ఏసీబీ వలలో పరిశ్రమల ప్రోత్సాహక అధికారి

ఇద్దరు వ్యక్తులు స్వయం కృషితో ఎదగాలని సంకల్పించారు.

Update: 2025-03-12 08:50 GMT
ఏసీబీ వలలో పరిశ్రమల ప్రోత్సాహక అధికారి
  • whatsapp icon

దిశ అద్దంకి: ఇద్దరు వ్యక్తులు స్వయం కృషితో ఎదగాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా సొంతంగా డైరీ ఫారం పెట్టాలని తలచారు. అందుకు వారికి ఆర్థిక సహకారం కొరవడింది. ఇంతలో (పీఎంఈజీపీ) ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం రూపంలో వారి కలలను సాకారం చేసుకునేందుకు దారి చూపింది. వెంటనే ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకేముంది, రుణాలు కూడా సమకూరినట్లే అనుకుంటున్న తరుణంలో లంచం అవతారంలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసి, ఏసీబీ వలలో చిక్కిన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకిలో జరిగింది.

అందిన సమాచారం ప్రకారం.. బాపట్ల జిల్లా పరిధిలోని సంతమాగులూరు గ్రామానికి చెందిన వీర్ల రమేష్ బాబు అనే వ్యక్తి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) కింద డైరీ ఫారం పెట్టాలని అనుకున్నారు, సొంత వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో రూ.20లక్షలు బ్యాంకు రుణం పై రాయితీ పొందేందుకు గాను ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) వెబ్ సైట్ నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. అతనితో పాటు అద్దంకికి చెందిన మరొకరు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి బాపట్లలోని జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) లో పరిశ్రమల ప్రోత్సాహక అధికారి (IPO) తన్నీరు ఉమాశంకర్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఒక్కో దరఖాస్తుకు రూ.20 వేల చొప్పున, రూ.40వేలను ముట్టజెప్పాలని ఆర్డర్ వేశాడు. వీర్ల రమేష్ బాబుతో పాటు రెండో దరఖాస్తుదారునికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు. దీంతో వారు ఇద్దరు కలిసి అధికారిపై గుంటూరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు అవినీతి నిరోధక (సవరణ) చట్టం - 2018 సెక్షన్ 7(a) కింద కేసు నమోదు చేశారు. వెంటనే ఏసీబీ అధికారులు తమ ప్రణాళికను అమలులో పెట్టారు. బాధితుడు వీర్ల రమేష్ బాబు నుంచి కమ్మ కిశోర్ బాబు అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా అద్దంకిలో ఉన్న కె. & కె. కన్సల్టెన్సీ ఆఫీస్ వద్ద ఉమాశంకర్ లంచం డబ్బులు తీసుకుంటుండగా, గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని బుధవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.


Similar News