జనసేనలో కల్లోలం: మనోహర్ దెబ్బతో పార్టీకి బీటలు?..వీడుతున్న నేతలు

జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ వన్ మేన్ షో నడుస్తోందా? డమ్మీ కమిటీలను వేసి పార్టీని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారా?

Update: 2023-10-16 09:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ వన్ మేన్ షో నడుస్తోందా? డమ్మీ కమిటీలను వేసి పార్టీని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారా? జనసేన పార్టీని బలోపేతం కాకుండా ఉండేందుకు నాదెండ్ల కుట్రలు చేస్తున్నారా? జనసేనాని పవన్ కల్యాణ్... నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ ని తన ప్రక్కన కూర్చో పెట్టుకున్నారా? ఈ నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయడం లేదా? పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడం లేదా? అంటే అవుననే అంటున్నారు పార్టీ వీడిన నేతలు. పవన్ కల్యాణ్ తనకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడిగా నాదెండ్ల మనోహర్‌ను ప్రకటించారు. పార్టీలో నాదెండ్ల మనోహర్ కంటే తనకు ఎక్కువ ఎవరూ కాదని ప్రకటించేశారు. నాదెండ్ల మనోహర్‌ను విమర్శిస్తే తనను విమర్శించినట్లేనని బహిరంగ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అంతలా నాదెండ్ల మనోహర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇటీవల కాలంలో జనసేన పార్టీ నుంచి పలువురు ఇతర పార్టీలలోకి జంప్ అయ్యారు. అయితే పార్టీ వీడిన ప్రతీ ఒక్కరూ చేస్తున్న ఆరోపణలు నాదెండ్ల మనోహర్‌పైనే. పవన్ కల్యాణ్ లక్ష్యాలకు విరుద్ధంగా నాదెండ్ల మనోహర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకుండా తొక్కేస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం వైసీపీకి అనుబంధంగా మారినప్పుడు నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అప్పటి నుంచి మెుదలైన విమర్శలు నేడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి వరకు అంతా నాదెండ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఈ విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

టార్గెట్ నాదెండ్ల

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టికెట్లు ఆశించే ఆశావాహులు తమ తమ ప్రయత్నాలు మెుదలు పెట్టేశారు. మరికొందరు అసంతృప్తులు గోడలు దూకుతున్నారు. ఇలా గోడలు దూకుతున్న వారి జాబితాలో జనసేన సభ్యులే అత్యధికంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించిన అనంతరం ముగ్గురు కీలక నేతలు జనసేనకు రాజీనామా చేశారు. పిఠాపురం మాజీ ఇన్‌చార్జి మాకినీడు శేషుకుమారి, రాజానగరం మాజీ ఇన్‌చార్జి మేడా గురుదత్త ప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గతంలో కూడా జనసేన పార్టీని కీలక నేతలు వీడారు. అయితే వీడిన తర్వాత అందరూ చేస్తున్న ఆరోపణలు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌పైనే. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలితోనే తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసం తాను ఎంతో కృషి చేశానని అలాంటి తనను పక్కన పెట్టి నాదెండ్ల మనోహర్ మరో ఇన్‌చార్జిని నియమించారని మాకినీడు శేషుకుమారి ఆరోపించారు. జనసేన పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నాదెండ్ల మనోహర్ నిర్ణయం పార్టికి చేటు తెస్తుందే తప్ప మంచి జరగదంటూ జనసేనను వీడిన శేషుకుమారి ఆరోపించిన సంగతి తెలిసిందే.

రాపాక నుంచి మెుదలు

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. తాను ఎట్టి పరిస్థితుల్లో జనసేనను వీడనని ప్రకటించారు. వైసీపీలో చేరితే తాను 152వ వ్యక్తినని... అదే జనసేనలో అయితే తాను నెంబర్ వన్ అని గొప్పగా చెప్పుకున్నారు. అలాంటి రాపాక వరప్రసాద్ పట్టుమని ఒక సంవత్సరం కూడా జనసేన పార్టీలో ఇమడ లేకపోయారు. వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. జనసేనకు తాను ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో కూడా రాపాక వరప్రసాదరావు ప్రకటించారు. పవన్ కల్యాణ్‌ను కలవనీయకుండా నాదెండ్ల మనోహర్ అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను కలవాలని తాను ఎంతో ప్రయత్నించినా అందుకు నాదెండ్ల మోకాలడ్డుతున్నారని అందువల్లే తాను జనసేన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తాను ఏం చేయాలో కూడా నాదెండ్ల మనోహర్ డిసైడ్ చేస్తున్నారని... తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారంటూ రాపాక వరప్రసాదరావు ఆరోపించిన సంగతి తెలిసిందే.

