Kishan Reddy: గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆ స్కీమ్ అమలు చేసే ఆలోచన: కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణం లక్ష్యంగా ముందుకెళ్తున్న సమయంలో ఇదే గోల్డెన్ టైమ్ అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రధాని మోడీ (Modi) సంకల్పించిన లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఒక గొప్ప అవకాశం దొరికిందన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో రోజ్‌గార్ మేళాకు (PM Rojgar Mela 2024) కిషన్‌రెడ్డి హాజరై ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందన్నారు. మన మేథస్సుతో ప్రపంచాన్ని శాసించే విశ్వాసం ఉందన్నారు. మన దేశంలో ఇంకా పేదరికం, నిరుద్యోగం ఉందని. వారికి చేయుతనిచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. దేశ సేవలో యువతను భాగస్వామ్యం చేసేలా వారికి ఉద్యోగాలను కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రోజ్ గార్ మేళా నిర్వహిస్తోందని అన్నారు. యువతకు ఉద్యోగ కల్పన కోసం ఉద్దేశించిన ఈ మేళాల్లో ఇది 11వదని, ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 71వేల మందికి ఇవాళ నియామకపత్రాలు అందిస్తున్నదన్నారు. ఈ రోజుతో కలిపి ఇప్పటివరకు సుమారు 10 లక్షలమంది యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నారన్నారు. రికమెండేషన్లకు తలొగ్గకుండా ప్రతిభ కలిగినవారికే ఉద్యోగాలు కల్పించామన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖలో సుమారు 4 లక్షల ఉద్యోగులున్నారని రానున్న రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్పారు.
యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం
పీఎం-శ్రీ స్కూల్స్ ('PM-Shri Schools) గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుచేసే ఆలోచనలో ఉన్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని (ఎంటర్-ప్రెన్యూర్-షిప్ క్వాలిటీ) వెలికితీస్తూ వారు ఉపాధి కోసం వెతికే స్థితి నుంచి ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020తో విద్యావిధానంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇది రెండో రోజ్‌గార్ మేళా అని వివరించారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకోసం కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మొబైల్ రంగంలో 5జీ టెక్నాలజీతో మరిన్ని అవకాశాలు పెరిగాయని, దీన్ని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది: బండి సంజయ్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi) విమర్శించారు. ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఈ తరుణంలో మోడీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోందన్నారు. హైదరాబాద్ హకీంపేట ఎన్ఐఎస్ఏ అకాడమీ ‘రోజ్ గార్ మేళా’లో బండి సంజయ్ హాజరై 340 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇచ్చిన హామీ మేరకు మోడీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని చెప్పారు. నేటితో 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. గతంలో ప్రధాని మోడీ 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటే హేళన చేశారని, కానీ, ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 4.66 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందన్నారు.