అమ్మాయిలతో డాన్స్ చేసేందుకు పోటీ.. ఒకరినొకరు తన్నుకున్న యువకులు
కాకినాడ జిల్లా తేటగుంటలో అర్ధరాత్రి జరిగిన జాతరలో యువకులు కొట్టుకున్నారు

దిశ, తుని: కాకినాడ జిల్లా తేటగుంటలో అర్ధరాత్రి జరిగిన జాతరలో యువకులు కొట్టుకున్నారు. రాజులబాబు పండుగ సందర్భంగా గ్రామంలో జాతర జరిగింది. ఇందులో భాగంగా రికార్డింగ్ డాన్స్‌లతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించారు. రికార్డింగ్ డాన్స్‌ల స్టేజీ దగ్గరకి అదే గ్రామానికి చెందిన యువకులు వచ్చారు. అమ్మాయిలు డాన్స్‌లు చేస్తుండంగా కొందరు యువకులు స్టేజీ ఎక్కి డాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్లని నిర్వాహకులు కిందకి తోసేశారు. దీంతో నిర్వాహకులు, యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఇరు వర్గాలుగా విడిపోయిన యువకులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అనంతరం రాళ్లు రువ్వడంతో గొడవ కులాల మధ్య చిచ్చు రేపింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ రాళ్ల దాడిలో ఇరు వర్గాల యువకులతో పాటు ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. అసాంఘిక కార్యకలాపాల వల్లే గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అలాంటి వాటిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. మరి నిర్వాహకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.