మా స్టేడియం.. మేమే చూసుకుంటాం

విజయవాడలోని ఇందిరా‌గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఉమ్మడి కృష్ణా జిల్లాకు క్రీడల కోట.

Update: 2024-10-27 02:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని ఇందిరా‌గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఉమ్మడి కృష్ణా జిల్లాకు క్రీడల కోట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన ఘనత ఈ స్టేడియంకు ఉంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సైతం ఈ స్టేడియంలో జరిగింది. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ స్టేడియం రాను రాను రాజకీయ సభలకు, పోలీస్ శాఖ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఆగస్ట్ 15, జనవరి 26, అక్టోబర్ 21 తేదీల్లో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇదే స్టేడియం‌లో నిర్వహిస్తున్నారు. అలాంటి ఈ స్టేడియాన్ని ఎవరు పరిపాలించాలి అనే సందిగ్ధత నెలకొంది.

హక్కులు కార్పొరేషన్‌కు..

అసలు విషయం ఏమిటంటే ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం పూర్తి హక్కులు ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతోంది. కబడ్డీ, టెన్నిస్, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్‌బాల్, క్రికెట్, క్యారమ్స్, నెట్‌బాల్, సేపక్ తక్ర, యోగా, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలతో పాటు పెద్ద సంఖ్యలో వాకర్లు ఈ స్టేడియంకు వస్తారు. క్రీడా సంఘాల కార్యాలయాలు సైతం అక్కడే ఉన్నాయి. క్రీడా శిక్షకులు మాత్రం శాప్, డీఎస్ఏ ఆధ్వర్యంలో స్టేడియంలో శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేషన్‌కు సంబంధించి శిక్షకులు అక్కడ ఎవరూ లేరు.

కార్పొరేషన్ ఆలోచన ఇదే..

ఈ క్రమంలో స్టేడియం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే నిర్వహణ చేస్తామని, మొత్తం స్టేడియంలో ఉన్న గ్రౌండ్స్ అప్పగించాలని శాప్‌ని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షకుల ఏర్పాటుతో పాటు స్టేడియం పరిపాలనపై శాప్, డీఎస్ఏ‌కు ఎటువంటి హక్కులు లేకుండా చూడాలనేది కార్పొరేషన్ ఆలోచన. ఇదే జరిగితే.. శాప్ శిక్షకులకు చిక్కులు తప్పవు. ప్రస్తుతం డీఎస్ఏ, శాప్ ఆధ్వర్యంలో కబడ్డీ, బాక్సింగ్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్‌లకు శిక్షకులు అందుబాటులో ఉన్నారు. వీరందరూ మరో‌చోట శిక్షణకు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

యూజర్ ఫీజు వసూలు..

స్టేడియంను కార్పొరేషన్ పరిధిలోనికి తీసుకుని ఆదాయ వనరుగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. స్టేడియంలో టెన్నిస్ కోర్ట్ నుంచి పెద్ద మొత్తం ఆదాయం రావడం, అది శాప్‌కు వెళ్లడంతో దానితో పాటు వాకర్స్‌కు సైతం యూజర్ ఫీజు ఏర్పాటు చేస్తే మరింత ఆదాయం వస్తుందనేది కార్పొరేషన్ ఆలోచనగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో క్రీడా సంఘాల నుంచిఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.


Similar News