ఖజానాపై కరోనా కొరడా

దిశ, న్యూస్‌బ్యూరో: ఇప్పటికే మాంద్యం కోరల్లో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తాజాగా కరోనా రూపంలో మరోదెబ్బ తగిలినట్లైంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 31 దాకా సెలవులు, బార్లు, పబ్బులు, మాల్స్, థియేటర్లు మూసివేయడం, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనువతివ్వకపోవడం లాంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. ఓ పక్క ప్రభుత్వం ఇలాంటి చర్యలు […]

Update: 2020-03-17 07:02 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఇప్పటికే మాంద్యం కోరల్లో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తాజాగా కరోనా రూపంలో మరోదెబ్బ తగిలినట్లైంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 31 దాకా సెలవులు, బార్లు, పబ్బులు, మాల్స్, థియేటర్లు మూసివేయడం, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనువతివ్వకపోవడం లాంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. ఓ పక్క ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంటే హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ ఉద్యోగులకు కరోనా సోకకుండా వాటి జాగ్రత్తలు అవి తీసుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఉద్యోగుల విదేశీ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకొని బయటకు వెళ్లడం లేదు. ఇక నెల క్రితం నుంచే మాంసాహారాన్ని ఎక్కువమంది ప్రజలు అవాయిడ్ చేస్తున్నారు. ఇవన్నీ కాక ఇప్పటికే నిర్ణయించుకున్న పెళ్లిల్లు కూడా 200 మంది అతిథులకు మించకుండా జరుపుకోవాలని, ఏప్రిల్ 1 నుంచి ఎవరూ పెళ్లి తేదీలు నిర్ణయించుకోవద్దని, ఫంక్షన్ హాళ్లు ఎవరూ బుకింగ్‌కు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవేనని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సాధారణస్థితిలో ఉండి ప్రజల రోజు వారి కార్యకలాపాలు మామూలుగా సాగితేనే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. కరోనా వ్యాప్తి భయంతో ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆంక్షల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో ప్రజల రోజువారీ యాక్టివిటీ ప్రభావితం కానుంది. దీంతో వారు సాధారణంగా చేసే కొనుగోళ్లు తగ్గనున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎకనమిక్ యాక్టివిటీ తగ్గనుంది. ఇది నెమ్మదిగా రాష్ట్ర ఖజానాకు రోజువారీగా వచ్చి పడే ఆదాయాన్ని ఎంతోకొంత తగ్గిస్తుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రోడ్ ట్యాక్స్, భూముల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీల ద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో రెగ్యులర్‌గా పన్నులు వసూలవుతాయి.

కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ‌పై ప్రభావం ఇలా..

– స్కూళ్లు, కాలేజీలు మూతపడడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పడిపోనుంది.
– చికెన్ తినడం మానేయడం వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితిలోకి ఇప్పటికే వెళ్లింది.
– హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వారు ఇళ్ల నుంచి బయటికి వచ్చి చేసే ఖర్చు తగ్గనుంది.
– రాష్ట్ర వ్యాప్తంగా మాల్స్, థియేటర్లు, బార్లు, పబ్బులు మూసివేయడం వల్ల చిరుద్యోగుల మీద ప్రభావం పడనుంది.
– వీరు రోజువారీగా ద్విచక్రవాహనాల మీద చేసే ప్రయాణాలు తగ్గడం వల్ల ఈ ప్రభావం పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై పడనుంది.
– రాష్ట్రవ్యాప్తంగా బార్లు, పబ్బులు మూసేయడం వల్ల ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గనుంది.
– కరోనా వల్ల ప్రభావితమైన విమానయానం వల్ల కూడా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను తగ్గనుంది.
– రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఆదాయాల మీద ప్రభావం చూపడంతో రియల్ ఎస్టేట్ మీదా ఇప్పట్లో జనాలు ఆసక్తి చూపే పరిస్థితుండదు.
– ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లోకి వెళ్లడానికి ప్రజలు జంకుతుండడంతో పలు కొనుగోళ్లు నిలిచిపోయి ప్రభుత్వానికి జీఎస్టీ తగ్గనుంది.
– ఏప్రిల్ 1 నుంచి పెళ్లిళ్లు వద్దని ప్రభుత్వం చెప్పడంతో ఆ కోణంలో ఖర్చు తగ్గి ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడనుంది.

ఇవి పెరగొచ్చు…

– కరోనా భయంతో మాస్కులు, సబ్బులు, సానిటైజర్ల కొనుగోళ్లు మాత్రం పెరగుతున్నట్లు తెలుస్తోంది.
– వ్యాధి వ్యాప్తి ఎలా ఉంటుందో చూసి తర్వాతి నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఈ 15 రోజులు , ప్రభుత్వం, ప్రజలకు వచ్చే ఆదాయాల్లో కోతపడనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గితే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించి ఆ ప్రభావం మళ్లీ ప్రజలపైనే పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

tags : corona, ts economy, restrictions, govt income, decrease in consumption

Tags:    

Similar News