విద్యారంగానికి నిధులు పెంచాలి!
తెలంగాణ రాష్ట్రంలో 90% మంది విద్యార్థులు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే, వారందరూ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్,

తెలంగాణ రాష్ట్రంలో 90% మంది విద్యార్థులు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే, వారందరూ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో పేద వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం ఈ నిధులని విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ముందుగానే విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారు, కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారు.
ఇక రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో స్వీయ ఆర్థిక స్వావలంబన పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచి విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు. పోనీ ఇంత ఫీజులు వసూలు చేసినా యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీని నియమించలేదు. రాష్ట్ర పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2878 టీచింగ్ పోస్టులకు గానూ కేవలం 753 మంది మాత్రమే టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. అంటే 70% ఖాళీలతో కాలం వెళ్లదీస్తున్నాయి. ఇక యువ వికాసం పేరుతో 5 లక్షల రూపాయల కార్డులను యువతకు జారీ చేస్తామని, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అందుకే ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించడంతో పాటుగా, పెండింగ్‌లో ఉన్న ఫీజ్ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, విద్యారంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, యూనివర్సిటీలకు బ్లాక్ గ్రాంట్‌ను వాటి బడ్జెట్ మేరకు పెంచాలి. లేకపోతే విద్యార్థి, నిరుద్యోగ సమాజం ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించబోదు.
అక్యారి మహేష్
ఏబీవీపీ వర్కింగ్ కమిటీ మెంబర్
99126 37059