INDIA BLOC : విచ్ఛిన్నం దిశగా ఇండియా కూటమి? కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తప్పదా..!

బీజేపీ కూటమిని కేంద్రంలో అధికారం నుంచి దించాలని ఏర్పడిన ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోందా? కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మిత్ర పక్షాలు అసంతృప్తిగా ఉన్నాయా? అంటే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది.

Update: 2025-01-10 13:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ కూటమిని కేంద్రంలో అధికారం నుంచి దించాలని ఏర్పడిన ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోందా? కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మిత్ర పక్షాలు అసంతృప్తిగా ఉన్నాయా? అంటే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. ఎన్డీయే కూటమికి పోటీగా, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఇటీవల కాలంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వరకు అంతా కలిసి కట్టుగా ఉన్నట్లే కనపడింది. కానీ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయం తర్వాత.. మిత్ర పక్షాల్లో మార్పు వచ్చినట్లు కనపడుతోంది. ఇటీవల ఇండియా బ్లాక్ లోని పార్టీలన్నీ కాంగ్రెస్ టార్గెట్‌గానే వ్యాఖ్యలు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇండియా కూటమిగా ఏర్పడిన 37 పార్టీలన్నీ కలిసి బీజేపీ కూటమిని లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పని చేశాయి. అయితే ఇండియా కూటమి కారణంగా కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. గతంలో కోల్పోయిన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ తిరిగి తెచ్చుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొంతకాలం ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి కట్టుగానే కనిపించాయి.

దేశంలో కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానాల్లో ఓటమి తర్వాత ఇండియా కూటమి పార్టీల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. హర్యానా ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఇండియా కూటమి పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ విస్మరించిందని.. తాము అడిగిన ఐదు సీట్లు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆప్ ఆరోపించింది. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో తాము కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని కేజ్రివాల్ అప్పట్లోనే ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోయింది. ఇక కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఆర్జేడీ కూడా మాట మార్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన నినాదం అని, కేవలం ఆ నినాదానికే కూటమి పరిమితమైందని చెప్పుకొచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 70 సీట్లకే పరిమితం కాకుండా మొత్తం 243 సీట్లకు సిద్ధం కావాలని తేజస్వీ సూచించారు.

మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్, జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఏ సమావేశం జరగకపోవడం బాధగా ఉందన్నారు. అసలు కూటమికి ఇప్పుడు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? దీని అజెండా ఏంటి? కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై అసలు చర్చలే జరగడం లేదని చెప్పారు. ఇండియా కూటమిలో జాతీయ హోదా ఉన్న పార్టీలు కాంగ్రెస్, ఆప్, సీపీఎం మాత్రమే. ఈ మూడింటిలో కాంగ్రెస్‌కు మాత్రమే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధికారం ఉంది. అంతే కాకుండా బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది. సీపీఎం పార్టీ కేవలం కేరళకు మాత్రమే పరిమితం అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లో మరో ఇండియా కూటమి పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో బద్ద శత్రుత్వం ఉంది.

ఇండియా కూటమిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే. కానీ ఇండియా బ్లాక్‌లోని ప్రాంతీయ పార్టీలన్నీ కలసి కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు కాంగ్రెస్ అవసరమైంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి.. కాంగ్రెస్ పార్టీనే వారికి గుదిబండగా మారిందనే ఆలోచనలో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ధోరణి కూడా కారణమే అని వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలోని అన్ని పార్టీలకు సరైన అవకాశాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తిరిగి నమ్మకాన్ని పొందగలదని.. లేకపోతే ఇండియా కూటమి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News