అధికారాన్ని ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి..ఇబ్బందిపడిన విద్యార్థులు
ప్రభుత్వపరంగా ఏ హోదా లేకపోయినా అధికార దర్పం ప్రదర్శించారు వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్.
దిశ డైనమిక్ బ్యూరో: ప్రభుత్వపరంగా ఏ హోదా లేకపోయినా అధికార దర్పం ప్రదర్శించారు వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ప్రభుత్వపరంగా ఎలాంటి హోదా లేకపోయినా కీలక శాఖలు అడుగడుగునా సహాయసహకారాలు అందించి ఆయన పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో ప్రాతినిధ్యం వహించాయి.
వివరాల్లోకి వెళ్తే.. నిన్న (సోమవారం) వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూకే ఎదురుగా వేదిక ఏర్పాటుచేసి హోర్డింగులతో ధూంధాంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అలానే చలమలశెట్టి సునీల్ పుట్టినరోజు సందర్భంగా 20వేల మందికి మాంసాహార భోజనాలు పెట్టారు. మైక్ సెట్ ను ఏర్పాటు చేశారు.
జేఎన్‌టీయూ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ కి ఏర్పాట్లు చేశారు. అయితే వేదిక దగ్గర భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనితో జనాల రాకపోకలకు అసౌకర్యం కలిగింది. ఇక ట్రాఫిక్ చక్కదిద్దడానికి.. ప్రైవేటు కార్యక్రమానికి బందోబస్తుగా 50 మందికి పైగా పోలీసులు సేవలు అందించారు.
అలానే జేఎన్‌టీయూ ప్రాంగణంలో వాహనాలు పార్కింగ్ చేయడంతో పాటుగా మైక్ సెట్ ఏర్పాటు చేయడంతో.. మైకుల హోరు, వాహనాల రణగొణ ధ్వనులతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. అయితే విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుందని తెలిసీ జేఎన్‌టీయూ ప్రాగణంలో పార్కింగ్ కు యాజమాన్యం ఎలా అనుమతించింది అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇక స్థానిక ప్రజలతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు జేఎన్‌టీయూ యాజమాన్యం పార్కింగ్‌కు అనుమతివ్వడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ వీసీ ప్రసాదరాజు మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో డీఎస్పీ కోరడంతో సరే అన్నామని పేర్కొన్నారు.
Read More..