నాలుగు గంటల పాటు సంపత్ మృత దేహానికి పోస్టు మార్టం..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మృతి చెందిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన యువకుడు అలకుంట సంపత్ (32) మృత దేహానికి నిజామాబాద్ జీజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మృతి చెందిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన యువకుడు అలకుంట సంపత్ (32) మృత దేహానికి నిజామాబాద్ జీజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి సమక్షంలో పోస్టు మార్టం నాలుగు గంటల పాటు నిర్వహించారు. పోస్టుమార్టం జరిగే సమయంలో జడ్జితో పాటు మృతుడి భార్య, తల్లి, తమ్ముడు కూడా ఉన్నారని సమాచారం.
సైబర్ క్రైమ్ పోలీసుల పై మృతుడి భార్య ఫిర్యాదు..
సైబర్ క్రైం పోలీసుల పై మృతుడు ఆలకుంట సంపత్ భార్య ఆలకుంట సంధ్య నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులే తన భర్తను దారుణంగా కొట్టి చిత్ర హింసలు పెట్టి చంపారంటూ మృతుడి భార్య సంధ్య సైబర్ క్రైం పోలీసుల పై నేరుగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన అంబులెన్స్ లో పోస్టుమార్టం నిర్వహించిన సంపత్ మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి తీసుకువెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని బహుజన లెఫ్ట్ పార్టీ ( బహుజన కమ్యూనిస్టు) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఉండి పోస్ట్ మార్టం పూర్తయి, మృతదేహాన్ని వారి స్వగ్రామానికి అంబులెన్సులో తరలించే వరకు వారితో పాటే ఉన్నారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ సంపత్ మృతి దారుణమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్రంలోని వడ్డెర బిసి ఎ ప్రజలతోపాటు ఇతర బీసీ కులాల ప్రజల పై కూడా ఉందన్నారు.