కేసులకు భయపడే ఇలాంటి వాళ్లా... టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యకర్తలకు అండగా నిలబడని ఇలాంటి వాళ్లా... టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ!

నోటికి తాళాలు వేసుకొని..

సాధారణంగా ప్రతిపక్షాలు ప్రజలలో ఉండేలా ప్రణాళికలు రచిస్తాయి. కానీ ఏపీలో మాత్రం అధికార పార్టీ ‘గడప గడపకు వైసీపీ’ అని ప్రజల దగ్గరకు వెళ్తుంటే, టీడీపీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం ఎల్లో మీడియాను, సోషల్‌ మీడియాను నమ్ముకుంటూ, టీడీపీ ఆఫీసుల్లో ఉన్నవాళ్లు ఇస్తున్న దొంగ రిపోర్టులను నమ్ముతూ అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నది.

లోకేశ్‌ మొదట్లో పాజిటివ్‌ ఎజెండాతో ముందుకు సాగినా, ఇప్పుడు ఆయన కూడా గాడి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇతర నాయకులతో పోలిస్తే, జగన్‌ వైఫల్యాలను వివరించడంలో లోకేశే ముందున్నారు. కానీ, కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే అధికారాన్ని తీసుకురాదు. కాబట్టి, ఇప్పటికైనా టీడీపీ నాయకులు నోటికి తాళాలు వేసుకొని పాజిటివ్‌ ఎజెండా ప్రచారం చేయాలి. వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలవాలి. మీడియాను, సోషల్‌ మీడియాను పక్కనపెట్టి, వానరసేన రామ సేతు నిర్మించినట్టుగా చిన్న, పెద్ద నాయకులంతా ప్రజల్లో తిరగాలి. గ్రామ గ్రామాన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి పథకాలను, ప్రణాళికలను ప్రజలకు వివరించాలి. ఇంటింటి ప్రచారం నిర్వహించాలి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా, సంక్షేమాన్ని సంరక్షిస్తూనే, అభివృద్ధి ఎలా చెయ్యగలరో చెప్పాలి. ఇలా ప్రజల మనసు గెలుచుకుంటేనే, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కడతారు. లేదంటే మరో ఘోరపరాజయం తప్పదు.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

peoplespulse.hyd@gmail.com

Tags:    

Similar News