CM Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కోసం రూ.12.30 కోట్లు రిలీజ్
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కోసం రూ.12.30 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన (CM Revanth Reddy Davos tour) నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు (World Economic Forum) ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతినిధులు బృందం దావోస్ లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన నిమిత్తం ఐటీ శాఖ బడ్జెట్ నుంచి రూ.12.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2024 జనవరిలో జరిగిన ఈ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించారు. ఆ పర్యటనలో మొత్తం రూ.40,232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని గతేడాది సీఎంవో కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది మరోసారి దావోస్ లో పర్యటించి మరోసారి ఇన్వెస్టర్లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.