Palaniswami : పరువు నష్టం కేసు గెల్చిన పళనిస్వామి.. రూ.1.10 కోట్లు పరిహారం
దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత చెన్నై నివాసంలో కారు డ్రైవర్గా పనిచేసిన సి.కనకరాజ్ 2017 ఏప్రిల్ 28న అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత చెన్నై నివాసంలో కారు డ్రైవర్గా పనిచేసిన సి.కనకరాజ్ 2017 ఏప్రిల్ 28న అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సి.కనకరాజ్ మరణం అనంతరం అతడి సోదరుడు సి.ధనపాల్ సంచలన ఆరోపణలు చేశాడు. 2017 ఏప్రిల్ 23న నీలగిరిస్ జిల్లా కొడనాడ్ పట్టణంలో ఉన్న 906 ఎకరాల జయలలిత ఎస్టేట్లో జరిగిన దొంగతనంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రెటరీ ఎడప్పాడి పళనిస్వామికి సంబంధం ఉందని అప్పట్లో పలుమార్లు సి.ధనపాల్ ఆరోపించాడు. దీంతో తన పరువుకు నష్టం వాటిల్లిందని, రాజకీయ ప్రతిష్ఠ మసకబారిందని పేర్కొంటూ ఎడప్పాడి పళనిస్వామి(Palaniswami) కోర్టును(defamation case) ఆశ్రయించారు. ఎట్టకేలకు ఇప్పుడు దీనిపై మద్రాస్ హైకోర్టు(Madras High Court) తీర్పును వెలువరించింది. నిరాధార ఆరోపణలతో పళనిస్వామి ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు నష్ట పరిహారంగా ఆయనకు రూ.1.10 కోట్లను చెల్లించాలని హైకోర్టు బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ధనపాల్కు వార్నింగ్ ఇచ్చింది.
2017లో ఏం జరిగింది ?
2017 ఏప్రిల్ 23న కొడనాడ్ పట్టణంలో ఉన్న జయలలిత ఎస్టేట్లో దొంగలు పడ్డారు. దానికి బందోబస్తుగా ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను దొంగలు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఎస్టేట్లోని జయలలిత నివాసంలో చోరీకి పాల్పడ్డారు. కేరళకు చెందిన పది మంది దుండగులతో కలిసి జయలలిత కారు డ్రైవర్ సి.కనకరాజ్ ఈ దొంగతనం చేశాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అయితే ఇంట్లో వారికి డబ్బు లభించలేదని తేల్చారు. ఈ దొంగతనం చేసిన ఐదు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో సి.కనకరాజ్ చనిపోయాడు.