హీరో ‘అల్లు అర్జున్ చుట్టు తెలంగాణ రాజకీయం

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను చిక్కుముడులు వీడడం లేదు.

Update: 2024-12-23 02:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను చిక్కుముడులు వీడడం లేదు. ఈ ఇన్సిడెంట్ రాజకీయంగానూ పెను దుమారం రేపింది. ఈ వ్యవహారంలో పార్టీలు అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదనలతో వారు ముందుకెళ్తున్నారు. రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. సినిమా విషయంలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు నుంచే పార్టీల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు రెండు కేటగిరీలుగా విడిపోయి ప్రవర్తిస్తున్నాయి.

అసెంబ్లీ వేదికగా రేవంత్ వివరణ

థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం.. ఓ మహిళ మృతి చెందడం పై కాంగ్రెస్​పార్టీ ఒక వైపు ఉండగా, బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలు మాత్రం అల్లు అర్జున్‌ను సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. శనివారం అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అసలు ఘటనా స్థలంలో ఏం జరిగిందో డిటైల్డ్‌గా వివరించారు. దీనిపై అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్​ప్రెస్‌మీట్​పెట్టారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అల్లు అర్జున్​వ్యవహారశైలి, ఆయన తీరుపై కాంగ్రెస్​పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఆ పార్టీ నాయకులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బన్నీపై అటాక్​చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా వరుసగా స్పందించారు. కాంగ్రెస్​పార్టీ నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్​బాబా ఫసియుద్దీన్​ ఆధ్వర్యంలో అల్లు అర్జున్​ దిష్టిబొమ్మను దహనం చేశారు.

బన్నీ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ

మరోవైపు.. ఓయూ జేఏసీ నేతలు ఆదివారం అల్లు అర్జున్​ఇంటిని ముట్టడించారు. ఇంటిపై దాడికి యత్నించారు. రాళ్లు, టమాటాలు విసిరారు. పూల కుండీలు పగులగొట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రేవతి కుటుంబం పట్ల అల్లు అరవింద్​ వ్యవహార శైలిని వారు తప్పుపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు అల్లు అర్జున్‌కు అండగా నిలిచారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్​సహా పలువురు బీజేపీ నేతలు పాజిటివ్‌గా స్పందించారు. సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష కట్టారంటూ లక్ష్మణ్​ఆరోపణలు చేశారు. దీంతో అల్లు అర్జున్​సమస్య కాస్త రాజకీయ వైరం గా మారింది.

వీడియో రిలీజ్ చేసిన పోలీసులు

సంధ్య థియేటర్​వద్ద ఆ రోజు ఏం జరిగిందో విషయంపై పోలీసులు వీడియో రూపంలో వెల్లడించారు. హైదరాబాద్​సిటీ పోలీసులు క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేశారు. సమగ్ర వివరాలతో కూడిన వీడియోను సీపీ సీవీ ఆనంద్​మీడియా సమావేశంలో రిలీజ్ చేశారు. ఈ ఘటనపై ఎక్కువ విషయాలు వెల్లడించలేనని, మరిన్ని అంశాలు కోర్టుకు సమర్పిస్తామని సీపీ చెప్పారు. అలాగే.. ఘటన జరిగిన రోజు అక్కడే విధుల్లో ఉన్న ఏసీపీ రమేశ్‌కుమార్, సీఐ రాజునాయక్ సైతం తమ అనుభవనాలు వెల్లడించారు. తాను కూడా ఆ తోపులాటలో కింద పడ్డానని, చనిపోతానని భయపడ్డానని, అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డానని సీఐ తెలిపారు. ఈ వివాదం ఇలా జరుగుతుండగానే.. ఆదివారం సాయంత్రం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కిమ్స్​ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్​ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు శనివారం అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగానికి ప్రజలు సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తున్నారు.


Similar News