బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మాజీ సీఎం తీరు
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినా గులాబీ అధినేత కేసీఆర్.. అప్పటి నుంచి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినా గులాబీ అధినేత కేసీఆర్.. అప్పటి నుంచి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. అక్కడి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు ఫాంహౌజ్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. అనుసరించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. కానీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగినా.. కేసీఆర్ మాత్రం కనబడలేదు. సభ తీరుపై ఒక్క ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. ప్రభుత్వానికీ సూచనలు చేయలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మీడియా ముందుకు రాలేదు. ఫాం హౌస్‌లో మాత్రం నేతలతో భేటీ, సూచనలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఫాం హౌజ్ వేదికగా కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఆయన అసలు ప్రజల పక్షాన మాట్లాడుతారా? కొట్లాడుతారా? అసలు ఆయన వ్యూహమేంటి? అని పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. కేసీఆర్ త్వరలో సభ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతారని ప్రచారం జరుగుతున్నా.. కానీ ఎప్పుడు అనేది మాత్రం పార్టీ అధినాయకత్వం క్లారిటీ ఇవ్వడం లేదు.
అసెంబ్లీలో కుటుంబ సభ్యుల గళమే!
ఏడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు రోజూకో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ‘అదానీతో సీఎం రేవంత్ ఫోటోలు’, నల్లచొక్కాలు, ఖాకీ చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు, పచ్చ కండువాలతో రోజుకో అంశంపై ప్లకార్డులు చూపుతూ సభకు హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, లగచర్ల రైతులకు బేడీలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, సభా ఉల్లంఘన నోటీసులు, వాయిదా తీర్మాన ప్రతిపాదనలు ఇచ్చారు. అయినప్పటికీ అసెంబ్లీ, మండలి లో ఈ ఏడు రోజుల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీశ్ రావు, కవిత ముగ్గురే మాట్లాడుతూ కనిపించారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు పోటీపడి ప్రభుత్వ వైఫల్యాలను చూపే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత మండలి లో గళం వినిపించారు. మిగతా వాళ్లకు సమయం కూడా ఇవ్వలేదని అసెంబ్లీ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్నప్పటికీ వారికి ప్రాధాన్యం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతున్నది.
ఒకరోజు మొత్తం కేటీఆర్ కేసులపైనే..
ఫార్ములా ఈరేస్ లో కేటీఆర్ పై ఏసీబీ తో పాటు, ఈడీ సైతం కేసు నమోదు చేసింది. అయితే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని, నిజనిజాలు ప్రజలకు తెలియజేయాలని ఈనెల 20న బీఆర్ఎస్ పట్టుబట్టింది. అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పేపర్లు చించి విసిరేసారు. ఆరోజూ సభలో భూభారతి బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ఈరేసు పై చర్చకు పట్టుబట్టడంతో అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తీవ్రంగా మండిపడ్డాయి. బీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ ఘటన పార్టీకి డ్యామేజ్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. ప్రజా సమస్యలపై స్పందించకుండా కేవలం ఫార్ములా ఈ రేస్ పైనే ఒక రోజంతా అసెంబ్లీలో నిరసన తెలియజేయడం, వాకౌట్ చేయడంపై పలువురు మండిపడుతున్నారు. పార్టీ నేతలపైనా కేడర్ సైతం గుస్సా గా ఉంది. ప్రజాసమస్యలను సైతం ఆశించిన మేర అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు తమ గళం వినిపించలేదనే ప్రచారం జరుగుతున్నది.
కేసీఆర్ డైరెక్షనేనా?
కేసీఆర్ డైరెక్షన్ తోనే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు కొనసాగించారా? లేకుంటే కేటీఆర్, హరీశ్ రావు సొంత నిర్ణయాలు తీసుకున్నారా? అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సమావేశాల్లో రోజుకో విధంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భావించారు. అయితే ప్రభుత్వం వాటికి చెక్ పెట్టేలా వ్యూహాలను అనుసరించడం, పొలిటికల్ ఎటాక్ చేయడంతోనే గులాబీ సభ్యులు సైతం రూట్ మార్చారా? అనేది చర్చ జరుగుతున్నది. ఒక వైపు కేసుల నమోదు, అరెస్ట్ చేస్తారనే ప్రచారం, మరోవైపు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా? రాకుండే వ్యూహాలు రచిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఎలాంటి ప్రణాళికలతో ప్రజల మధ్యలోకి పార్టీ నేతలు వస్తారనేది ఇటు పార్టీలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.