హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో బోగస్ సర్టిఫికెట్ల ఏరివేత.. దూకుడు పెంచిన లోకాయుక్త

వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖలో బోగస్ సర్టిఫికెట్లతో రెగ్యులర్ ఉద్యోగాలు పొందిన నకిలీల ఏరివేతపై లోకాయుక్త దూకుడు పెంచింది.

Update: 2024-10-27 02:20 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖలో బోగస్ సర్టిఫికెట్లతో రెగ్యులర్ ఉద్యోగాలు పొందిన నకిలీల ఏరివేతపై లోకాయుక్త దూకుడు పెంచింది. అధికారులు గడువు కోరడంతో విచారణను నవంబర్ 26కు వాయిదా వేసింది. అధికారుల తీరుపై సీరియస్‌గా వ్యవహరించిన లోకాయుక్త నేరుగా రంగంలోకి దిగింది. లోకాయుక్త సంస్థ విభాగపు డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) అధికారి అన్ని జిల్లాల వైద్యాధికారులకు నవంబర్ 5లోపు ఉద్యోగుల సర్టిఫికెట్లను అందజేయాలని సర్క్యులర్ జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అన్ని రకాల సర్టిఫికెట్లు తెప్పించుకునే పనిలో పడ్డారు. లోకాయుక్త రంగంలోకి దిగడంతో అర్హులు ఆనందంలో ఉండగా.. నకిలీల గుండెల్లో గుబులు మొదలైంది.

14 వేల మందికిపైగా నకిలీ సర్టిఫికెట్లు..

ఏపీలో 2002 డీఎస్సీ రాత పరీక్షల్లో 16,048 మంది పాల్గొన్నారు. అందులో ప్రభుత్వ సంస్థల్లో శిక్షణ పొందిన వారు కేవలం 1274 మంది మాత్రమే ఉండగా బోగస్ సర్టిఫికెట్లు కల్గిన వారు 14,774 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా 4,500 మంది మగ ఆరోగ్య కార్యకర్తలు అవుట్ సోర్సింగ్, ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోతూ పోతూ చాలా మందిని రెగ్యులర్ చేయడం నకిలీల బాగోతం బయట పడేలా చేసింది. అందులో 2 వేల మందికి పైగా నకిలీ సర్టిఫికెట్లు కలిగిన వారిని రెగ్యులర్‌గా గుర్తించడంతో అడ్డదారిలో వచ్చిన వారిని రెగ్యులర్ చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అర్హులు ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2010 అక్టోబర్ 10న జీఓ నెం.1402 ప్రకారం నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న సంస్థలపై విచారణ చేయాలని సీబీసీఐడీకి ఆదేశించింది. 2013లో సమాచార హక్కు చట్టంతో విజిలెన్స్ అధికారులు నిజాలను నిగ్గు తేల్చారు. 2019లో వాటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన ముత్యాల బాలుడు, బి.అంకిరెడ్డితో పాటు మరి కొంత మంది బాధితులు 2024 జనవరి 17న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లోకాయుక్త జనవరి 24 నుంచి అక్టోబర్ 25 వరకు దాదాపు ఐదు సార్లు పూర్తి నివేదికలతో హజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

నివేదికపై అభ్యంతరం..

అధికారులు పంపిన నివేదికను విచారణకు హాజరైన ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, జేఏసీ రాష్ట్ర ప్రతినిధులు వి.ఎన్.మునిరెడ్డి, ఎస్.నజీర్ బాషా, పోలు రామలింగారెడ్డి తదితర బాధితులకు చదివి వినిపించగా అందులో నిజాలు లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు మరోమారు గడువు కోరగా నవంబర్ 26కు విచారణ వాయిదా వేశారు. లోకాయుక్త సంస్థ విభాగపు డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) అధికారి సమగ్ర విచారణకు గడువు కోరి అన్ని జిల్లాల వైద్యాధికారులకు సర్టిఫికెట్ల కోసం సర్క్యులర్ జారీ చేశారు. అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు ఆరోగ్య శాఖలోని మగ ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన పది, ఇంటర్, టెక్నికల్ కోర్సుకు సంబంధించిన మార్కు లిస్టులు, మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, టెక్నికల్ ప్లేస్ ఆఫ్ స్టడీ, టీసీ, పారా మెడికల్ బోర్డు రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్లు కలర్ జిరాక్సులతో నవంబర్ 5లోపు సమర్పించాలని ఆదేశించింది.

సర్టిఫికెట్లు సొంతంగా అచ్చేసుకున్నారు..

ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని ఇతర రాష్ట్రాలకు చెందిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ముంబై, కర్నాటక, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజిన్ న్యూ ఢిల్లీ, ఏపీలోని బెతాస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, శానిటేషన్ టెక్నాలజీ విశాఖపట్నం, ది కాలేజీ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ ఒంగోలుకు చెందిన సంస్థలు సొంతంగా అచ్చువేసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి లక్షల్లో అమ్మకాలు చేశారని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అభ్యర్థులు పది, ఇంటర్ చదివిన వారికి ఈ సంస్థలు సర్టిఫికెట్లు అందించాయి. ఈ సంస్థలు ఒకే విద్యా సంవత్సరంలో ఇంటర్, డిప్లొమాను, పది, ఇంటర్ పూర్తైన వెంటనే కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే డిప్లొమా పూర్తి చేసినట్లు, పది పూర్తైన నెలల వ్యవధిలోనే డిప్లొమా సర్టిఫికెట్లు పొందినట్లు అంటే కేవలం 9 నెలల కాల వ్యవధిలో ఇంటర్, డిప్లొమా పూర్తైనట్లు సర్టిఫికెట్లు సృష్టించారు. ఏడాదిలో ఎన్ని నెలలుంటే అన్ని నెలల తేదీలతో కోర్సు సర్టిఫికెట్లు రిలీజ్ చేసినట్లు గుర్తించారు.


Similar News