AP Govt : వైసీపీ హయాంలోని రహస్య జీవోలు బయటపెట్టండి : ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో రహస్యంగా ఉంచిన జీవో(GO'S)లు అన్నింటినీ బహిర్గతం చేయాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-28 12:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో రహస్యంగా ఉంచిన జీవో(GO'S)లు అన్నింటినీ బహిర్గతం చేయాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్‌(Secretary S. Suresh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. పారదర్శకత, సమాచారం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో ఉండాల్సిందేనని జీఏడీ కార్యదర్శి సురేశ్‌కుమార్‌ తెలిపారు. అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టత ఇస్తాయని అన్నారు. అయితే మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతుందని తెలిపారు. అందుకే మూడేళ్ల కాలానికి సంబంధించిన జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

2008లో జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు, జీవో కాపీలను అందులో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులను మాత్రం సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా జగన్‌ సర్కార్‌ జీవోలను రహస్యంగా ఉంచుతుందని ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు నాడు తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందునా వైసీపీ హయాంలోని ఆ రహస్య జీవోలను బయటపెట్టాలని నిర్ణయించింది.

Tags:    

Similar News