కళాత్మక సజీవ చిత్రణ ‘మూన్ లైట్’

‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’ అన్న కవితాత్మక వాక్యం ‘మూన్ లైట్’ సినిమాకి ఊపిరి.

Update: 2023-04-14 19:00 GMT

‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’ అన్న కవితాత్మక వాక్యం ‘మూన్ లైట్’ సినిమాకి ఊపిరి. వర్తమాన సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఉద్వేగభరిత స్థితికి ఈ సినిమా అద్దం పడుతుంది. యువత అంటే అదీ అమెరికాలోని నల్ల జాతి యువత ఎదుర్కొంటున్న శారీరక, లింగత్వ సమస్యలూ, స్వలింగ సమస్యలూ, ఒంటరితనాలూ అవమానాలూ అన్నీ మూన్ లైట్‍లో చాలా గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా ఇటీవలే ఉత్తమ సినిమాగా ఆస్కార్ అవార్ద్ అందుకుంది. ఆస్కార్ చరిత్రలో మొత్తం నల్ల జాతి నటీనటులు నటించిన చిత్రం ఉత్తమ చిత్రం అవార్డు అందుకోవడం ఇది మొదటిసారి. అంతే కాదు స్వలింగ సంపర్కాన్ని ఇతివృత్తంగా తీసుకుని అతి తక్కువ బాక్స్ ఆఫీస్ వసూళ్లు సాధించి కూడా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డును అందుకున్న తొలి చిత్రంగా 'మూన్ లైట్' చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఎడిటింగ్‌లో అవార్డ్ గెలుచుకుని జోయ్ మాక్ మిల్లన్ మొదటి నల్ల జాతి కళాకారుడిగానూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా అవార్డును అందుకుని అలీ మొదటి ముస్లింగా చరిత్ర కెక్కారు. అవార్డుల సంగతి ఎలా వున్నా మూన్‌లైట్ సినిమా ఇతివృత్త స్వీకరణ లోనూ, చిత్రీకరణలోనూ, నటీ నటుల నటన పరంగానూ అద్భుతమయిన స్థాయిని అందుకుని గొప్ప సినిమాగా నిలిచింది. ఈ సినిమా నిండా జ్ఞాపకాలూ, వాస్తవాలూ, ఒక దాని వెంట ఒకటి ముప్పిరి గొని ప్రేక్షకుల్ని చిత్రమయిన స్థితికి తీసుకెళ్తాయి.

టారేల్ ఆల్విన్ మాక్ కాన్రే రాసిన ఆత్మకథను దర్శకుడు బ్యారి జెంకిన్స్ అనుసరించి మూన్ లైట్ నిర్మించాడు. ఆ ఆత్మ కథ పేరే ‘చంద్రుడి కాంతిలో నల్ల జాతి పిల్లలు నీలంగా కనిపిస్తారు’. ఆ ఇతివృత్తాన్ని మూడు విభాగాలుగా చిత్రంలో చూపిస్తాడు దర్శకుడు. లిటిల్, చిరాన్, బ్లాక్‌లు మూడూ ఒకదానికొకటి విడిగానూ, కలిసిపోయినట్టుగానూ, కొనసాగింపుగానూ కనిపిస్తాయి. లిటిల్ బాల్యాన్ని చూపిస్తే, చిరాన్ టీన్ ఏజ్ స్థితిని, బ్లాక్ ఎదిగిన స్థితినీ చూపిస్తాయి. ఈ మూడు స్థాయిల్లో నల్ల జాతీయుడి గానూ, గే గానూ ఆ యువకుడు ఎదుర్కొన్న సంఘటనల్నీ, సమస్యల్నీ అత్యంత వాస్తవికంగానూ, హృద్యంగానూ దర్శకుడు చిత్రీకరించాడు. మూడు స్థాయిల్లో ముగ్గురు నటులతో నటింపజేసి వాటి మధ్య ఒక సంలీనత సాధించారు.