నాదెండ్ల ఒక బ్లాక్ హోల్

ఇటీవలే జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి సైతం పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జనసేన పార్టీ కోసం తాను ఎంత శ్రమించానో రాష్ట్ర ప్రజలకు తెలుసునని కేతంరెడ్డి తెలిపారు. అయితే ప్రక్క నియోజకవర్గంలో పోటీ చేసిన కొందరు చిల్లర వెధవలను పార్టీలో నెంబర్ టూ గా పిలవబడే నాదెండ్ల మనోహర్ ప్రోత్సహిస్తూ నిత్యం తనపై కుట్రలు చేస్తూ, పవన్ కల్యాణ్‌కు లేనిపోనివి చెప్తూ.. తనకు పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా చేశారని ఆరోపించారు. శీల పరీక్షలు, శల్య పరీక్షలు చేస్తూ, పార్టీ కార్యక్రమాలకు కూడా తనను పిలవకుండా అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తాను ఆకాశం లాంటివాడిని చెప్తూ ఉంటారని కానీ ఆయన నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్‌ని తన ప్రక్కన కూర్చో పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయదు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా డమ్మీ కమిటీలను వేసి ఇదే జనసేన పార్టీ అంటారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో అసలు గుర్తింపు ఉండదు అని ఆవేదన వ్యక్తం చేశారు.


నాదెండ్లే కాదు టీడీపీ కూడా రేప్ చేస్తోంది

పచ్చిగా చెప్పాలంటే జనసేన పార్టీని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు అంటే మానభంగం చేస్తున్నాడు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జనసేన పార్టీని మానభంగం చేస్తున్న విషయాన్ని పార్టీలో ఎవరు కూడా పవన్ కల్యాణ్‌కు చెప్పకూడదంట అని మండిపడ్డారు. చెప్తే వారు కోవర్టులతో సమానమని స్వయంగా పవన్ కల్యాణ్‌ చెప్పారని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకు నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్ గా ఉన్నపుడే ఇతని భాగోతాల గురించి దివంగత ఆనం వివేకానందరెడ్డి చెప్పేవారని గుర్తు చేశారు. అప్పట్లో శాసనసభ్యులకు ఇచ్చిన శాంసంగ్ ట్యాబ్‌ల దగ్గరే ఈయన చిల్లరకు కక్కుర్తిపడ్డాడు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన భాగోతాలను దగ్గరగా చూసానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. తాను యూత్ కాంగ్రెస్ కి సోషల్ మీడియా ఛైర్మన్ గా, రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న సమయంలో నాదెండ్ల మనోహర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఛైర్మన్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. అప్పట్లో రాహుల్ గాంధీ టీమ్ 15మందిలో ఒకడిగా తాను పని చేయడం, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డితో తనకున్న సాన్నిహిత్యం, ఆయన తనను ప్రోత్సహించే విధానం ఈ నాదెండ్ల మనోహర్‌కు నచ్చేది కాదు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటివరకు జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు. ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ రేప్ చేస్తుంది. మా నెల్లూరు సిటీలో ఇప్పటికే నారాయణ జనసేన పార్టీని రేప్ చేయడం మొదలు పెట్టాడు. పార్టీ బలంగా ఉంటుందని చెప్పుకునే గోదావరి జిల్లాల్లో పలువురు నాయకులు పార్టీని టీడీపీ ఎలా రేప్ చేస్తుందో నాతో చెప్తూ ఆవేదన చెందుతున్నారు అంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

పవన్ మేల్కోవాల్సిందే

ఇదిలా ఉంటే నాదెండ్ల మనోహర్‌ను పార్టీవీడిన నేతలు టార్గెట్ చేయడం పట్ల రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. నాదెండ్ల మనోహర్‌ను కావాలనే టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతుంది. అందరికీ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ నాదెండ్ల మనోహర్ పేరు చెప్పి ఎవరైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారా అనేది జనసేన పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జనసేన పార్టీని వీడిన నేతలు సామాన్యులేమీ కాదు. గత ఎన్నికల్లో మంచి ఓట్ల సాధించిన వారు. అంతేకాదు జనసేన పార్టీని గడప గడపకు తీసుకెళ్లిన నేతలు. ఇలాంటి నేతలను పార్టీ కోల్పోవడం ఒక విధంగా మైనస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీడిన వారంతా నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేయడం వెనుక లోగుట్టును కూడా అధినేత పవన్ కల్యాణ్ చేధించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

Tags:    

Similar News