హాల్ టికెట్స్ విషయంపై చైల్డ్ రైట్స్ కమిషన్ కీలక ఆదేశాలు
ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఫీజు బకాయిల కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇవ్వటం లేదని చైల్డ్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తీవ్రంగా పరిగణించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.

దిశ ప్రతినిధి, బాపట్ల: ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఫీజు బకాయిల కారణంగా విద్యా సంస్థల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇవ్వటం లేదని చైల్డ్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తీవ్రంగా పరిగణించిన కమిషన్ విచారణకు ఆదేశించింది. కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల చర్యలపై జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తగు చర్యలు చేపట్టి బుధవారం సాయంత్రం లోపు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ హాల్ టికెట్స్ అందే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు.
చైల్డ్ రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఆయా డివిజన్, మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల వారికి సదరు విషయాన్ని వివరించి ప్రతి విద్యార్థికి హాల్ టికెట్స్ బుధవారం సాయంత్రం లోపు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన చైల్డ్ రైట్స్ కమిషన్, విద్యాశాఖ అధికారులకు పదవ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.