చిత్ర కథ విషయానికి వస్తే లిటిల్ మియామిలో డ్రగ్ డీలర్ జువాన్కు చిరాన్ దొరుకుతాడు. జువాన్ భార్యతో కాకుండా తన ప్రియురాలితో వుంటాడు. చిరాన్‌ని తనతోనే వుండమంటాడు. చిరాన్ తల్లి పవులా డ్రగ్‌కు బానిస్ అవుతుంది. తన తల్లి పావులాను చిరాన్ ఏవగించుకుంటాడు.చిరాన్‌కు రక రకాల కలలు వస్తాయి. ఇంతలో మిత్రులతో గొడవ పడతాడు. వాళ్ళు బ్లాక్ అనే నిక్ నేమ్ పెడతారు. ఇంతలో తనలో కలుగుతున్న మార్పులు గమనిస్తాడు. ఒక రోజు మిత్రుడు కెవిన్ సముద్రపు ఒడ్డున అతన్ని సంతృప్తి పరుస్తాడు. ఇలా పలు సంఘటనల తర్వాత కిరాన్ ఒక రోజు తన పైన శారీరకంగా దాడి చేసిన వాడిని కోపంతో కుర్చీతో బాదేస్తాడు. పోలీసులొచ్చి అరెస్ట్ చేసి జైల్‌కు పంపిస్తారు. జైలు జీవితం గడిపిన చిరాన్ శారీరకంగా ఎదిగి మంచి ధృఢమయిన శరీరాకృతితో బ్లాక్‌గా బయటకు వస్తాడు. డ్రగ్స్‌కు బానిస అయిన తల్లి అనేక టెలిఫోన్ కాల్స్ చేసింతర్వాత కలవడానికి వెళ్తాడు. తల్లి పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను క్షమిస్తాడు.

మియామికి చేరుకున్న బ్లాక్ తన పాత మిత్రుడు కెవిన్‌ను కలుస్తాడు. కుక్ గాను, బేరర్ గాను పనిచేస్తున్న కెవిన్ తనకు పెళ్ళయి ఒక కొడుకున్నాడని కానీ భార్యతో పొసగ లేదని చెబుతాడు. తాను కోరుకున్నట్టుగా జీవితం కొనసాగకున్నా సంతోషంగానే వున్నట్టు చెబుతాడు.

ఆ రోజు సముద్ర తీరంలో కెవిన్‌తో తప్ప తాను ఇంతవరకు మరెవరితోనూ ఇంటిమేట్‌గా వుండలేదంటాడు బ్లాక్. కెవిన్ బ్లాక్‌ని ఓదారుస్తాడు. సముద్ర తీరంలో తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ బ్లాక్ కెమెరాకు అభిముఖంగా తిరిగి చూస్తుండగా సినిమా ముగుస్తుంది. టూకీగా కథ ఇట్లున్నప్పటికీ లిటిల్, చిరాన్, బ్లాక్ మూడు వయసుల్లో భిన్న స్థాయిలో అతడు ఎదుర్కొన్న మానసిక, శారీరక సంఘర్షణ అతలాకుతలం చేస్తుంది. మానవీయ ఉద్వేగాలకీ, అనుభవాలకూ, సంఘర్షణలకూ దృశ్య రూపమిస్తుందీ సినిమా. జేమ్స్ లాక్స్‌టన్ (james laxton) కెమెరా పనితనం ఆద్యంతం కట్టి పడేస్తుంది.

‘ నేను ఎన్నోసార్లు ఏడిశాను, మరెన్నోసార్లు కన్నీటి చుక్కలయి రాలాను’ లాంటి సంభాషణలతో కొన్ని చోట్ల మాటలు ఉద్వేగానికి గురిచేస్తాయి.

ఎలాంటి స్టార్ వాల్యూ, గ్రాఫిక్స్, మిరుమిట్లు గొలిపే దృశ్యాలు ఏవీ లేని మూన్ లైట్ కేవలం ఒక జాతి యువకుడు బాల్యం నుంచీ ఎదుర్కొన్న ఒంటరితనాన్నీ, అణచివేతనీ, దుఖాన్నీ అత్యంత వాస్తవికంగా, కళాత్మకంగా ఆయా స్థలకాలాల నేపథ్యంలో దర్శకుడు తీసి నిలబెట్టాడు. కనుకే అందరూ నల్లవాళ్లయినా, నల్లవాళ్ళ కథ అయినప్పటికీ విషయానికి విశ్వజనీనత, చిత్రీకరణకి కళాత్మకత, నటులకు సాధికారకత వున్నప్పుడు ఆస్కార్‌కు నామినేట్ అవడమే కాదు.. అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ బార్రి జెంకిన్స్


-వారాల ఆనంద్

94405 ౦౧౨౮౧


ఇవి కూడా చదవండి:

తెలంగాణ తొలి ప్రయోగాత్మక చిత్రం 'ప్రత్యూష'  

Tags:    

Similar News