అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

పక్కా గృహ నిర్మాణాలలో ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు.

Update: 2025-03-13 13:33 GMT
అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
  • whatsapp icon

దిశ ప్రతినిధి, బాపట్ల: పక్కా గృహ నిర్మాణాలలో ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. గృహ నిర్మాణాల పై సంబంధిత శాఖ అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గృహాలు మంజూరై వివిధ దశలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న 1.8 లక్షలు సరిపోక, వారి వద్ద వెసులుబాటు లేక ఆగిపోయిన గృహాలు జిల్లాలో సుమారు 16 వేల 85 ఉన్నాయని ఆయన తెలిపారు.

ప్రభుత్వం మంచి ఉద్దేశంతో బీసీ, ఎస్సీ వర్గాలకు 50 వేలు చొప్పున, ఎస్టీ వర్గాలకు 75 వేలు చొప్పున అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆయన తెలిపారు. ఎస్సీ, బీసీ వర్గాలకు మొత్తంగా 2.3లక్షలు, ఎస్టీ వర్గాలకు 2.5 లక్షలు మంజూరు చేయబడుతుందని ఆయన తెలిపారు. ఎవరికైతే ఇళ్లు మంజూరు చేయబడ్డాయో ప్రతి మహిళకు సెర్ప్ నుంచి లక్ష రూపాయల రుణం ఇవ్వబడుతుందని అన్నారు. మొత్తంగా ఎస్సీ, బీసీ వర్గాలకు 3.3 లక్షలు, ఎస్టీ వర్గాలకు 3.5 లక్షలు మంజూరు చేయబడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మీడియా ద్వారా తెలియజేయడమైనదని అన్నారు.

ప్రజా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారి సహాయంతో వారి వద్దకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఎం. ఎస్. ఓలు, సి ఎస్ ఓ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో రాజకీయ నాయకులను సంప్రదించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది జి ఎస్ డబ్ల్యూ ఎస్ వారీగా 16 వేల 85 మంది లబ్ధిదారుల గృహాలకు వెళ్లి వారితో సంప్రదించి వారి యొక్క గృహాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం గురించి వారికి తెలిపి వారిలో చైతన్యం తీసుకు వచ్చి, గృహాల నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. పీఎం ఏవై 1.0 పథకం కింద గృహాల నిర్మాణానికి ఎంపికై అసంపూర్ణ నిర్మాణంలో ఉన్నటువంటి ఎస్సీ,ఎస్టీ, బిసి వర్గాల లబ్ధిదారుల వివరాలను జి ఎస్ డబ్ల్యూ ఎస్ వారి డేటా ఆధారంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పోర్టల్ లో పెట్టడం జరిగిందన్నారు.

జి ఎస్ డబ్ల్యూ ఎస్ డేటాలో లేని కొన్ని పేర్లను ప్రత్యేకంగా లబ్ధిదారులను కలిసి వారి కుల ధ్రువీకరణ ఆధారంగా అప్లోడ్ చేయాలన్నారు. అప్లోడ్ చేసినట్లయితే జి ఎస్ డబ్ల్యూ డేటాలో వారి వివరాలను సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం ఒక యాప్ ను ఏర్పాటు చేయడమైనదని ఆయన అన్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి వారిని ఫోటో తీయాలన్నారు. ఆ లబ్ధిదారులతో రెండు ప్రశ్నలకు సమాధానాలు అడగాలని అన్నారు. ప్రభుత్వం అందించే అదనపు ఆర్థిక సహాయం తో గృహాలు కట్టుకుంటారా లేదా అని అడగాలన్నారు. అందుకు లబ్ధిదారులు అవును అంటే వారికి అదనపు నిధులు మంజూరు అవుతాయని అన్నారు. లేదు అంటే వారికి అదరపు నిధులు మంజూరు కాబడవని తెలిపారు. ఇందులో సవరణ ఎంపిక కూడా ఉందని తెలిపారు.

ఈ సర్వే ఈనెల 15వ తేదీ నుండి చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గాని సచివాలయ సిబ్బంది గాని యాప్ ద్వారా ఫోటోలు తీయాలన్నారు. గృహాల నిర్మాణంలో పునాది, లెంటల్, రూప్, స్లాబ్ లెవెల్, ప్రతి లెవెల్ లో ఒక్కొక్క అధికారికి బాధ్యతలు అప్పగించబడ్డాయని ఆయన అన్నారు. మొత్తంగా, పిడి హౌసింగ్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించారని ఆయన అన్నారు. లబ్ధిదారులు అదనపు నిధుల మంజూరులో ఎంపిక అయినట్లయితే ఆ లబ్ధిదారుని ఇంటి పురోగతి ఆయా అధికారుల పై ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఆ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. 10 డిసెంబర్ 24న పూర్తయిన గృహాలకు నగదు చెల్లింపు చేయడమైనదని అన్నారు.

పూర్తయిన గృహాలను క్షేత్రస్థాయిలోపర్యవేక్షించాలన్నారు. ఆ గృహాలకు లోపల బయట ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు ఉన్నట్లయితే వారిని కూడా ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. వారికి కూడా ప్రభుత్వ అదనపు ఆర్థిక సహాయం మంజూరు చేయబడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం మే 2025 నాటికి 8 వేల 299 ఇళ్ళను పూర్తి చేయుటకు జిల్లాకు లక్ష్యంగా ఇచ్చారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ లక్ష్యాలను గడువు నాటికి పూర్తి చేయుటకు ఎం.ఎస్.ఓ లు, ఎంపీడీవోలు, ఏఈలు, డి ఇ లు, ప్రత్యక్షత శ్రద్ధ వహించి కెపిఐ లో వృద్ధి సాధించాలని ఆయన అన్నారు. పీఎం ఏ వై 2.0 కింద బాపట్ల జిల్లా యు డి ఎ లో ఉన్నందున కొత్తగా నిర్మించుకునే ఇండ్లకు 2.5 లక్షలు మంజూరు చేయబడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలకు సమావేశాల ద్వారా ప్రచారం చేసి వారు ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకునే విధంగా కృషి చేయాలని ఎంపీడీవోలకు ఆయన సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాలలో పని దినాలు కల్పించాలన్నారు. నిర్దేశించిన మాదిరిగా 90 పని దినాలు చూపి లబ్ధిదారులకు కూలి సొమ్ము చెల్లించాలన్నారు. గృహ నిర్మాణాల పర్యవేక్షణ పై నోడల్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ ను నియమించడమైనదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్. ఎస్ ఓ లు, ఎంపీడీవోలు, పిడి హౌసింగ్ అందరూ క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షించాలని అన్నారు. వారంలో ఒకరోజు సంయుక్త కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తారని ఆయన అన్నారు. సంయుక్త కలెక్టర్ పర్యవేక్షణలో ఎవరైనా లక్ష్యాలను పూర్తి చేయడంలో అలసత్వం వహించిన ఎడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని అధికారులను ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు,మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీవోలు, హౌసింగ్ ఈఇలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


Similar News