New Liquor Policy: ఉద్యోగుల బతుకు పోరు..! కొత్త మద్యం పాలసీ తెచ్చిన తంటా

ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకురానుందా?

Update: 2024-09-02 02:05 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకురానుందా?, ఈ విధానం మద్యం దుకాణ సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపనుందా?, దాదాపు 15 వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయా ? ఐదేళ్ల పాటు అభద్రతా భావంతో విధులు నిర్వహించారా?, టెండర్ విధానం అమల్లోకి వస్తే వారంతా ఇంటికెళ్లక తప్పదా ?, అంటే అవుననే సమాధానం వస్తోంది. వైసీపీ ఓటమితో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసే సిబ్బంది సంకటస్థితిలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో వేల మంది సిబ్బంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. దీంతో ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషించిన వీరికి ఆ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దురదృష్టకరం. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును సమర్థిస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 4 నుంచి ఆందోళన బాట పట్టనున్నారు. స్పందించకుంటే 7న మద్యం దుకాణాలు బంద్ చేసి మూకుమ్మడిగా రాజీనామాలకు సన్నద్ధమౌతున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించడంలో గత ప్రభుత్వం విఫలం

రాష్ర్ట వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రాష్ర్ట వ్యాప్తంగా 3,200 మద్యం దుకాణాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన దాదాపు 12 వేల మందికి పైగా విద్యా వంతులను వాటి నిర్వహణ కోసం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పని చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా లాభార్జన కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం పని చేయించుకుంది. ఇంత చేసినా వీరికి ఉద్యోగ భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.

ఒప్పంద ప్రాతిపదికన తీసుకోవడంతో అధికారులను ఎదురించలేక 4 గంటలు అదనంగా పని చేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టడంతో వీరి ఉద్యోగ భద్రతకు భరోసా లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వమైనా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఆశించారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పని చేసే వారంతా వైసీపీకి చెందిన వారుగా భావించారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలకు ఏకపక్షంగా మద్యం సరఫరా చేయడం, టీడీపీ నేతలకు మద్యం ఇవ్వకుండా చేశారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకున్న నేతలు నూతన మద్యం పాలసీ విధానానికే మొగ్గు చూపుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

4 నుంచి ఉద్యమాలకు శ్రీకారం

ఏపీలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాలకు బదులు టెండర్ ద్వారా ప్రయివేట్ దుకాణాలకు శ్రీకారం చుట్టింది. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది వారం క్రితం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకం కాదని, తమను తొలగించినా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉపాధి కల్పించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని కోరారు. అలాగే ఈ వినతిని రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, సీఎస్ కు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కు, డిపోల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు.

సిబ్బందికి ‘వాసుదేవుడి’ శఠగోపం!

గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారంగా వ్యవహరించి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అలాగే మద్యం దుకాణాల్లో పని చేసే సేల్స్ మెన్లు, సూపర్ వైజర్ల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా 15 వేల మందికి పైగా సిబ్బంది ఉంటే వారికి వచ్చే వేతనాల్లో కోతలు విధించడం, ఆ డబ్బునంతా తన ఖాతాలో వేసుకోవడం వంటివి చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఏడాదికి ఈయన ఒక్కో సిబ్బంది నుంచి లక్ష చొప్పున అనధికారికంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి జగన్ మద్యం దుకాణాల్లో పని చేసే సిబ్బందిని ఏపీ కార్పొరేషన్ లో కలుపుతానని హామిచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చకుండా వాసుదేవ రెడ్డి అడ్డుకున్నట్లు ప్రచారం జోరందుకుంది.


Similar News