‘సరస్వతి’ భూముల సర్వే.. ఎక్కడా కనిపించని హద్దురాళ్లు

సరస్వతి సిమెంట్స్, పవర్ కంపెనీ భూముల లెక్క తేల్చే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.

Update: 2024-10-27 02:27 GMT

దిశ ప్రతినిధి, నరసరావుపేట: సరస్వతి సిమెంట్స్, పవర్ కంపెనీ భూముల లెక్క తేల్చే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. మాజీ సీఎం జగన్, ఆయన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ఆస్తుల వివాదం కోర్టుకు వెళ్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు శనివారం పరిశీలన చేపట్టారు. మాచవరం, దాచేపల్లి మండలాల్లో 1,515.93 ఎకరాలు సరస్వతి కంపెనీకి ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో మాచవారం మండలంలో 1,077.38 ఎకరాలు ఉండగా.. మిగిలిన భూమి తంగెడ, మాదినపాడులలో ఉంది. వీటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులలో పలు సందేహాలు నెలకొన్నాయి.

ఎందుకు ఆన్‌లైన్ చేయలేదో..

ప్రస్తుతం బీడుగా ఉన్న ఈ భూముల్లో హద్దు రాళ్లు కూడా లేవు. 1,077.38 ఎకరాలకు సంబంధించి ఆన్‌లైన్ చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు మాచవరం మండల రెవెన్యూ అధికారులకు అందజేశారు. దానిలో ఇప్పటికీ 800 ఎకరాలు పైచిలుకు ఆన్‌లైన్ చేశారు. మరో 200 ఎకరాల వరకు చేయాల్సి ఉంది. ఆ భూమి ఇన్నేళ్లు గడిచినా ఎందుకు ఆన్‌లైన్ చేయలేదన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పైగా సరస్వతి సిమెంట్స్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే, రిజిస్టర్ చేయించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.1,900లో ఏబీఎం సొసైటీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా వేమవరంలో పేదలకు పంపిణీ చేయించారు. వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు.

అధికారుల్లో అనుమానాలు..

అప్పటి అసైన్డ్ భూములు సరస్వతి భూములలో ఉన్నాయా అన్న అనుమానాలు అధికారులలో తలెత్తాయి. మొత్తం మీద మాచవరం భూముల్లో తేడాలు ఉన్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి. తంగెడ, మాదినపాడు భూముల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో ప్రస్తుత రెవెన్యూ అధికారులు ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. సరస్వతి భూములు ఉన్న ప్రాంతాన్ని మాచవరం మండల తహసీల్దార్ క్షమా రాణి, సర్వేయర్ సాల్మన్ రాజు, ఆర్ఐ, కోటేశ్వర రావు, వీఆర్ఓ అఖిల్‌, దాచేపల్లి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనోజ్ వేరువేరుగా సరస్వతి సిమెంట్స్, పవర్ భూములను పరిశీలించారు. మరికొద్ది రోజుల్లో ఈ భూముల లెక్క తేలనుంది.


Similar News