ఎనీటైం లిక్కర్.. నో పోలీస్

దిశ, హుజురాబాద్: గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు అయ్యాయి. వైన్స్ షాపుల యజమానులంతా ఒక్కటై బెల్ట్ షాపు నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో మద్యం తాగేవారిపై అధిక భారం పడుతోంది. ఎక్సైజ్ అధికారులే తమకు అండగా ఉన్నారని వైన్స్ యజమానులు బహిరంగంగా చెప్తున్నారు. బెల్టు షాపుల్లో కొని తాగేవారు ఎక్కువగా మైనర్లే ఉన్నారని పలువురు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులే మా వాళ్లు ఎక్కడ ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని కొందరు బెల్టు షాపు నిర్వాహకులు […]

Update: 2020-12-18 20:42 GMT

దిశ, హుజురాబాద్: గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు అయ్యాయి. వైన్స్ షాపుల యజమానులంతా ఒక్కటై బెల్ట్ షాపు నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో మద్యం తాగేవారిపై అధిక భారం పడుతోంది. ఎక్సైజ్ అధికారులే తమకు అండగా ఉన్నారని వైన్స్ యజమానులు బహిరంగంగా చెప్తున్నారు.

బెల్టు షాపుల్లో కొని తాగేవారు ఎక్కువగా మైనర్లే ఉన్నారని పలువురు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులే మా వాళ్లు ఎక్కడ ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని కొందరు బెల్టు షాపు నిర్వాహకులు చెప్తున్నారు. హుజూరాబాద్ డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. పగలు, రాత్రి లేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు చేస్తూ యువతను మద్యానికి బానిసలు చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారినే మద్యం విక్రయించాలని నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ పట్టని బెల్టు షాపు యాజమానులు విక్రయాలు చేపడుతున్నారు. అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. గ్రామాల్లో వీరి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. బెల్ట్‌షాపుల నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది.

ఎనీటైం మద్యం..

గ్రామాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం దొరుకుతోంది. గ్రామాల్లో బెల్టు షాపుల్లో నిరంతరంగా మద్యం అమ్ముతూ ఏటీఎం మిషన్లుగా పని చేస్తున్నాయి. గ్రామాల్లో సిట్టింగ్‌లు పెట్టి మరీ మద్యం విక్రయాలు చేస్తున్నారు. అయినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. డివిజన్‌లో ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో బెల్టు షాపులు ఉన్నాయంటే వారి వ్యాపారం ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

అధిక ధరలకు..

వైన్‌షాపులు మండల కేంద్రాల్లోనే ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ప్రియులు బెల్టు షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వాటర్‌పై రూ.10 నుంచి 30 వరకు అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వైన్‌షాపుల్లో తమకు ఒక్కో క్వాటర్‌పై రూ.10 నుంచి 20 అదనంగా తీసుకుంటున్నారని, మరో పది రూపాయల లాభానికి అమ్ముకుంటున్నామని సమాధానం చెప్తున్నారు. అంతేకాకుండా వైన్ షాపు నిర్వాహకులు మద్యం బాటిళ్లకు స్టిక్కర్స్ ఏర్పాటు చేసి బెల్టు షాపుల నిర్వాహకులకు అమ్ముతున్నారు. అధికారులు, వైన్ షాపుల యాజమానులు బెల్టు షాపులపై తనిఖీలు చేసి స్టికర్స్ లేకపోతే జరిమానాలు సైతం విధించడం గమనార్హం.

జోరుగా కల్తీ మద్యం

గ్రామాల్లో బెల్టు షాపుల్లో కల్తీ మద్యం విక్రయాలు సైతం జోరుగానే సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి ఆ మద్యాన్ని కల్తీ చేసి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు మద్యంలో స్పిరిట్ కలిపి కల్తీ చేస్తూ ఒక్కో బాటిల్‌ను నాలుగు బాటిళ్లలో నింపుతున్నట్లు సమాచారం. కల్తీ మద్యం సేవించి అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకుల నుంచి నెలసరి మామూళ్లు తీసుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, బెల్టు షాపులను మూసివేయించాలని పలువురు మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News