Minister Ram Mohan Naidu: ఏవియేషన్ చట్టాల్లో సవరణలు.. వారిపై కఠిన చర్యలు
విమానాలకు బాంబు బెదిరింపులు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu).
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భారత్ కు చెందిన విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాల్స్, మెయిల్స్, సోషల్ మీడియా వేదికలుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులు వచ్చిన ప్రతిసారి అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులు బెదిరిపోయారు. మరోవైపు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ (Pannun) కూడా నవంబర్ లో ప్రయాణికులు విమాన ప్రయాణాలు ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో.. విమానాలకు బాంబు బెదిరింపులు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu). ఆదివారం విశాఖ - విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులను ప్రారంభించిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపులపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
బాంబు బెదిరింపులపై కేంద్రం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని, బాంబు బెదిరింపుల వెనుక ఎవరున్నారో విచారణలో తేలుతుందని చెప్పారు. అలాగే ఏవియేషన్ కు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేస్తామన్నారు. నిందితులు ఎవరైనా వారిని వదలమన్న ఆయన.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడిన వారికి విమానాల్లో ఎంట్రీ ఉండదని, ఈ మేరకు చర్యలు ఉంటాయని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక సూచనలు చేశారని తెలిపారు.