WhatsApp Chat : యువకుడిపై రేప్ కేసు కొట్టివేత.. వాట్సాప్ ఛాట్‌లో దొరికిపోయిన యువతి
దిశ, నేషనల్ బ్యూరో : ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును ఢిల్లీలోని ఒక కోర్టు(Delhi court) కొట్టివేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును ఢిల్లీలోని ఒక కోర్టు(Delhi court) కొట్టివేసింది. అతడు నిర్దోషి అని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. సదరు యువకుడు, ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో కలిసి తిరిగేవారు. ఒకవేళ దూరం ఉన్నా.. వాట్సాప్‌లో ఛాట్ చేస్తూ టచ్‌లో ఉండేవారు. ఈక్రమంలో ఒకరోజు సదరు యువకుడు తన కారులో యువతితో సన్నిహితంగా మెలిగాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య వాట్సాప్ ఛాట్(WhatsApp chat) కొనసాగింది. ఇది జరిగిన ఐదు నెలల తర్వాత సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ‘‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాతో కారులో సంభోగించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు’’ అని యువకుడిపై ఫిర్యాదు చేసింది.
ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు.. యువతి చేసిన ఆరోపణలతో విభేదించింది. జనం రద్దీ ఉండే రోడ్డుపై నిలిపి ఉన్న కారులో సంభోగించడం సాధ్యమయ్యే విషయం కాదని కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ రేప్ జరిగి ఉంటే.. ఆలస్యంగా ఐదు నెలల తర్వాత కంప్లయింట్ ఇవ్వరని బెంచ్ అభిప్రాయపడింది. ‘‘రేప్ ఘటన జరిగిన వెంటనే యువకుడితో యువతి వాట్సాప్ ఛాట్ చేస్తూ.. ‘‘ఏమీ ఆలోచించకు’’ అని చెప్పింది. రేప్ నిజంగా జరిగి ఉంటే.. ఏ బాధిత మహిళ కూడా అలాంటి మెసేజ్‌లు పెట్టదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘సదరు యువకుడు, యువతి మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం నడిచేది. అయితే పెళ్లి చేసుకోవాలనే షరతు ఎక్కడా లేదు. పెళ్లి చేసుకునేలా అతడిని ఒప్పించే దురుద్దేశంతోనే యువతి కేసు పెట్టింది’’ అని యువకుడి తరఫు న్యాయవాది శశాంక్ దివాన్ కోర్టుకు తెలిపారు. ఈమేరకు వాదనలు విన్న కోర్టు సదరు యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది.