ఆ గ్రామంలో మహిళ దెయ్యం.. సాయంత్రం 6 అయ్యిందంటే ఇక అంతే..
ఆ.. ఊరిలో దెయ్యం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరిని వదిలి పెట్టడంలేదు.
దిశ, అమరచింత: ఆ.. ఊరిలో దెయ్యం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరిని వదిలి పెట్టడంలేదు. ఒకరి తర్వాత మరొకరిని పట్టి పీడిస్తుంది. దెయ్యం అవహించడంతో చేతిలో తాడు పట్టుకుని ఉరి వేసుకునేందుకు కొందరు మహిళలు ఇంటినుంచి పరుగులు పెట్టడం చూసి స్థానికులు బిక్కు, బిక్కు మంటూ.. భయం గుప్పిట్లో రోజులు వెల్లదీస్తున్నారు. ఇవన్నీ ఓ గ్రామంలో నిజంగా జరుగుతోన్న సంఘటనలు. వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని ధర్మపూర్ గ్రామంలో వెయ్యి మంది జనాభా ఉంది. గత నాలుగు నెలల్లో ఇప్పటి వరకు 12మంది మృతి చెందారు. అయితే, జూన్ 22 నుంచి 28వరకు కేవలం 6 రోజుల వ్యవధిలోనే వరుసగా 4మృతి చెందారు. ఈ నెల 3, 5 తేదీల్లో మరో ఇద్దరు వివిధ కారణాలతో మరణించారు.
అయితే, ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన ఓ మహిళ దెయ్యం అయ్యిందని.. అందరిని భయాందోళనకు గురి చేస్తుందని, వ్యవసాయ పనికి ఇతర గ్రామాలకు ఆటోలో వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ ఆ దెయ్యం వేధిస్తోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత 3రోజులుగా వారు పనులు మానేసి, దెయ్యం ఎవరిని అవహిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఎక్కడికి వెళ్లినా సాయంత్రం 6గంటల సమయానికి ఇండ్లకు చేరుకుని, బయటకు వెళ్లడం లేదు. ప్రతి రోజు మహిళలు వ్యవసాయ పనులకు ఇతర గ్రామాలకు వెళ్లే క్రమంలో వారితో పాటు ఓ మహిళ పనులకు వచ్చేదని, గత నెల 26న మరణించిన సదరు మహిళే అందరిని ఆవహించి ఇబ్బందులకు గురి చేస్తుందని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై గ్రామంలో పంచాయతీ జరిగి, పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వచ్చింది. మృతి చెందిన సదరు మహిళ కుటుంబీకులు, వ్యవసాయ పనికి వెళ్లే ఆటో యజమాని పోలీసులను ఆశ్రయించారు. ఆ గ్రామంలో మొదలైన భయాన్ని తొలగించేందుకు ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది.